మహిళల రక్షణకు..11 షీ టీమ్స్


Wed,March 20, 2019 12:14 AM

-సైబరాబాద్‌లో 15 రోజుల్లో 110 ఫిర్యాదులు .. 52 కేసులు నమోదు
- 54 మంది అరెస్ట్..కౌన్సెలింగ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళలు, యువతులు, విద్యార్థినుల రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వారికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు. ఇంకా వారికి వేగవంతంగా సేవలు అందించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8 షీ టీమ్స్ సంఖ్యను 11కు పెంచారు. దీంతో ఇప్పుడు షీ బృందాలు మరింత వేగంగా మహిళలకు అవసరమైన సమయాల్లో పోలీసింగ్‌ను అందించనున్నారు. మార్చి 1 నుంచి 16 వరకు 110 మహిళలు షీ టీమ్స్‌ను ఆశ్రయించి...తమపై జరుగుతున్న అఘాత్యాలపై ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన షీ టీమ్స్ మొత్తం 52 కేసులను నమోదు చేసింది. ఇందులో 16 క్రిమినల్, 36 పెట్టీ కేసుల్లో 54 మంది అకతాయిలు, పోకిరీలు, కామాంధులను పట్టుకున్నారు. వీరందరికీ వారి కుటుంబ సభ్యుల ముందు కౌన్సెలింగ్‌ను ఇచ్చారు. క్రిమినల్ కేసుల్లో పట్టుబడ్డవారిని జైలుకు పంపారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఘటనలు
-ఐస్ క్రీం షాపు అబ్బాయిలు వెంటపడ్డారు...
గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ యువతి మాదాపూర్‌లోని ఐఈఎల్‌టీఎస్ కోచింగ్ కేంద్రంలో చేరింది. ఆ ప్రాంతంలో ఉన్న ఓ ఐస్‌క్రీం దుకాణంలో పని చేస్తున్న ప్రసాద్, మహేంద్రలు యువతితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇంటికి వెళ్లే సమయంలో వెంటపడ్డారు. పలు సందర్భాల్లో యువతి బైక్ వద్ద మరికొంత మంది స్నేహితులతో కలిసి ఆమె కోసం మాటు వేశారు. వీరి చేష్టలతో భయాందోళనకు గురైన బాధిత యువతి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన షీ టీమ్స్ ఇద్దర్నీ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పీఎస్‌కు అప్పగించారు.

రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన యువతి విమానాశ్రయంలో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్‌లో పని చేస్తుంది. ఆమెకు మహ్మద్ ఖాన్ పరిచయమైయ్యాడు. మూడు సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తుండడంతో సన్నిహిత స్నేహం ఏర్పడింది. అతని ప్రవర్తనలో మార్పు రావడంతో అతనితో మాట్లాడకుండా దూరం పెట్టింది. దీంతో మహ్మద్ ఖాన్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. తన వద్ద ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని, తనతో స్నేహం చేయకపోతే నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన యువతి వాట్సాప్ ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి షీ టీమ్స్ అతనిపై రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదు చేసింది.

మాదాపూర్ ప్రాంతానికి చెందిన యువతికి లైక్ యాప్ ద్వారా ప్రైవేటు ఉద్యోగి అనిల్ పరిచయమైయ్యాడు. ఆ తర్వాత అతను హాస్టల్ వద్దకు కూడా వచ్చి యువతితో మాట్లాడాడు. ఈ స్నేహంతో ఫిబ్రవరి 18న రాత్రి 10 గంటలకు అనిల్ ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఆ సమయంలో ఆమెకు నీళ్లు ఇచ్చాడు. వాటిని తాగగానే ఆమె స్పృహ కోల్పోయింది. మెలుకువ వచ్చి చూసే సరికి ఓ గదిలో అనిల్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయం బయటికి చెప్పితే చంపేస్తానని అనిల్ బెదిరించి ఆమెకు ఓఆర్‌ఎస్ డ్రింక్ ఇచ్చి తిరిగి ఆమెను సైబర్ టవర్స్ క్రాస్ రోడ్డు వద్ద వదిలేసి పారిపోయారు. ఈ విషయంపై బాధిత యువతి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితుడిపై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుంది. ఈ కేంద్రానికి ఇన్‌చార్జి అయిన డాక్టర్ రామ్ రెడ్డి తన క్యాబిన్‌లోకి పిలిచి ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. నీవంటే నాకు ఇష్టం, నా వద్దకు వస్తే ఎంత డైబ్బెనా ఇస్తానన్నాడు. ఈ చర్యతో భయానికి గురైన నర్సు షీ టీమ్స్‌ను సంప్రదించి ఫిర్యాదు చేసింది. షీ టీమ్స్ దర్యాప్తు చేపట్టి డాక్టర్ రామ్‌రెడ్డిని అరెస్ట్ చేసి చందానగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా వెంటపడితే బాధిత మహిళలు, యువతులు, విద్యార్థినులు భయం లేకుండా ఏ సమయంలో నైనా షీ టీమ్స్‌ను ఆశ్రయించవచ్చని డీసీపీ అనసూయ తెలిపారు. షీ టీమ్స్ బాలానగర్-9490617349, ఐటీ కారిడార్-9490617352, మాదాపూర్- 8333993519, కూకట్‌పల్లి- 8332981120, మియాపూర్-9491051421, చేవెళ్ల-9493625379, జగద్గిరిగుట్ట-94936246561, షాద్‌నగర్-9493624147 లకు సంప్రదించాలని ఆమె కోరారు. లేదా డయల్ 100, sheteam.cyberabad@gmail.com, ఫేస్‌బుక్ ఐడీ sheteam.cyberabad లలో సంప్రదిస్తే వెంటనే షీ టీమ్స్ సేవలు అందుతాయని డీసీపీ చెప్పారు. అదే విధంగా డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి బస్టాప్‌లు, షాపింగ్ మాల్స్, బస్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో తిష్ట వేసే వారి భరతం పట్టామన్నారు. 61 అవగాహన కార్యక్రమాలు ద్వారా దాదాపు 14,940 మంది మహిళలు, విద్యార్థినులు, యువతుల్లో రక్షణ చిట్కాలు, చట్టాలు, హక్కులపై చైతన్యం కలిగించామని డీసీపీ వివరించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...