ఉపగ్రహ చిత్రాలతో సరిచూసుకుంటారు..


Thu,May 16, 2019 11:48 PM

-ఇక మొదలుకానున్న ‘బీఆర్‌ఎస్‌' తనిఖీలు
సిటీబ్యూరో: ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్‌) దరఖాస్తులకు త్వరలోనే కదలిక రానున్నది. దాదాపు మూడేండ్లుగా కోర్టులో నానుతున్న ఈ సమస్యకు ముగింపు పలికేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నడుంబిగించారు. కోర్టు ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయి తనిఖీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం వంద మంది ఔట్‌సోర్సింగ్‌ ఇంజినీర్లను వినియోగించనున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల నివేదిక ఆధారంగా న్యాయస్థానంలో తదుపరి తీర్పు వెలువడే అవకాశమున్నది.
అక్రమ భవనాలు, లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2015 చివర్లో బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు సుమారు 1.39 లక్షల దరఖాస్తులొచ్చాయి.

పథకానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం బీఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిశీలించి.. అందులో క్రమబద్ధీకరణకు అర్హతలేని భవనాలపై చర్యలు తీసుకోవాలని దాదాపు రెండేండ్ల కిందటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బల్దియాలో సిబ్బంది కొరత ఉన్నారంటూ.. ఇంతవరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు 100 మంది ఔట్‌సోర్సింగ్‌ ఇంజినీర్లను బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు వినియోగించాలని నిర్ణయించారు. వీరు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి దరఖాస్తులో పేర్కొన్న విధంగానే క్షేత్రస్థాయిలో నిర్మాణాలు ఉన్నాయా, లేక ఏమైనా తేడాలున్నాయా అనేది పరిశీలిస్తారు. త్వరలో ఇంజినీర్లకు దీనిపై అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంజినీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా క్రమబద్ధీకరణకు అర్హతగల దరఖాస్తులు, అర్హతలేనివి నిర్ణయించి న్యాయస్థానానికి నివేదిక సమర్పిస్తారు. కోర్టు నిర్ణయం అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం కనీసం మూడు నెలలు కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

మొబైల్‌ యాప్‌ ద్వారా..
బీఆర్‌ఎస్‌ కటాఫ్‌ డేట్‌ అనంతరం నిర్మించిన భవనాలను గుర్తించేందుకుగాను జీహెచ్‌ఎంసీ... తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే బల్దియా కొత్తగా నిర్మితమైన భవనాల ఉపగ్రహ చిత్రాలను సేకరించింది. అంతేకాకుండా, ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించి ఎన్‌ఆర్‌ఎస్‌ఏ చిత్రాలతో అనుసంధానం చేశారు. క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా ఇంజినీర్లు ఇంటిని ఫొటో తీసి ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పంపితే వెంటనే సదరు భవనం గతంలో నిర్మించిందా? లేక బీఆర్‌ఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ తరువాత నిర్మించిందా? అనేది వెంటనే తెలిసిపోతుంది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...