రేపే హైటెక్‌సిటీకి మెట్రోరైలు


Tue,March 19, 2019 01:46 AM

-గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభం
-ఉదయం 9:15 గంటలకు ముహూర్తం
-సాయంత్రం 4 గంటల నుంచి రెగ్యులర్ సర్వీసులు
-అందుబాటులోకి రానున్న 10 కిలోమీటర్లు.. 8 స్టేషన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హైటెక్‌సిటీ మార్గం బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతులమీదుగా బుధవారం ఉదయం 9:15 గంటలకు అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోమార్గం ప్రారంభం కానున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి విన్నపం మేరకు ఈ మార్గంలో మెట్రోరైలును ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్ అంగీకరించారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రారంభకార్యక్రమం జరుగనున్నది. బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మెట్రోరైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఐటీ కారిడార్‌కు కనెక్టివిటీ పెంచే ఈ మార్గం ప్రారంభం కోసం ఐటీ ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. బుధవారం ప్రారంభిస్తారని ప్రకటన వెలువడటంతో వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.


రెండు కారిడార్లు పూర్తి

72 కి.మీ. హైదరాబాద్ మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్టులో ఇప్పటికే 46 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గం ప్రారంభంతో 56 కి.మీ.కి పెరుగుతుంది. రెండు కారిడార్లు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే కారిడార్-1కు సంబంధించి ఎల్బీనగర్- మియాపూర్ మార్గం (29 కి.మీ.) పూర్తయి, రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కారిడార్-3కి సబంధించి నాగోల్-హైటెక్‌సిటీ (27 కి.మీ.) మార్గంలో ప్రస్తుతం నాగోల్- అమీర్‌పేట (17 కి.మీ.) మార్గంలో రాకపోకలు సాగుతున్నాయి. హైటెక్‌సిటీ మార్గం ప్రారంభమైతే కారిడార్-3 పూర్తవడంతోపాటు ప్రయాణికులకు మరో 10 కి.మీ.ల మార్గం అందుబాటులోకి వస్తుంది. నాగోల్ నుంచి నేరుగా హైటెక్‌సిటీ వరకు ప్రయాణించే అవకాశం కలుగుతున్నది.

ఫ్రీక్వెన్సీ.. 9-12 నిమిషాలు

అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు ఒక రైలు రాకపోకలు సాగించనున్నది. మిగతా కారిడార్లలో ప్రస్తు తం రైళ్ల ఫ్రీక్వెన్సీ ఆరు నిమిషాలుగా ఉన్నది. నాగోల్ నుంచి 40 నిమిషాల్లో హైటెక్‌సిటీకి చేరుకునే వీలు కలుగుతుంది. హైటెక్‌సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తికాకపోవడంతో కొన్నాళ్లపాటు రైళ్లు ట్విన్ సింగిల్‌లైన్ మెథడ్‌లో రాకపోకలు సాగించనున్నట్టు ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి హైటెక్‌సిటీ వరకు గల ఐదు కిలోమీటర్లమార్గంలో రైలు వెళ్లిన ట్రాక్ మీదే తిరిగి వస్తుందన్నారు. ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్లు ఉండగా ప్రస్తుతం ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లను త్వరలో ప్రారంభిస్తామని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలోని స్టేషన్లు
1. మధురానగర్(తరుణి)
2. యూసుఫ్‌గూడ
3. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-5
4. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
5. పెద్దమ్మగుడి
6. మాదాపూర్
7. దుర్గంచెరువు
8. హైటెక్‌సిటీ

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...