ఏమార్చు తున్నారిలా?


Mon,March 25, 2019 03:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశాల్లో ఉద్యోగాలు, బహుళజాతి సంస్థల్లో భారీ జీతాలతో ఉద్యోగాలంటూ వల వేసేందుకు ఉత్తరాది సైబర్ క్రైమ్ మాయగాళ్ల ముఠాలు రోజుకో కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇటీవల పలు జాబ్ ఫ్రాడ్స్ కేసులను సైబర్ క్రైం పోలీసులు చేధించడంతో ఉత్తరాది ముఠాలు రూటు మార్చేశారు. వెబ్ సైట్‌లకు సంబంధించిన కార్యాలయాన్ని ఒక చోట.. కాల్ సెంటర్ కేంద్రాలను మరో ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఓ కేసు దర్యాప్తులో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేసిన విచారణలో సైబర్ నేరగాళ్ల నయా మాయజాలం బయటపడింది.

సైబరాబాద్ క్రైం పోలీసుల సాంకేతిక పరిజ్ఞానానికి సైబర్ నేరగాళ్లు వనికిపోతున్నారు. ఇటీవల విదేశాల్లో ఉద్యోగాలు, బహుళజాతి సంస్థల్లో భారీ జీతాలతో ఉద్యోగాలంటూ మోసం చేస్తున్న ముఠాల అడ్డాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెట్టి సూత్రదారులను అరెస్టు చేయడంతో కంగుతినడం వారి వంతైంది. అమాయకులను మాయ చేసేందుకు వారు చేస్తున్న మోసపూరిత కుట్రలను ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అనేకం బట్టబయలు చేశారు. దీంతో పోలీసులకు దొరకిపోవద్దనే లక్ష్యంతో ఇప్పుడు వారి అడ్డాలను ఒకే చోట కాకుండా వాటిని విస్తరిస్తూ జాగ్రత్త పడుతున్నారు. అమాయకులను నిండా ముంచేందుకు ఆకట్టుకునే తీరులో వెబ్‌సైట్‌లను రూపొందించి వాటిలో పొందుపరుస్తున్న చిరునామాలో కేవలం ఇద్దరు లేదా నలుగురివి పెడుతున్నారు. వెబ్‌సైట్‌లో చిరునామా ఉండే కార్యాలయానికి దాదాపు 20 కిలో మీటర్ల దూరంలో కాల్ సెంటర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి అందులో దాదాపు 25 నుంచి 40 మంది వరకు ఉద్యోగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పలు వెబ్‌సైట్‌ల నుంచి ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కొనుగోలు చేస్తూ వారికి కాల్ సెంటర్ కేంద్రాల నుంచి ఫోన్‌లు చేస్తూ ఆశలు పుట్టించి రోజుకు లక్షలు కాజేస్తున్నారు. అదేవిధంగా కంపెనీ రిజిస్టర్ ఒక పేరు మీద.. కాల్ సెంటర్ నిర్వహించే కార్యాలయం వద్ద మరో పేరు, వెబ్‌సైట్ కార్యాలయంకు మరో పేరును పెట్టి మొత్తం కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ సరికొత్త కోణంలో జాబ్‌లు ఆఫర్ చేసి ఓ ప్రొఫెసర్‌ను బోల్తా కొట్టించిన ఫైండ్స్.కేరీర్.కామ్ చీటింగ్ గుట్టును రట్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేశారు.

ప్రొఫెసర్‌కు లక్షన్నర గాలం
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నివాసముంటున్న ఓ ప్రొఫెసర్‌కు ఇటీవల విదేశాల్లో ఉద్యోగానికి భారీ జీతాభత్యాల ప్యాకేజీ అంటూ ఫైండ్స్.కేరీర్.కామ్ నుంచి మెయిల్ వచ్చింది. ఇది నిజమేననుకున్న అతను ఆ ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి కనబర్చారు. దీంతో అతని వివరాలను ఆ మెయిల్‌లో పొందుపర్చాడు. ప్రాసెసింగ్ ఫీజు అంటూ మొదలు పెట్టి మొత్తం లక్షన్నర రూపాయలు వసూలు చేశారు. ఎంతకీ ప్రొఫెసర్‌కు ఇచ్చిన ఆఫర్‌కు సంబంధించిన ఉద్యోగం రాకపోవడంతో అతను సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు ప్రొఫెసర్‌కు వచ్చిన మెయిల్స్, నగదు చెల్లించిన బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. దీంతో అతను నగదు చెల్లించిన పేమెంట్ గేట్‌వే ఆధారంగా ఫైండ్స్ కేరీర్.కామ్ వెబ్ సైట్ కార్యాలయం గుర్‌గావ్‌లో ఉండగా ఆ వెబ్‌సైట్ కాల్ సెంటర్ కేంద్రం అక్కడి నుంచి కొద్ది దూరంలోని రమేశ్‌నగర్ ప్రాంతంలో ఉందని పోలీసులు గుర్తించారు. గుర్‌గావ్ వెబ్‌సైట్ కార్యాలయం నుంచి రోజుకు వెయ్యి మందికి పైగా ఫోన్‌లు చేయడం , మెయిల్స్ పంపడం వంటి వ్యవహరాలు నిర్వహిస్తుండగా, కాల్ సెంటర్ కేంద్రం నుంచి ఫోన్‌లు చేస్తూ విదేశాలు, బహుళజాతి సంస్థలోని కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలనే ఆశావాహులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆశావాహుల నుంచి కరెంట్ అకౌంట్‌లు ఉన్న హెచ్‌డీఎఫ్‌సీతో పాటు మరికొన్ని బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసి అందులో నుంచి ప్రతిరోజూ నగదును డ్రా చేసుకుంటున్నారు. హైరేట్ ఇన్‌ఫోటెక్ పేరుతో కంపెనీని రిజిస్టర్ చేసుకున్న నిర్వాహకులు దానిని ఫైండ్స్ కేరీర్ డాట్ కామ్ పేరుతో నడిపిస్తున్నట్లు తేలింది. ఈ సంస్థ నిర్వాహకులు విక్రంకుమార్ ఝా, ఎస్.కుమార్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ విధంగా ఉత్తరాది ముఠాలు పోలీసులను పరేషాన్ చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి నిరుద్యోగులు, ప్రజలు మీకు ఎటువంటి సంబంధం లేని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తే నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...