అక్రమంగా తిష్టవేసిన విదేశీయులు డిపోర్ట్


Wed,April 24, 2019 12:27 AM

-వీసా గడువు ముగిసినా... యథేచ్ఛగా నివాసం..
- కొందరు నేరాల బాట
- ప్రత్యేక దృష్టి పెట్టిన సిటీ పోలీస్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో అక్రమంగా నివాసముండే విదేశీయులు పట్టుబడ్డారంటే వెంటనే వారిని డిపోర్ట్ చేస్తున్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగం కోసం వివిధ దేశాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్న వారు వేలల్లోనే ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది నిబంధనల ప్రకారం ఉంటున్నవారే ఉన్నారు.. నిబంధనలను అతిక్రమించి ఉంటున్న వారు కొద్ది మందే ఉన్నా.. వారిలో నేరాలు చేసే వారు ఉంటున్నారు. తమ దేశం నుంచి నిర్ణిత సమయం గడువుతో ఇక్కడకు వివిధ పనుల కోసం వచ్చేవారు, ఆ గడువు ముగియడంతోనే దానిని తిరిగి పునరుద్ధ్దరించుకోవాలి. చాలామంది తమ వీసాలను పునరుద్ధరించుకోకుండా అక్రమంగా మన దేశంలో నివాసముంటున్నారు. అలాంటి వారిలో కొందరు హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోను ఉన్నారు. ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చినవారే నేరాలు చేస్తూ తరచు పోలీసులకు పట్టుబడుతున్న సంఘటనలున్నాయి. పోలీసులకు పట్టబడ్డ సమయాల్లో వారి వీసా, పాస్‌పోర్టులను పరిశీలిస్తే, అలాంటి వారు అక్రమంగానే నివాసముంటున్నట్లు వెల్లడవుతుంది. నిబంధనల ప్రకారం అక్రమంగా ఉంటున్న వారిని వారి స్వదేశానికి వెంటనే పంపించేయాల్సి ఉంటుంది. అయితే నేరం చేసి పట్టుబడ్డ సమయంలో వారిని వెంటనే పంపించివేయడం వల్ల, చేసిన తప్పుకు శిక్ష అనుభవించినట్లు ఉండదు, కొన్నిసార్లు బాధితులకు కూడా న్యాయం జరుగదు. దీంతో చాల కేసులలో కోర్టులో నిందితులను పోలీసులు హాజరు పరుస్తుంటారు.

డ్రగ్స్.. సైబర్‌నేరాల్లో..!
విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా తిష్టవేసే వారితో పాటు నిబంధనల మేరకు ఉంటున్న వారు కూడా నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్, సైబర్‌నేరాల్లో ఎక్కువగా విదేశీయులు ఉంటున్నారు. గోవా, ముంబయి అడ్డాగా డ్రగ్స్‌ను కొని హైదరాబాద్ వంటి నగరాల్లో విక్రయిస్తుంటారు. గోవా, ముంబయి వంటి నగరాల్లోను ఇలాంటి వారు వీసా గడువు పూర్తయినా, నిబంధనలకు విరుద్ధంగానే ఉంటున్నారు. ఇలాంటి వారు హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే విదేశీయులతో స్నేహం చేస్తూ డ్రగ్స్ దందాలను చేస్తుంటారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్ దందా చేసే విదేశీయులు పట్టుబడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే సైబర్ నేరాల్లోను విదేశీయులు ఆరి తేరారు. సైబర్‌నేరాల్లోను సోషల్‌మీడియా, సెల్‌ఫోన్ మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా అమ్మాయిలా వలవేసి.. అమెరికా సైన్యంలో పనిచేస్తున్న తాను.. డాలర్లను బహుమతిగా పంపిస్తున్నానని నమ్మించి నగరానికి చెందిన ఒక యువకుడిని మోసం చేసిన ఘటనలో నైజీరియా దేశానికి చెందిన ఒక యువకుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకొని లక్షల్లో ముంచేస్తున్నారు.
పట్టుబడితే.. డిపోర్టేషన్..!
విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే నగర పోలీసులు డిపోర్ట్ చేయిస్తున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు తరచు విదేశీయుల అక్రమ తిష్టపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల సుమారు 10 మంది వరకు అక్రమంగా తిష్టవేసిన వారిని స్వదేశాలకు డిపోర్ట్ చేశారు. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తిష్టవేసిన వారిని గుర్తించి పోలీసులు సీసీఎస్‌కు నివేదిక ఇస్తున్నారు. ఈ నివేదికను ఫారినర్ రిజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపి, అక్కడి నుంచి డిపోర్టు ఆర్డర్లను తెప్పిస్తున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...