కిటకిటలాడనున్న అమీర్‌పేట


Wed,March 20, 2019 12:23 AM

-నేడు హైటెక్‌సిటీ మెట్రో మార్గం ప్రారంభం
-నాగోల్ నుంచి హైటెక్‌సిటీకి..ఎల్బీనగర్
- మియాపూర్‌కు రైలు మారాలంటే ఇక్కడే..
-పూర్తయిన రెండు కారిడార్లు
-3 లక్షలకు పెరుగనున్న ప్రయాణికులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రోరైలు ప్రాజెక్టు మూడో కారిడార్‌కు సంబంధించి బుధవారం ప్రారంభం కానున్న హైటెక్‌సిటీ మార్గంతో మెట్రోరైలు ప్రయాణానికి మరింత డిమాండ్ పెరుగనున్నది. ఐటీ హబ్‌ను కనెక్ట్ చేస్తూ నగరం నలుమూలల నుంచి సాగే ఈ ప్రయాణానికి చాలా డిమాండ్ రానున్నది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యతో రోడ్డు మార్గాన పోవాలంటే ఇబ్బంది పడుతున్న నగరవాసులు మెట్రోను ఆశ్రయించే అవకాశమున్నది. అమీర్‌పేట్ నుంచి హైటెక్‌సిటీ వరకు గల 10 కిలోమీటర్ల మార్గం ప్రారంభమైతే 56 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 10 మిలియన్ల జనాభా ఉండగా, 2021 సంవత్సరం పూర్తయ్యే నాటికి 13.6 మిలియన్లకు నగర జనాభా పెరిగే అవకాశముంది. ఇప్పటికే నగరంలో 50 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతుండగా, ప్రతీ ఏడాది 50వేల వాహనాలు నగరంలో అదనంగా రోడ్డెక్కుతున్నాయి. ఇటు కాలుష్యం, అటు ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో మెట్రోరైలు ప్రాజెక్టు కీలకంగా మారనున్నది. పర్యావరణ హితంతో కూడిన ప్రయాణంతోపాటు అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేరే అవకాశాన్ని మెట్రోరైలు కల్పించనున్నది.

ప్రయాణికులతో కిటకిటలాడనున్న స్టేషన్లు
రెండు కారిడార్లలో ప్రారంభమైన మెట్రోరైలులో ఇప్పటికే ప్రయాణికులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. ప్రతీరోజు సుమారు 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కోరోజు 2 లక్షల మంది కూడా ప్రయాణిస్తున్నారు. ఇదంతా కేవలం ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌తోపాటు నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు సంబంధించిన ఆపరేషన్స్ వల్ల మాత్రమే నమోదవుతున్నాయి. ఇక డిమాండ్ ఉన్న హైటెక్‌సిటీ మార్గం ప్రారంభమైతే ప్రారంభ దశలోనే మరో లక్ష మంది ప్రయాణికులు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రతీరోజు రెండు కారిడార్లు కలిసి 3లక్షల వరకు కూడా ప్రయాణికులు ప్రయాణించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులోని మూడు కారిడార్లు పూర్తయితే ప్రతీరోజు 17 లక్షల మంది ప్రయాణికులు వెళ్లే అవకాశముందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది 2024 వరకు 24 లక్షల మంది ప్రయాణించే అవకాశముందని తెలిపారు.

ఇది శాస్త్రీయమైన పద్ధతిలో అంచనాకు వచ్చినట్లు తెలిపారు. హైటెక్‌సిటీ మార్గానికి అత్యధిక డిమాండ్ ఉండడంతోపాటు ఐటీ ఉద్యోగులు మెట్రోరైలునే ఎంచుకునే అవకాశం ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. నాగోల్ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణించాలనుకున్న వారెవ్వరూ నిరాటంకంగా ప్రయాణించే అవకాశముంది. ఐతే ఎల్బీనగర్ లేదా మియాపూర్ నుంచి మెట్రో ద్వారా హైటెక్‌సిటీకి వెళ్లేవారు అమీర్‌పేటలో దిగి హైటెక్‌సిటీకి వెళ్లే మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. హైటెక్‌సిటీకి మెట్రో అందుబాటులోకి రావడంతో నేరుగా హైటెక్‌సిటీకి చేరే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, స్టేషన్లు కిటకిటలాడనున్నాయి. ముఖ్యంగా అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ ప్రయాణికులతో బిజీగా మారనున్నది.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...