అక్రమ వెంచర్లకు అడ్డాగా ఆగాపల్లి


Fri,March 22, 2019 04:09 AM

మంచాల: కడీలు పాతకుండానే లేఅవుట్లను పేపర్‌పైనే తయారుచేసి దర్జాగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. రియల్టర్లు భూమిని కొనుగోలుచేసి లేఅవుట్‌ను కాగితంపై తయారు చేసి అమాయక జనాలకు మాయమాటలు చెప్పి ఎలాగోల ఆ ప్లాట్లను అంటగడుతున్నారు. ఇప్పటికే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఒక్కో ప్లాటును మూడుసార్లు అమ్ముతూ మోసం చేస్తున్నారు. వెంచర్ చేయాలంటే ముందుగా గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కాని రియల్టర్లకు అదేమీ అవసరం లేకుండానే ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకుండానే ప్లాట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరలకు ప్లాట్లు వస్తున్నాయని అమాయక ప్రజలు కొనుగోలు చేసి మోసపోవాల్సిన పరిస్థితి నెలకొంటోది. ఈ తతంగం మండలంలోని సాగర్ ప్రధాన రహదారి ఆగాపల్లిలో జరుగుతున్నది. వెంచర్ చేయాలంటే మొదటు పంట పొలాలను కన్వర్షన్ చేయాలి. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.

అయినప్పటికీ ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతూ అనుమతులు లేకుండానే ప్లాట్లుగా తయారుచేస్తున్నారు. సాగర్‌హైవేకు చుట్టుపక్కల ప్లాట్ల ధరలు భారీగా ఉండడంతో ధనార్జనే ధ్యేయంగా రియల్టర్లు వ్యవసాయ భూములను కూడా వెంచర్లుగా మార్చేస్తున్నారు. కాగితంపై ప్లాట్ల హద్దురాళ్లతో పాటు చూపిస్తూ విక్రయిస్తున్నారు. ఇలాంటి ఆగడాలు ఆగాపల్లిలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అక్రమంగా వెంచర్లు పుట్టుకొస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదని ఆరోపణలున్నాయి.

ధనార్జనే ధ్యేయంగా
ఇబ్రహీంపట్నం మండలం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో సాగర్ రహదారికి ఇరువైపులా ఉన్న భూములపై రియల్టర్ల కన్ను పడింది. దీంతో పంట పొలాలుగా ఉన్న భూములను రైతులను మభ్యపెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా మార్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఒకప్పుడు పచ్చని పంటలతో కళకళలాడే వ్యవసాయ భూములు నేడు హద్ధురాళ్లు, రంగురంగుల జెండాలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని వెంచర్లలో ఏకంగా నిర్మాణాలే చేపట్టడం విశేషం. వ్యాపారులు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయించి చేతులు దులుపుకొంటున్నారు.

సిండికేట్‌గా మోసం చేస్తున్న వ్యాపారులు
ఆగాపల్లి ప్రధాన రహదారిపై ఎక్కడ చూసినా రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరం వరకు అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఏకంగా సుమారు నలభై ఎకరాలు ఎలాంటి రోడ్లుకాని, హద్దురాళ్లుకాని ఏర్పాటు చేయకుండానే వెంచర్లు ఏర్పాటు చేసేశారు. కాగితాలపై హద్దురాళ్లను చూపుతూ ప్లాట్ల్లు విక్రయిస్తున్నారు. పాత సర్పంచ్‌ల పేర్లతో అక్రమ వెంచర్లను ఏర్పాటుచేస్తున్నారు. యాచారం రెవెన్యూ పరిధిలో ఉన్న చెరువులను కూడా రియల్ వ్యాపారులు వదలడంలేదు. అందులో ప్లాట్లను చేసి విక్రయించేందుకు రోడ్డును ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...