డిసెంబర్ వరకు నీటి నిల్వలు..తాగునీటికి తిప్పలుండవు


Sun,April 21, 2019 01:05 AM

- డిమాండ్ మేరకు అదనపు వాటర్ ట్యాంకర్లు
- పకడ్బందీగా వేసవి కార్యాచరణ
- నీటి వృథాను అరికట్టేందుకు జలసైనికులు
- జలమండలి ఎండీ దానకిశోర్


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా కార్యాచరణ అమలు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. సింగూరు, మంజీరా నీటి నిల్వలు తగ్గిపోయినప్పటికీ కృష్ణా, గోదావరి నుంచి అదనపు జలాలను తరలిస్తున్నామన్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి లాంటి ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండా అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, వాటర్ ట్యాంకర్లు సమకూర్చుతున్నామని పేర్కొన్నారు. నగరానికి నీటి సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, వీటిలోకి వరద నీరు రాకపోయినా డిసెంబర్ వరకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అలాగే నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జల నాయకత్వం-నీటి సంరక్షణ (వాక్) పేరిట 20 వేల మంది వలంటీర్లతో జల సైన్యాన్ని రంగంలోకి దింపారు.

గ్రేటర్ తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నుంచి ప్రతి రోజూ 458.75 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీరు సరఫరా చేస్తున్నామన్నారు. సింగూరు, మంజీరా నీటి నిల్వలు అడుగంటిపోయినప్పటికీ గోదావరి, కృష్ణాల నుంచి అదనపు జలాలను తరలించి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాలుగు రిజర్వాయర్లలోని నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఈ జలాశయాల్లోకి వరద నీరు రాకపోయినా.. ప్రస్తుతం ఉన్న జలాశయాల నీరు రాబోయే డిసెంబర్ వరకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. శివారు ప్రాంతాల్లో నీటి సమస్యను అధిగమించేందుకు అదనంగా 13 ఫిల్లింగ్ స్టేషన్లు, 90 అదనపు ట్యాంకర్లను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా జరుగుతుందని, అవసరమైన ప్రాంతాల్లో రాత్రి సమయాల్లోనూ వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

- నాగార్జునసాగర్ నుంచి మూడు దశల్లో నగరానికి కృష్ణా జలాలను రోజూ 274.47 ఎంజీడీలను తరలిస్తున్నారు. ప్రస్తుతం 514 అడుగులు ఉండగా, 510 అడుగులకు చేరగానే అత్యావసర పంపింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయనున్నారు. సకాలంలో వర్షాలు పడకున్నా వచ్చే డిసెంబర్ నాటికి కృష్ణా జలాల తరలింపు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.

- నగర దాహార్తి తీర్చడంలో ముఖ్యమైనది గోదావరి నది. ఎల్లంపల్లి నుంచి నగరానికి రోజూ 160.78 ఎంజీడీలను తరలిస్తున్నారు. ఈ నీటి నిల్వలు రాబోయే సెప్టెంబర్ వరకు సరిపడా యథావిధిగా నీటి తరలింపు ప్రక్రియ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

- ఉస్మాన్‌సాగర్ నుంచి రోజూ 18.50 ఎంజీడీలు తరలిస్తుండగా, హిమాయత్‌సాగర్ నుంచి 5 ఎంజీడీలు తరలిస్తున్నామని, ఈ జంట జలాశయాల నీటి నిల్వలు వచ్చే డిసెంబర్ నాటి వరకు వస్తాయని అధికారులు అంచనా వేశారు.

డివిజన్ల వారీగా నీటి సరఫరా
జలమండలి పరిధిలో 21 డివిజన్ల పరిధిలో రోజూ 458.75 ఎంజీడీల ( మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటి సరఫరా జరుగుతుంది. చార్మినార్ (29.30 ఎంజీడీలు), అస్మాన్‌ఘడ్ (54.22(ఎంజీడీలు), ఆసిఫ్‌నగర్ (22.90), రెడ్‌హిల్స్ (21.50), నారాయణగూడ (25.70), ఎస్‌ఆర్ నగర్ (41.10), మారేడ్‌పల్లి (22.90), పటాన్‌చెరు (4.00), కూకట్‌పల్లి (23.41), ఎల్బీనగర్ (29.75), సాహెబ్‌నగర్ (9.62), కుత్బుల్లాపూర్ (18.50), సైనిక్‌పురి (18.09), ఉప్పల్ (22.32), హఫీజ్‌పేట (35.80), రాజేంద్రనగర్ (9.90), మణికొండ (6.01), బోడుప్పల్ (8.05), సాహేబ్‌నగర్-1 (2.62), గోదావరి (53.06)లు కలిపి రోజూ 458.75 ఎంజీడీల నీరు సరఫరా అవుతుందన్నారు. రోజు విడిచి రోజూ నీటి సరఫరా జరుగుతుందని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, సీజీఎం సుదర్శన్ తెలిపారు.

hyd

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...