టీఈ పోల్‌లో..ఓటర్ స్లిప్పులు


Tue,March 19, 2019 01:40 AM

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ :ఓటర్ల జాబితాలో తప్పొప్పుల సవరణ, కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడున్నాయో చూసుకునే సౌలభ్యం.. పోల్ చీటీలను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఈ టీఈ పోల్ వెబ్‌సైట్ పై ప్రత్యేక కథనం....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 19,59,490 మంది ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్ పరిధిలో 19,54,813, మల్కాజిగిరి లో 30,98,816, చేవెళ్ల పరిధిలో 24,15,598 మంది ఓటర్లు ఉన్నారు. వీటి పరిధిలో ఓటర్ల సంఖ్య పెరగడం, ఎన్నికల సంఘం మార్గదర్శకాల క్రమంలో మరిన్ని పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలుమార్లు ఓటరు జాబితాలను సవరించారు. ఒక కుటుంబంలోని సభ్యులంతా ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను టీఈ-పోల్ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
ప్రయోజనాలు ఎన్నో..
-పేరు, వయసు, చిరునామా, ఇంటి నంబర్లలో తప్పులు ఉంటే ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్చు. తమ కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఒకే పోలింగ్ బూత్‌లో ఉన్నయా? లేదో పరిశీలించుకోవచ్చు. సవరణలకు ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించారు.
-నియోజకవర్గాల వారీగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలి, తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
-గత ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్ల జాబితా కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఓటరు జాబితాను ఆన్‌లైన్ నుంచి తీసుకోవచ్చు.
-ఓటర్లు పోల్ చీటీలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-అభ్యర్థులు రోజువారీ ఎన్నికల ఖర్చు వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల జాబితా గతంలో అధికారుల వద్దనే ఉండేది. ప్రస్తుతం ఆ జాబితాను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
-ఎవరు, ఎక్కడ విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల నిర్వహణలో వారి హోదా తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
-వెబ్‌సైట్‌లో పలు విభాగాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళితో పాటు అభ్యర్థులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
-అభ్యర్థుల దరఖాస్తు పత్రాలు, అఫిడవిట్లు, ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నిర్వహణ తేదీలను ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

సిబ్బందికి ఇప్పటికే శిక్షణ..
ఓటర్లు, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి సిబ్బందికి ఇప్పటికే శిక్షణనిచ్చారు. వివరాల నమోదుకు ఒక్కో అధికారికి ఒక్కో పాస్‌వర్డ్ కేటాయించారు. దీని ఆధారంగా ఓటరు జాబితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
తగ్గనున్న పనిభారం..
గతంలో ఓటరు తుది జాబితాను రూపొందించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో అది మరింత సులువుగా మారింది. ఓటర్ స్లిప్పులు కూడా ఓటర్లు వెబ్‌సైట్ నుంచి తీసుకునే వీలు కల్పించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని నివేదికలను ఇదే వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో అధికారులకు పనిభారం తగ్గుతుందని భావిస్తున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత..
ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపొందిన విజేతలు, లభించిన ఓట్లు ఆధిక్యతతో పాటు వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఇలా ఎన్నికల సంఘం పలు వివరాలతో తొలిసారిగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ విధానంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా కొనసాగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...