ప్రకటనల పన్ను.. పక్కదారి


Tue,April 23, 2019 03:03 AM

- సైన్ బోర్డులు, బస్ షెల్టర్ల పన్నులూ మాయం
- రావాల్సింది రూ. 100 కోట్లు, వస్తున్నది రూ. 32కోట్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ప్రకటనల పన్ను పక్కదారి పడుతున్నది. దాదాపు రూ. 100 కోట్లు రావాల్సి వుండగా, గతేడాది వసూలైన పన్ను కేవలం రూ. 32 కోట్లు మాత్రమే. హోర్డింగులు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు, బస్ షెల్టర్లు, మెట్రోరైలు పిల్లర్లపై ప్రకటనలు ఏర్పాటు చేస్తున్నా, లక్షల సంఖ్యలో దుకాణాల ముందు సైన్‌బోర్డులు పెడుతున్నా బల్దియాకు మాత్రం ఆదాయం రావడం లేదు. కేవలం అనుమతులున్న సుమారు 2000 హోర్డింగులు, యూనీపోల్స్ పన్ను మాత్రమే సక్రమంగా వసూలవుతున్నది.

నగరంలో ఏర్పాటుచేసే హోర్డింగులు, వివిధ రకాల ప్రకటనలు, దుకాణాల ముందు ఏర్పాటు చేసే సైన్‌బోర్డులు, మొట్రోరైలు పిల్లర్లు, ఇతర ఆస్తులపై ఏర్పాటు చేసే ప్రకటనలు తదితర వాటి ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ. 100 కోట్లమేర ప్రకటనల పన్ను వస్తుందని గత నాలుగేండ్ల క్రితమే జీహెచ్‌ఎంసీ అంచనాలు రూపొందించింది. ముఖ్యంగా నగరంలో మొబైల్ ప్రకటనల సంస్కృతి ఎక్కువైంది. క్యాబ్‌లు, ఆటోలు, వ్యాన్‌లపైనే కాకుండా రిక్షాలు, ఆటోలను ప్రత్యేకంగా మొబైల్ ప్రకటనల కోసం డిజైన్ చేయించి వాటిపై భారీ ప్రకటన బోర్డులను ఏర్పాటుచేసి నగరంలో తిప్పుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సులైతే చెప్పనక్కర్లేదు. ఈ ప్రకటనలకు జీహెచ్‌ఎంసీ పన్నులు నిర్ధారించినప్పటికీ ఒక్కపైసా కూడా వసూలు కావడంలేదు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోగా, క్షేత్రస్థాయి అధికారులు అమ్యామ్యాలతో జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రతి ప్రకటనకూ నిర్ణీత ఫీజు తప్పనిసరి...
ఎటువంటి ప్రకటనైనా ఉచితంగా ప్రదర్శించుకునే అవకాశం లేదు. ఏ ప్రకటన, ఎక్కడ ప్రదర్శించాలన్నా, చివరికి ప్రైవేట్ గోడలపై ప్రకటనలు వేయాలన్నా బల్దియాకు పన్ను చెల్లించాల్సిందే. దీనికోసం జీహెచ్‌ఎంసీ వివిధ ప్రకటనల శ్రేణులను రూపొందించి పన్నులు నిర్ధారించింది. ఇందులో మొబైల్ ప్రకటనలు ముఖ్యమైనవి. నగరంలో వాహనాల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో, ఇంచుమించు అంతేస్థాయిలో మొబైల్ ప్రకటనల సంస్కృతి విస్తరిస్తోంది. ఉదాహరణకు ఆర్టీసీ బస్సులను తీసుకుంటే, నగరంలో సుమారు 4000 ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, 90 శాతానికిపైగా బస్సులపై ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. నగరంలో ఏ మూలన కూర్చొని సర్వే చేసుకున్నా ఈ విషయం స్పష్టమవుతున్నది. మొబైల్ ప్రకటనల వల్ల ఆయా ఉత్పత్తుల(ప్రకటనలో పేర్కొనే)కు విరివిగా ప్రచారం లభిస్తుండటంతో రోజురోజుకీ వీటికి ఆదరణ పెరుగుతున్నది.

