ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కితే సీజ్‌


Thu,May 16, 2019 12:35 AM

-మే 15తో ముగిసిన విద్యాసంస్థల బస్సుల ‘ఫిట్‌నెస్‌'
-నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌
-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : ప్రతీ సంవత్సరం లాగానే మే 15న స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ ఈ ఏడాది కూడా ముగియడంతో గురువారం నుండి ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కే బస్సులపై కొరడా ఝలిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తుండగా అందులోభాగంగా గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ , సంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక నజర్‌ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న స్కూల్‌ బస్సుల్లో సగానికి మించి గ్రేటర్‌ పరిధిలోని నాలుగు జిల్లాలో మాత్రమే ఉన్నాయి. గత సంవత్సరం చాలా బస్సులు ఫిట్‌నెస్‌ చేపించుకోకుండా రోడ్డెక్కగా రవాణాశాఖ స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాయి. ఒకే నెంబరుపై రెండు బస్సులను వేర్వేరు రూట్లలో తిరుగుతున్న స్కూల్‌ బస్సుల్లో కొన్ని పట్టుబడ్డాయి.

హైదరాబాద్‌ జేటీసీ పరిధిలో ఇటువంటి బస్సులను గత సంవత్సరం రవాణాశాఖ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఈ సంవత్సరం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ప్రవీణ్‌రావు రాష్ట్రంలోనే మొట్టమొదటగా తన కార్యాలయాల్లో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్‌టీవోలు, ఎంవీలను ఇంఛార్జీలుగా వేసి సదస్సులు ప్రారంభించారు. బుధవారం తన పరిధిలోని మన్నెగూడ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,001 విద్యా సంస్థల బస్సులుండగా గ్రేటర్‌లో 11,996 విద్యా సంస్థల బస్సులున్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం స్కూల్‌ బస్సు తప్పక పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో 1. రిజిస్ట్రేషన్‌ సర్టిపికెట్‌(ఆర్‌సీ) 2. వ్యాలీడ్‌ ఇన్స్యూరెన్స్‌ సర్టిఫికెట్‌ 3. వ్యాలీడ్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ 4.పర్మిట్‌ 5 ట్యాక్స్‌ పేమెంట్‌ రశీదు.బకాయిలు లేకుండా 6. పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ 7. డ్రైవింగ్‌ చేసే డ్రైవర్‌ లైసెన్సు తప్పక వాహనంతో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇవి తప్పని సరి...

స్కూల్‌ బస్సును కండిషన్‌గా, విద్యార్థులకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ మోటారు వెహికల్‌ రూల్స్‌ 1989 ప్రకారం రూల్‌ నెంబర్‌ (186 జీ) ప్రకారం తెలంగాణలో విద్యాసంస్థల బస్సులు పూర్తి పసుపు రంగులో ఉండాలి. ఆ బస్సుపై పెద్ద అక్షరాలతో స్కూల్‌ బస్సు అని రాయడం తప్పని సరి. అద్దాలకు గ్రిల్స్‌, పిల్లలు ఎక్కడానికి వీలుగా మెట్లు కిందవరకు దగ్గరదగ్గరగా ఉండాలి. ఎమర్జెన్సీ డోర్‌, ఫైర్‌ బాక్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ అమర్చాలి. రవాణా శాఖ నిబందనల ప్రకారం బస్సు ఫిట్‌నెస్‌ చేయించాలి. డ్రైవరు వయ స్సు 60 ఏళ్లు మించరాదు. అదే విధంగా బస్సు నడిపే అనుభం 5 ఏళ్ల అనుభవం ఉన్న వారినే స్కూలు బస్సు డ్రైవర్‌గా నియమించుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్‌ ప్రతి మూడు నెలలకు ఓసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా తప్పనిసరి. బస్సుల్లో ఆ బస్సు నడిపే డ్రైవర్‌ ఫోటో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది..బస్సుకున్న అటెండర్‌, డ్రైవరు బస్సు బోర్డింగ్‌ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు స్టార్ట్‌ అయ్యేటప్పుడు లేదా రివర్స్‌ చేసుకునేటప్పుడు అటెండర్‌ బస్సు అన్ని పక్కల చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బస్సుకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

బస్సు ఇలా ఉండి తీరాల్సిందే.లేదంటే ఫిర్యాదు చేయాలి


రూల్‌ 185,క్లాజ్‌ ఎఫ్‌ ప్రకారం విద్యా సంస్థలకు చెందిన బస్సులు కొన్ని లక్షణాలు కలిగి ఉండాల్సి ఉంటుంది.
1. ప్రతీ బస్సు స్కూల్‌ లేదా కాలేజీ పేరుతో పాటు విద్యాసంస్థ అడ్రస్‌, ఫోన్‌నెంబరు, మొబైల్‌ నెంబర్‌ బస్సుకు ఎడమవైపున తప్పక రాయించాల్సి ఉంటుంది.
2. 60 సంవత్సరాల వయస్సు దాటిన డ్రైవరుతో స్కూల్‌ బస్సు నడిపించరాదు.
3. డ్రైవరు ఆరోగ్యానికి సంబంధించి షుగర్‌, బీపీ, దృష్టిలోపం ఉందో లేదో విషయాన్ని స్కూల్‌ బస్సుల యాజమాన్యాలు తమ స్వంత ఖర్చుతో ఆరోగ్య పరీక్షలు మూడు నెలలకోసారి చేపించాలి. హెల్త్‌ రిపోర్డును భద్రపర్చాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాలదే.
4. డ్రైవరును అపాయింట్‌మెంట్‌ చేసుకున్న విషయాన్ని విధిగా పేరెంట్స్‌ కమిటీకీ తెలియచేయాల్సి ఉంటుంది.
5. జేటీసీ/డీటీసీ/ఆర్‌టీవోలు నిర్వహించే అవగాహన సదస్సుకు ప్రతీ డ్రైవరు సంవత్సరంలో తప్పకుండా ఒక సారి హాజరు కావాల్సి ఉంటుంది.
6. విద్యాసంస్థల బస్సుల డోర్లకు భద్రతాపరమైన లాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలి.
7, బస్సు కిటికీలకు 3 ఇంచుల గ్యాప్‌తో రాడ్లు వేయాలి 8, సీటింగ్‌ కెపాసిటీకీ మించి విద్యార్ధులను ఎక్కించుకోవద్దు
9. ప్రతీ విద్యాసంస్థ అవసరమున్న బస్సులకు మించి ఒక అదనపు బస్సును ఉంచుకోవాలి.
10 , విద్యాశాఖ, పోలీసుశాఖ, రవాణాశాఖ సమన్వయంతో ప్రతీ విద్యా సంస్థ రోడ్‌సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
11. ఫుట్‌బోర్డును భూమినుండి 325 మిల్లీమీటర్లు మాత్రమే ఎత్తు ఉండాలి. స్టెప్స్‌ను నాన్‌స్లిప్‌ ట్రెడ్స్‌తో తయారుచేయించాలి.
12. ఎంట్రీ, ఎగ్జిట్‌ డోర్ల దగ్గర దిగడానికి, ఎక్కడానికి స్టీలు రాడ్స్‌ను ఏర్పాటుచేయాలి.
13. బస్సులో ప్రతీరోజు ఒక టీచర్‌తోపాటు ఒక పేరెంట్‌ విద్యార్థులతో ప్రయాణించాల్సి ఉంటుంది.
14. అటెండర్‌ బస్సుకు సంబంధించిన సేఫ్టీ ప్రీకాషన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...