బీరప్ప కల్యాణం..కురుమల సంబురం


Thu,May 16, 2019 12:29 AM

-ఆకట్టుకునే వీరగంధర్వుల విన్యాసాలు
-కురుమల ప్రత్యేక పూజలు
- నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
ఉప్పల్‌, నమస్తే తెలంగాణ :
బీరప్ప జాతర కురుమల ఇండ్లలో సంబురాలు నింపనున్నది. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నది. మరుగునపడిన చరిత్రను, నాటి కళాప్రదర్శనలు, ఆచారాలు, వ్యవహారాలను ప్రతిబింబిస్తున్నది...పల్లెలకే పరిమితమైన సంస్కృతి ఉత్సవాన్ని పట్నంలో ప్రదర్శిస్తున్నారు. ఊరంత ఉత్సవంలా వారం రోజులపాటు బీరప్ప మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉప్పల్‌లో ఏర్పాట్లు చేశారు.

ఘనంగా రేణుక ఎల్లమ్మ పూజ.. ఉత్సవ ర్యాలీతో ప్రారంభ ఘట్టం
కురుమలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే బీరప్ప జాతర ఆరంభ ఘట్టం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ మేరకు బీరప్ప ఉత్సవాలకు ముందుగా జరుపుకొనే బీరప్పస్వామి కామరాతిదేవి, శ్రీమహంకాళి, శ్రీపోచమ్మ, బయన్న, ఎల్లమ్మదేవిలకు బీరప్పగడ్డలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీగా హరిజనబస్తీకి వెళ్లి లందకు పూజలు చేసి పెద్ద కురుమ వద్ద విరాళాలు సేకరించారు. శివుడికి ప్రతిరూపంగా కొలిచే బీరప్ప స్వామికి పూజలు చేశారు. హరిజనవాడలోని గోలంలోని ఎల్లమ్మకు, వేపచెట్టుకు పూజలు చేశారు. ఒడిబియ్యం పోసి, పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక, తదితర వస్తువులు సమర్పించారు. అనంతరం ఒగ్గు కథను వినిపించారు.

పరమశివుడికి ప్రతిరూపం..
పరమ శివుడికి ప్రతిరూపంగా బీరప్పస్వామిని కొలుస్తారు. ప్రతి ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే బీరప్ప ఉత్సవాలు, ఉప్పల్‌లో మాత్రం పుష్కర కాలానికి ఒకసారి నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ఉత్సవాలను అధికారికంగా నెలరోజుల ముందే ప్రారంభిస్తారు. అయితే వారంపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా మందమాసాని, గొర్లుదాటుడుతో ఉత్సవం ప్రారంభమవుతుంది. అదేవిధంగా శుక్రవారం 17న, బీరప్పస్వామి మైలలు తీయుట చేస్తారు. మే 18న గంగపూజ చేస్తారు. ఆదివారం బీరప్పస్వామి కట్నం పెట్టుట, సరుగువేయడం, బోనాలు, బీరప్ప ఒగ్గుకథ నిర్వహిస్తారు. వీటితోపాటు సోమవారం బీరప్పస్వామి కామరతిదేవిల కల్యాణం, గొర్లమందమీద సరుగువేయడం చేస్తారు. మంగళవారం ఎల్లమ్మ పరుశురాముని అలంకరణతో ఒగ్గుకథ, గారడివేశం ఉంటుంది. బుధవారం నాగవెల్లి , గొర్ల కల్యాణం, గొర్లకు సల్లలు పోయడం చేస్తారు. గురువారం తొక్కుడు మైలలు, బయ్యన్నపూజ నిర్వహిస్తారు.

నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
ఉప్పల్‌లోని బీరప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మే 16 నుంచి బీరప్పస్వామి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు సుమారు 3 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి హాజరుకానున్నారు. వీటిలో భాగంగా ఉత్సవాలకు ఆలయ కమిటీ, కురుమ సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్‌లోని బీరప్ప దేవాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. మొదటి రోజు మందమాసాని ఉత్సవంతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

గంగమ్మ బోనం.. ఆకట్టుకునే క్రతువు
వేడుకల్లో అత్యంతంగా ఆకట్టుకునే సన్నివేశాలు గంగ బోనంతో ప్రారంభమవుతాయి. కళాకారుల ప్రదర్శనలు, సంస్కృతి ఉత్సవం ఉంటాయి. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ప్రతిమలను గంగలో కొత్తకుండలో పెట్టి ఊరి శివారులోని వ్యవసాయ భావిలో దాచిపెడతారు. అయితే ఉప్పల్‌లో మాత్రం ఉప్పల్‌ మినీట్యాంక్‌బండ్‌లో చేపడుతున్నారు. మరుసటి రోజు డోలు, మేళాలు, చప్పుళ్లతో వీరగంధర్వులు ఊరేగింపుగా బావి(కొలను) వద్దకు వెళ్లి అందులోని స్వామివారిని వెలికితీసి ఆలయానికి తరలిస్తారు. ఈ క్రతవు ఆద్యంతం ఆకట్టుకుంటూ, సంస్కృతిని చాటిచెపుతుంది.

ఇంటింటా సంబురం
ఉప్పల్‌లోని ప్రతి ఇంట్లో కల్యాణం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. కురుమలు వారి కుటుంబాలతోపాటు, బంధువులను ఆహ్వానించి వేడుకలు చేసుకుంటారు.
ప్రముఖుల హాజరుబీరప్ప ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...