ఉన్నత ప్రమాణాల్లో హైదరాబాద్ మెట్రో బెస్ట్


Sun,April 21, 2019 12:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నదని మహిళా ప్రముఖులు కితాబిచ్చారు. తరుణి మధురానగర్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన తరుణి ఫెయిర్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథులుగా శనివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ డైరెక్టర్, కమిషనర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు మెట్రోరైలులో ప్రాధాన్యత ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతీ నగరం అభివృద్ధికి రవాణా సౌకర్యాలే కీలక భూమిక పోషిస్తాయన్నారు. మెట్రోరైలు ప్రయాణంలో ఎటువంటి క్రైంరేటు లేదని, ఈవ్‌టీజింగ్ వంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు. మెట్రోరైలులో మహిళలకు ఒక కోచ్‌తోపాటు స్టేషన్‌కు మహిళా పదం స్ఫురించేలా తరుణి పేరు పెట్టడం శ్లాఘనీయమని అన్నారు. స్టేషన్ల పరిసర ప్రాంతాల అవసరాలు తీర్చడం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్‌లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఆకాశానికి నిచ్చెన వేసే శక్తి మహిళాశక్తికి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో వరల్డ్‌క్లాస్ మెట్రోగా అభివర్ణించారు. మహిళలు బయటకు రావడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌లో భద్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అభివృద్ధి జరుగడం ద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిఖాగోయెల్ మాట్లాడుతూ మెట్రో ద్వారా సురక్షిత ప్రయాణం ఉంటుందని అన్నారు.

మహిళలు ఇబ్బంది పడకుండా షీటీంలు మెట్రోరైలుతోపాటు స్టేషన్లలో నిఘా ఉన్నదన్నారు. ఫెర్నాండేజ్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎవిత ఫెర్నాండేజ్ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోరైలులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కరుణగోపాల్ మాట్లాడుతూ రవాణా సదుపాయాలు ఉంటే మహిళలు అభివృద్ధి పథం వైపు పయనిస్తారన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అతిథులకు మెట్రో ప్రాధాన్యతను వివరించడంతోపాటు తరుణి ఫెయిర్ ఏర్పాట్లలో ఉన్న ప్రత్యేకతలను వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎగ్జిబిషన్ మొత్తం పల్లె వాతావరణాన్ని ఆవిష్కరించింది. ఎగ్జిబిషన్ ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధి షైనీ, డీసీపీ బాలకృష్ణ, గ్రానూల్స్ ఇండియా కోఫౌండర్ ఉమా చిగురుపాటి, దీప్తి రావులతోపాటు జీఎం రాజేశ్వర్‌రావు, ఎస్‌ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...