ఆర్టీసీ నుంచి ప్రకటనల పన్ను రావడంలేదు..
మొబైల్ ప్రకటనలకు ఆదరణ పెరుగుతున్నా జీహెచ్‌ఎంసీకి మాత్రం ఒక్క పైసా ఆదాయం రావడంలేదు. మొబైల్ ప్రకటనలకు ప్రత్యేకంగా ధర నిర్ణయించినప్పటికీ వాటి వసూళ్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి నిలపడంలేదు. ముఖ్యంగా ఆర్టీసీ ఒక్క రూపాయి కూడా బల్దియాకు ఫీజు చెల్లించకపోవడమే కాకుండా కనీసం అనుమతులు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నిస్తే, ఫీజు నిర్ణయించినప్పటికీ ఇంకా ఆర్టీసీనుంచి వసూలు చేయడంలేదని బదులిచ్చారు. అటు ఆర్టీసీ అధికారులు సైతం బస్సులపై ప్రకటనలు వేసుకున్నందుకుగాను ప్రకటనకర్తలనుంచి ఒక్కో బస్సుకు ఎంత అద్దె తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే, జవాబు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీన్నిబట్టి ఆర్టీసీ బస్సులపై వేస్తున్న ప్రకటనల ఆదాయం ఎవరికి చెందుతుందో అంతుబట్టడంలేదు. ఒక్కో బస్సుకు ప్రకటనల పన్ను రూ. 4000 జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వ్యాన్లు, జీబులు, ఆటోలు, రిక్షాలు తదితరవాటికి విడివిడిగా ధరలు ఖరారుచేశారు. అయినా అవేవీ వసూలు కావడంలుదు.

బస్ షెల్టర్లు, మెట్రో పన్నూ వసూలు కావడం లేదు..
గతంలో బస్ షెల్టర్లను నిర్మించిన ఆయా ఏజెన్సీలకు వాటిపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునే అధికారం ఉన్నప్పటికీ, ఆ గడువు కూడా ఎప్పుడో పూర్తయింది. అయినా కొత్త బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామనే సాకుతో జీహెచ్‌ఎంసీ అధికారులు పన్నులు వసూలు చేయడంలేదు. దీంతో బల్దియాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతున్నది మెట్రోరైలు ప్రాజక్టు మూలంగా నగరంలో సుమారు 72 కిలోమీటర్లమేర ప్రధాన రోడ్డుపై హోర్డింగులు, ఇతర ప్రకటనలు తగ్గాయని, ఆ మేరకు తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకుగాను మెట్రోరైలు కారిడార్‌ను ప్రత్యేక శ్రేణికింద చేర్చి ప్రకటనల పన్నును హోర్డింగులకన్నా అధికంగా నిర్ణయించారు. అయితే, మెట్రో రైలు నిర్వాహకులు నామమాత్ర ఫీజు మాత్రమే చెల్లిస్తామని పేర్కొంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సైన్‌బోర్డుల ఫీజులోనూ గోల్‌మాల్..
దుకాణాల ముందు ఏర్పాటు చేసుకునే సైన్‌బోర్డులకు కూడా జీహెచ్‌ఎంసీకి ఫీజు చెల్లించక తప్పదు. సైన్‌బోర్డులను నాలుగు శ్రేణులుగా విభజించి ప్రతి చదరపు మీటర్‌కు రూ. 600, రూ. 750, రూ. 1000, రూ. 1250 చొప్పున ఫీజులు నిర్ధారించారు. నగరంలో సుమారు లక్షన్నరకుపైగా దుకాణాలు జీహెచ్‌ఎంసీనుంచి వ్యాపార లైసెన్సులు పొందగా, లైసెన్సులు లేకుండా కొనసాగుతున్న దుకాణాలు వేల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. లైసెన్సు పొందిన దుకాణదారులు నిర్ణీత సైజులో మాత్రమే బోర్డు ఏర్పాటు చేసుకొని దుకాణం పేరు రాసుకునే అధికారం ఉన్నది. అంతేతప్పా తమ ఇష్టారాజ్యంగా బోర్డులు ఏర్పాటు చేసుకునే వీలులేదు. సైన్‌బోర్డు సైజు, దానికి ఏర్పాటు చేసిన లైట్లు(గ్లో సైన్‌బోర్డు) ఆధారంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దుకాణదారులు ఇష్టారాజ్యంగా భారీసైజు బోర్డులు ఏర్పాటు చేసుకుంటూ జీహెచ్‌ఎంసీకి మాత్రం పన్ను చెల్లించడంలేదు. సైన్‌బోర్డుల ద్వారానే కనీసం రూ. 20 కోట్లకుపైగా పన్ను రావాల్సి ఉందని బల్దియా అంచనా. కాగా, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి వస్తున్నది రూ. రెండు కోట్లలోపే.

వచ్చింది రూ. 32 కోట్లే...
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల పన్ను ద్వారా రూ. 32 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ పన్ను కేవలం అనుమతులున్న యూనీపోల్స్, హోర్డింగులకు సంబంధించినది మాత్రమే కావడం విశేషం. సైన్‌బోర్డులు, మొబైల్ ప్రకటనల పన్ను, మెట్రోరైలు నుంచి ప్రకటనల పన్ను, అక్రమ హోర్డింగులు తదితర వాటిద్వారా సక్రమంగా వసూలు చేస్తే రూ. 100 కోట్లవరకూ ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సైన్‌బోర్డు ఫీజులకు వెళ్తే దుకాణదారులు కోర్టులో కేసులు వేస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...