జల సంరక్షణ అందరి బాధ్యత


Tue,April 23, 2019 02:55 AM

- నీటి వృథా అరికట్టడంపై నిర్వహించిన వాక్‌లో జలమండలి ఎండీ దానకిశోర్

బేగంబజార్ / సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తే ప్రతి రోజూ వృథా అవుతున్న నీటిని ఆదా చేయవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. నీటిని అరికట్టడం ద్వారా దాదాపుగా 30 లక్షల మంది నీటి అవసరాలు తీర్చవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాక్ (నీటి నాయకత్వం-జల సంరక్షణ) అనే కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నెక్లెస్‌రోడ్‌లోని జీహెచ్‌ఎంసీ, జలమండలి సంయుక్తంగా నీటి వృథాను అరికట్టడంపై వాక్ నిర్వహించారు. రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నీటి సదుపాయాలు చేస్తున్నామని, ఇందుకోసం వచ్చే రెండేళ్లలో 15వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వందల కిలో మీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి ప్రతి రోజు 50లక్షలు, ఏడాదికి 870 కోట్లు ఖర్చు చేసి నగరానికి నీటిని తీసుకువస్తే ఆ నీటిలో 10-15 శాతం నీరు నగరవాసుల ఇండ్ల వద్ద వృథాగా పోతుందని వివరించారు. భావితరాలకు ఉత్తమ జీవనాన్ని అందించేందుకుగానూ ప్రకృతి సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి నగరంలో 20వేల మంది స్వచ్ఛ వలంటీర్లతో నీటి సంరక్షణ, నగర పరిశుభ్రతకు విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు రెండు కోట్ల లీటర్ల విలువైన నీరు వృథాగా పోతుందని, ఈ విధానం అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దాదాపు కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరాన్ని కేవలం 16 వేల మంది పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారని, ఇంత పెద్ద మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛకార్యకర్తగా మారాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌ను సాఫ్ హైదరాబాద్-పాన్‌దార్ హైదరాబాద్ అనే నినాదంతో నగర స్వచ్ఛతతో పాటు జల సంరక్షణకు స్వచ్ఛందంగా పనిచేయడానికి ఆసక్తిచూసే నగరవాసులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని దానకిశోర్ సూచించారు.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాక్ ఇన్‌పేటివ్ అనే యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించామని, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని స్వచ్ఛ కార్యకర్తలుగా నమోదు అవ్వాలన్నారు. నగర ప్రజలకు ప్రతి రోజూ 458 ఎంజీడీల మేర నీటిని అందిస్తున్నామని, ఈ నీటి కోసం ప్రతి వెయ్యి లీటర్లకు రూ. 47ల వ్యయం అవుతుండగా నగరంలోని పేదలకు కేవలం రూ.7లకు, ఇతరులకు రూ.10లకు మాత్రమే అందిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్‌ఎంసీ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ తదితర సంస్థలకు చెందిన దాదాపు 5వేల మందిపైకి ఈ వాక్‌లో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, కమిషనర్లు ముషారఫ్ ఆలీ, రఘు ప్రసాద్, ఎన్ శ్రీనివాస్ రెడ్డి, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్లు సత్యసూర్యనారాయణ, శ్రీధర్ బాబు, అజ్మీరా కృష్ణ, విజయ్‌కుమార్ రెడ్డి, వీఎల్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎండీ దానకిశోర్ ఫొటో ఎగ్జిబిషన్, నీటి పొదుపు, నీటి వృథాపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...