సర్కారు బడులే బెస్ట్‌..


Thu,May 16, 2019 11:44 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో సర్కారు బడులు ఔరా అన్పించాయి. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చెప్పే చదువే విద్యార్థుల ఒంటబడుతుందనే విషయాన్ని మరోసారి నిరూపణ అయింది. రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు బడులు వెలవెలబోయాయనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రభుత్వ బడుల్లో కేవలం 1,789 మంది ఫెయిలైతే.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఏకంగా 17,968 మంది ఫెయిలయ్యారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మనం వద్దనుకుంటున్న బడులే ఉత్తమంగా నిలిచాయని, రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సర్కారు బడుల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు.

ప్రభుత్వ విద్యార్థులకు 10/10
జిల్లాలో 188 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 25 సర్కారు బడుల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. లాలాపేట ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన తలసాని లక్ష్మీస్థితప్రజ్ఞకు 10 జీపీఏ, బొల్లారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మాదాసు శ్రావ్య 10 జీపీఏ తెచ్చుకున్నారు. ఎనిమిది మంది 9.8, 21 మందికి 9.7 జీపీఏ, 29 మందికి 9.5 జీపీఏ, 36 మంది 9.3 జీపీఏ, 41 మంది 9.2 జీపీఏ, 71 మంది 9 జీపీఏ సాధించారు. మొత్తం 198 మంది విద్యార్థులు 9 నుంచి 10 జీపీఏ సాధించడం గమనార్హం. అదే ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల విషయానికొస్తే.. 1,102 ప్రైవేటు పాఠశాలల నుంచి 63,311 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 52,593 మంది ఉత్తీర్ణత సాధించారు. కేవలం 816 మంది విద్యార్థులు మాత్రమే 10/10 సాధించారు. రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేసి.. పుస్తకాలతో కుస్తీ పట్టించినా.. ప్రభుత్వ పాఠశాలలను మించలేకపోయాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్కారు బడులే ఉత్తమం అనే ఆలోచనకు వచ్చారు.

హిమాయత్‌నగర్‌ టాప్‌..
హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో దుమ్ములేపాయనే చెప్పాలి. ఎందుకంటే.. గతేడాదితో పోల్చితే ప్రభుత్వ బడుల్లో 12 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. అదే ప్రైవేటు బడుల్లో కేవలం 7 శాతానికే పరిమితమైంది. జిల్లాలోని మండలాల పరంగా చూస్తే.. హిమాయత్‌నగర్‌ 89.69 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. ఈ మండలంలో 456 మంది పరీక్షలకు హాజరైతే.. కేవలం 47 మంది మాత్రమే ఫెయిలయ్యారు. దీంతో పాటు జిల్లాలోనే అత్యధికంగా 1,061 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్న ఖైరతాబాద్‌ మండలం 85.39 శాతం ఉత్తీర్ణతతో ఏడో స్థానంలో నిలిచింది. గోల్కొండ 74.28 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

సర్కారు బడులే ఉత్తమం..
సబ్జెక్టుల వారీగా ప్రైవేటు, ప్రభుత్వ బడులను పోల్చి చూస్తే.. సర్కారు బడులే ఉత్తమంగా ఉన్నాయి. ఆయా వివరాలను చూస్తే.. ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో 231 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫెయిలైతే.. 2,089 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఫెయిలయ్యారు. సెకండ్‌ లాంగ్వేజ్‌లో ప్రభుత్వ బడుల విద్యార్థులు 32 మంది, ప్రైవేటు బడుల విద్యార్థులు 625 మంది ఫెయిలయ్యారు. ఇలా మొత్తంగా అన్ని సబ్జెక్టుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 1,789 మంది ఫెయిలైతే.. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఏకంగా 17,968 మంది ఫెయిలవ్వడం గమనార్హం.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...