గర్భిణుల ఇండ్ల వద్దకే ఆరోగ్య కార్యకర్తలు


Sun,April 21, 2019 12:59 AM

- సురక్షిత ప్రసవాలకు చర్యలు
- ముందుగానే హైరిస్క్ కేసుల గుర్తింపు
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గర్భవతుల ఇండ్ల వద్దకే వెళ్లి వారి వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు సమర్పించేందుకు నగరంలోని ఆరోగ్య కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మహిళా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు గర్భిణుల సమాచార సేకరణ తదితర విధులు నిర్వర్తిస్తున్నారు. వీటితోపాటు గర్భిణుల ఆరోగ్య స్థితిగతులను సైతం తెలుసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైద్యాధికారులకు చేరవేయడంతోపాటు అదే సమయంలో మహిళలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై శనివారం కింగ్‌కోఠి జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈసందర్బంగా డాక్టర్ వెంకటి మాట్లాడుతూ గర్భవతుల సమాచారాన్ని ఎప్పకప్పుడు, సకాలంలో నమోదు చేయాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. కాన్పు జరిగిన తరువాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులకు క్రమం తప్పకుండా అవసరమైన వైద్యపరీక్షలు చేయించేలా ఆరోగ్య కార్యకర్తలు పనిచేయాలన్నారు.

హైరిస్క్ కేసులను గుర్తించండి
ఆరోగ్య కార్యకర్తలు గర్భిణుల ఇండ్ల వద్దకు వెళ్లినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించాలని జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. గుర్తించిన హైరిస్క్ కేసులను పేట్లబుర్జ్, నిలోఫర్, గాంధీ వంటి సూపర్‌స్పెషాలిటీ దవాఖానలకు రిఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ప్రతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న గర్భిణుల ఈడీడీ(ప్రసవించే అంచనా తేదీ)లను ఉంచాలన్నారు.

మాతా శిశువుల రిజిస్టర్లు తప్పనిసరి
ప్రతి ఆరోగ్య కేంద్రంలో తల్లీబిడ్డలకు సంబంధించిన పూర్తి వివరాలతో రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని డా.వెంకటి ఆరోగ్య కార్యకర్తలు, సంబంధిత వైద్యాధికారులకు సూచించారు. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

100 శాతం వ్యాక్సినేషన్ వేయించాలి
ప్రతి శిశువుకు 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతివారం ఎంతమంది పిల్లలకు ఏ వ్యాక్సినేషన్ ఇప్పించాలో డ్యూ లిస్టు తయారు చేసుకుని బాలింతల ఇండ్ల సందర్శనకు వెళ్లినప్పుడు బిడ్డకు ఏ టీకాలు వెయించాలో తల్లులకు తెలియజేయాలన్నారు.

కేసీఆర్ కిట్స్ అందేలా చూడాలి
కేసీఆర్ కిట్స్ స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు మాట్లాడుతూ బర్త్‌ప్లానింగ్ పోర్టల్‌లో గర్భిణుల వివరాలను సకాలంలో రిజిస్టర్ చేయించి, అర్హులైన వారికి కేసీఆర్ కిట్స్ అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...