టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ !


Wed,April 24, 2019 12:29 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిర్మాణరంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో కొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం, ఇకనుంచి భవనాల టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాదు, గ్రీన్ బిల్డిం గ్ నిబంధనల ప్రకారం ఇంట్లో గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీఓ ఎం.ఎస్. నెం-50 జారీచేసింది. నిర్మాణ అనుమతులకు సంబంధించి కొన్ని నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీచేసిన నేషనల్ బిల్డింగ్ కోడ్-2016కు అనుగుణంగా సవరించాలని బిల్డర్స్, డెవలపర్స్ అసోసియేషన్స్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ మేరకు నిబంధనలను సవరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, భవనం టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకునేందుకు అనుమతి జారీచేస్తారు.

అలాగే, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ హోమ్స్ నిబంధనల ప్రకారం గదుల్లో గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత గృహాలు కానిపక్షంలో, నిర్మాణదారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీకి ముందే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాతే ఓసీ జారీచేయాలి. ఇంతకాలం ఓసీ జారీ అయిన తరువాతే మంచినీరు, విద్యుత్ కనెక్షన్లు మంజూరుచేసే విధానం ఉండగా, తాజా సవరణ ప్రకారం ఓసీ జారీకి ముందే ఈ రెండు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ప్రక్రియ పూర్తిచేయవచ్చు. అయితే చివరిగా ఓసీ జారీచేసిన తరువాతే కనెక్షన్లు మంజూరుచేయాల్సి ఉంటుంది. హైరైజ్ బిల్డింగ్‌ల సెట్‌బ్యాక్‌లను నేషనల్ బిల్డింగ్ కోడ్-2016 ప్రకారం నిర్థారించారు. దీని ప్రకారం ఎత్తైన భవనాలకు సెట్‌బ్యాక్‌లో కొంత ఊరట కల్పించినట్లు చెప్పవచ్చు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయేవారికి కొంత ఊరట కల్పించారు. ఇందులో భాగంగా ఫ్లోర్ టూ ఫ్లోర్ ఎత్తు, భవనం టైపు, నమూనా తదితర అంశాలు విస్తరణకు ముందు, విస్తరణకు తరువాత ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేకుండా సవరించారు. అయితే రోడ్డు విస్తరణకు ముందు విస్తరణకు తరువాత బిల్డింగ్ ఏరియా అనుమతించిన మేరకు మాత్రమే ఉండాలే స్పష్టం చేశారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...