నగరంలో సీపీసీబీ చైర్మన్ ఆకస్మిక తనిఖీ


Sat,April 20, 2019 01:00 AM

సిటీబ్యూరో/జీడిమెట్ల, నమస్తే తెలంగాణ : కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)చైర్మన్ ఎస్పీ సింగ్ పరిహార్ శుక్రవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న ఆయన శుక్రవారం నగరానికి చేరుకుని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక చైర్మన్ స్థాయిలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకంగా నగరంలో తనిఖీలు నిర్వహించడం, అది ఫార్మా, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు అధికంగా ఉండే పారిశ్రామికవాడలోనే తనిఖీలు చేయడం గమనార్హం. పీసీబీ చరిత్రలో ఇలా ఒక కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ వచ్చి తనిఖీలు చేయడం అరుదుగా చెప్పవచ్చు. శుక్రవారం సెలవురోజున నగరానికి చేరుకున్న ఎస్పీ సింగ్ పరిహార్ తొలుత పారిశ్రామికవాడలోని వ్యర్థజలాల శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి, జేఈటీఎల్ నిర్వహణ, పనితీరు, ట్రాన్స్‌పోర్టులతోపాటు వ్యర్థ రసాయనాల గాడతను ఏ విధంగా తగ్గిస్తున్నారో ఆయన జేఈటీఎల్ డైరెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జేఈటీఎల్‌లో ఉన్న వివిధ విభాగాలతోపాటు మురుగునీటిని శుద్ధి చేసే పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

జేఈటీఎల్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? నిర్వహణకు ఎంత వ్యయం అవుతుంది? రసాయనాల గాడత ఎంత ఉంటే ఖర్చు ఎంతవుతుందనే వివరాలను ఎస్పీ సింగ్ పరిహార్ అడిగి తెలుసుకున్నారు. జేఈటీఎల్‌లో ఉన్న అన్ని విభాగాలను ఆయన సందర్శించారు. అనంతరం జేఈటీఎల్ సమావేశ మందిరంలో ఈడీ బక్కారెడ్డి జేఈటీఎల్ ఏర్పాటు నిర్వహణను స్క్రీన్‌పై వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్ పరిహార్‌ను విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆఫ్‌ది రికార్డుగా మాట్లాడుతున్నానని, ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా తాను ఏమీ మాట్లాడకూడదని సింగ్ పరిహార్ తెలిపారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుని, పీసీబీ చైర్మన్ రాజీవ్‌శర్మతోపాటు ఉన్నతాధికారులతో సమావేశమై కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఆయన వెంట టీఎస్ పీసీబీ సభ్యకార్యదర్శి పి. సత్యనారాయణరెడ్డి, సీఈ విశ్వనాథం, జేసీఈఈలు ఆర్. రవీందర్‌రెడ్డి, సీవై నగేశ్, మురళీమోహన్, ఈఈ కుమార్‌పాఠక్, సిహెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...