3295 సోలార్ ప్లాంట్లు.. 68 మెగావాట్లు


Sun,April 14, 2019 03:07 AM

- ఇంటిపైనే కరెంటు
- నగరంలో.. మండే ఎండలతో పెరుగుతున్న సౌర వినియోగం
- ఈ వేసవిలో 80 మెగావాట్లు దాటే అవకాశం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి.దీంతో నగరవాసులు ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలను ఆన్‌చేశారు. ఫలితంగా విద్యుత్ బిల్లుల మోత మోగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మండే ఎండలను సైతం గ్రేటర్ ప్రజలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇండ్లపైనా సోలార్ ప్లాంట్ల ద్వారా మండిపోతున్న ఉష్ణోగ్రతలను విద్యుత్‌గా మార్చుకొని.. విద్యుత్ బిల్లులను తగ్గించుకుంటున్నారు. నగరంలో అతికొద్ది కాలంలోనే రూఫ్ టాప్ సోలార్ నెట్ మీటరింగ్ ప్లాంట్ల నిర్మాణం 68 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెరిగిపోయింది. వాస్తవంగా ఇది తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ వ్యవస్థ పరిధిలో దాదాపు 70 శాతం అన్నమాట. టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 3800 మంది వినియోగదారులు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పారు. అందులో గ్రేటర్ విషయానికొస్తే.. 68 మెగావాట్ల సామర్థ్యాన్ని గ్రేటర్‌వాసులు తమ ఇండ్లపై నెలకొల్పుకోవడం గమనార్హం. చాలామంది తమ ఇండ్లు, కార్యాలయాలపై ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నారు. సాధారణ రోజుల్లో సోలార్ విద్యుత్ వాడకం పెద్దగా ఉండదు. దీంతో ఆ ప్లాంట్లను పెద్దగా పట్టించుకోరు. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో సదరు ప్లాంట్లకు చిన్నపాటి మరమ్మతులు ఉన్నా.. వాటిపై దుమ్ము పేరుకుపోయి ఉన్నా.. వాటిని శుభ్రపర్చుకొని వినియోగంలోకి తెస్తున్నారు. ఉదాహరణకు.. మూడు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు గంటకు రెండున్నర యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌నే ఇండ్లు, కార్యాలయాల్లో వినియోగించి స్మార్ట్‌గా విద్యుత్ బిల్లులను తగ్గించేసుకుంటున్నారు.

ఈ వేసవిలో 80 మెగావాట్లు దాటే అవకాశం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3295 సోలార్ విద్యుత్ ప్లాంట్ల వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే 68 మెగావాట్ల విద్యుత్‌ను దాటి ఉత్పత్తి చేస్తున్నారు. మే నెలా చివరినాటికి ఒక్క గ్రేటర్ పరిధిలోనే 80 మెగావాట్ల ఉత్పత్తి దాటే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు సోలార్ విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను ఇండ్లు, కార్యాలయాల్లో వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించుకోవచ్చు. దీంతో సాధారణ రోజుల్లో వినియోగించిన విద్యుత్ యూనిట్లను గ్రిడ్‌కు పంపించిన యూనిట్ల నుంచి తీసివేయగా, మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ఇది లాభదాయకంగా ఉండడంతో నగరవాసులు ఇటువైపుగా ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.

రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ విధానంలో నగరంలోని 9 సర్కిళ్లలో ఆశించిన మేర సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇంకా ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నప్పటికీ.. ఆ దిశగా వినియోగదారులు దృష్టి సారించాల్సి ఉంది. అయితే 255 కనెక్షన్లు ఉన్న రాజేంద్రనగర్ సర్కిల్‌లో అత్యధికంగా 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 590 కనెక్షన్లు ఉన్న బంజారాహిల్స్ సర్కిల్‌లో 7.1 మెగావాట్లు, 476 కనెక్షన్లు ఉన్న మేడ్చల్‌లో 7 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. అత్యల్పంగా 258 కనెక్షన్లు ఉన్న సరూర్‌నగర్ సర్కిల్‌లో 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సోలార్ కనెక్షన్లు ఉన్న వినియోగదారులను విద్యుత్ అధికారులు మరోసారి సోలార్ విద్యుత్ పట్ల జాగృతం చేస్తే ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...