తాగునీటిని పొదుపుగా వాడాలి


Wed,March 20, 2019 12:21 AM

-ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగాలి
-కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు
-సెమినార్‌లో జలమండలి ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రజల్లో అవగాహనతోనే తాగునీటిని పొదుపుగా వినియోగించగలమని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జలమండలి, ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మంచినీరు, పారిశుధ్య నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సెమినార్‌కు ముఖ్యఅతిథిగా ఎండీ హాజరై ప్రసంగించారు. నేటి పరిస్థితుల్లో మంచినీటి విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెమినార్ల అవసరం ఎంతైనా ఉందని ఎండీ చెప్పారు. మనుషులు పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ, పర్యావరణ రక్షణకు కృషి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 1.5బిలియన్ దారిద్య్ర దిగువన ఉన్న ప్రజలు మంచినీరు, పారిశుధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. జనాభా వృద్ధి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో పారిశుధ్య, తాగునీటి అవసరాలు తీర్చాలని అభిప్రాయపడ్డారు.

స్థిరాభివృద్ధిలో చైనా ముందుందని, ప్రజా అవసరాలకనుగుణంగా అక్క డ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి దేశాభివృద్ధికి కృషి చేస్తుందని వివరించారు. ప్రపంచంలో ఉన్న నీటిలో తాగడానికి పనికి వచ్చేది కేవలం 0.3శాతం మాత్రమేనని ఎండీ చెప్పారు. మిగిలిన నీరు సముద్రపు నీరు కావడంతో వినియోగించేందుకు వీలులేదన్నారు. ఈనెల 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఎన్జీవోలతో కలిసి నీటి పొదుపుపై అవగాహన కల్పించనున్నామన్నారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని ఎండీ కొనియాడారు. హైదరాబాద్ మహానగరానికి వందల కిలోమీటర్ల నుంచి కృ ష్ణా, గోదావరి నదుల నుంచి ఒక్క వెయ్యి లీటర్లను తీసుకురావడానికి రూ.47 ఖర్చు చేసి నగర ప్రజలకు సబ్సిడీపై రూ.12 లకు అందిస్తున్నామని ఎండీ వివరించారు.

ప్రతి నెల విద్యుత్ బిల్లు చెల్లింపులకే రూ.85 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇంత కష్టపడి ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తే ప్రతిరోజు 20 మిలియన్ గ్యాలన్ల నీటిని వృథా చేస్తున్నారన్నారు. ఇలాప్రతినెల దాదాపుగా రూ. 15 కోట్ల ప్రజాధనం వృథా అవుతున్నాయన్నారు. నీటిని పొదుపుగా వినియోగిస్తే రానున్న రోజుల్లో నీటి ఇక్కట్లు రావన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ బి.విజయ్‌కుమార్‌రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ సెంటర్ చైర్మన్ జి.రామేశ్వర్‌రావులతో పాటు పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సింగపూర్ తరహాలో టెక్నాలజీ రావాలి
సింగపూర్‌లో అత్యాధునిక సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నెలకొల్పి వ్యర్థ నీటిని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చి అక్కడి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. అలాంటి టెక్నాలజీ మనకు అవసరం. ప్రస్తుతం ఎన్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నాం. తెలంగాణంలోనూ ఆధునిక ఎస్టీపీల ఏర్పాటుతో స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించవచ్చు. నిత్యం వ్యర్థంగా పోతున్న 50శాతం నీటిని రీసైక్లింగ్ చేసుకొని తిరిగి తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చు. బహుళ అంతస్తుల భవనాలు ఉన్న వారు సొంతంగా ఇలాంటి ఎస్టీపీలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
- డాక్టర్ డి. హనుమంతచారి, మాజీ చైర్మన్ ఐఈఐ

వర్షం నీటితో భూమిని రీచార్జ్ చేయాలి
వర్షం కురిసిన క్రమంలో గతంలో 95శాతం నీరు భూమిలోకి ఇంకేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంక్రీట్ ఫ్లోరింగ్, రోడ్ల వల్ల ఆ నీరు భూమిలోకి వెళ్లే పరిస్థితి లేదు. కేవలం ఐదు శాతం మాత్రమే ఇంకుతుంది. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వర్షపునీటిని భూమిలోకి పంపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే భూమి రీచార్జ్ అవుతుంది. భావితరాలకు మంచినీటిని అందించవచ్చు. నగరంలో 450 ఎంజీడీఎల్ నీటిని అందిస్తే అందులో 50శాతం వృథాగా పోతుంది. వాటర్ డిస్ట్రిబ్యూషన్ పద్ధతులను క్రమబద్ధీకరించడం ద్వారానే సాధ్యమవుతుంది. నాలాల్లో వర్షపు నీరు పోకుండా ట్రంక్ మెయిన్స్(ఎన్టీపీలకు పెద్ద పైపులైన్స్) వేయాలి. తద్వారా ట్రీట్‌మెంట్ చేసి ఆ నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
- డాక్టర్ జి.రామేశ్వర్‌రావు,
చైర్మన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...