శ్రీరామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు


Sun,April 14, 2019 03:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆదివారం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు, ఇందుకు వాహనదారులు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా గోషామహాల్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం, హనుమాన్ వ్యాయామశాల స్కూల్, సుల్తాన్ బజార్, బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పీఎస్ రోడ్డు, జాలీ హనుమాన్, ధూల్‌ల్‌పేట్ పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్, బేగంబజార్ ఛత్రీ, బర్తన్ బజార్, సిద్ధిఅంబర్ బజార్, శంకర్‌షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వా రా, ఫుత్లీబౌలీ క్రాస్ రోడ్డు, కోఠి , సుల్తాన్ బజార్ మీదుగా సాగుతుందన్నారు. మధ్యలో చిన్న, చిన్న ర్యాలీలు ఈ ప్రధాన యాత్రలో కలుస్తాయన్నారు.

దారి మళ్లింపులు, ఆంక్షలు ఇలా...
- ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు బోయిగూడ కమాన్ రూట్‌లో అనుమతి లేదు. ఈ వాహనాలు మల్లేపల్లి క్రాస్ రోడ్డు నుంచి విజయనగర్ కాలనీ, మోహిదీపట్నం వైపు వెళ్లాలి.
- బోయిగూడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ రూట్‌లోని వాహనాలు ఆఘాపురా, హబీబ్‌నగర్ వైపు వెళ్లాలి.
- ఆఘాపురా, హబీబ్‌నగర్‌వైపు నుంచి సీతారాంబాగ్ వచ్చే మార్గంలో అనుమతి లేదు. ఈ రూట్ వాహనాలను దారుసలాం వైపు మళ్లిస్తారు.
- బోయిగూడ కమాన్ నుంచి పురానాపూల్ వెళ్లే వాహనాలను దారుసలాం వద్ద మళ్లిస్తారు.
- పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను పురానాపూల్ బ్రిడ్జి మీద నుంచి ప్లేట్ల బుర్జు లేదా కార్వాన్, కుల్సుంపురా రూట్లలో వెళ్లాలి.
- ఎంజే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను జుమ్మెరాత్ బజార్‌వైపు అనుమతించరు. సిటీ కాలేజీ, అఫ్జల్‌గంజ్ వైపునకు మళ్లిస్తారు.
- మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ రూట్‌లోని వాహనాలను అలస్క నుంచి దారుసలాం వైపు మళ్లిస్తారు.
- అఫ్జల్‌గంజ్ నుంచి సిద్ధిఅంబర్‌బజార్ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నేషనల్ లాడ్జి వద్ద సాలార్జింగ్ బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు.
- రంగ్‌మహాల్, కోఠి నుంచి గౌలిగూడ చమాన్ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
- అఫ్జల్ గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను అనుమతించరు, ఈ వాహనాలను మదీన, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.
అదే విధంగా తూర్పు మండలంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయన్నారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ట్రాఫిక్, శోభాయాత్ర సాఫీగా సాగేలా సహకరించాలని సీపీ కోరారు.

శోభాయాత్ర సాఫీగా సాగేలా చర్యలు తీసుకోండి
- నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అదివారం శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు , సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ సూచించారు. శనివారం ట్రాఫిక్ కంట్రోల్ రూం కార్యాలయంలో ఆయన అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపుల నేపథ్యంలో గందరగోళం లేకుండా రోడ్లపై సూచిక బోర్డులను పెట్టాలన్నారు. అందరూ విధుల్లో ఉండి శోభాయాత్ర సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...