ఎండలతో జాగ్రత్త


Sat,May 18, 2019 01:18 AM

-డయేరియా, వడదెబ్బ బాధితులకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక చికిత్స
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో డయేరియా, వడదెబ్బ కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని నల్లకుంట ఫీవర్‌హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, చిన్నపిల్లల ప్రత్యేక దవాఖాన నిలోఫర్‌లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అన్ని ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా దవాఖానల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 42నుంచి 43డిగ్రీలు దాటి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాల్పుల ప్రభావం ఉంటుందని దీని వల్ల వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలతో డయేరియాకు గురయ్యే అవకాశమున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. తప్పని పరిస్థితిలో వెళ్లాల్సివస్తే ఎండ, వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలు, వడగాలుల కారణంగా వాంతులు, విరేచనాలు లేదా డయేరియాకు గురైన బాధితులు వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించాలన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు డీఎన్‌ఎస్, ఎన్‌ఎస్ తదితర ఫ్లూయిడ్స్‌తో పాటు యాంటిబయోటిక్స్, తదితర మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఎండలు తీవ్రంగా ఉన్నందున తరచూ నీరు ఎక్కువగా తాగాలని, సాధ్యమైనంత వరకు ద్రవ పదార్ధ్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిదని, కలుషిత నీరు, ఆహార పదార్థాలు వంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...