కారెక్కుతున్న కంటోన్మెంట్ నేతలు


Tue,March 19, 2019 01:39 AM

-గులాబీ గూటీకి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి క్రిశాంక్
-నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ
కంటోన్మెంట్ (నమస్తే తెలంగాణ):చేతిపట్టు జారుతోంది. శాసన సభ ఎన్నికల్లో దెబ్బతిన్న హస్తం పార్టీకి... ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గులాబీ గూటికి చేరువవుతున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కి వెళ్లిపోతున్నారు. సదరు నాయకులు తమ బలగాన్ని అధికార పార్టీకి చూపె ట్టేందుకు పోతూ పోతూ బలగాన్ని వెంటబెట్టుకొని వెళ్తున్నారు. దీంతో నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ డీలా పడిపోతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి కొన సాగుతున్న వలసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, ఎంపీ టికెట్ ఆశావహులను ఆందోళనలకు గురి చేస్తోంది.నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఓయూ విద్యార్థి నేత మన్నె క్రిశాంక్ సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ లో చేరాడు.

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీకి కండువా కప్పి క్రిశాంక్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రిశాంక్‌కు కంటోన్మెంట్ అసెంబ్లీ టిక్కెట్‌ను కేటాయించి, యూటర్న్ తీసుకుంది. తద నంతర రాజకీయ పరిణామాలలో ఆ టికెట్‌ను గజ్జెలకాంతంకు దక్కింది. అయితే పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్న క్రిశాంక్ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారు. 2019 ఎన్నికల్లో క్రిశాంక్‌కు చేదు అనుభవమే ఎదురైంది. తనను కాదని కాంగ్రెస్ పార్టీ తన మామ సర్వే సత్యనారాయణకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో క్రిశాంక్ అలకబూనారు. రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్రిశాంక్‌ను సముదాయించినా.. క్రిశాంక్ మెల్ల మెల్లగా పార్టీకి దూరమవుతూ వస్తున్నాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టినా.. మరో ఐదేళ్లు పోరాటాలతో చేసేదేమి లేదని భావించి క్రిశాంక్ అధికార పార్టీలో చేరిపోయాడు.

నేడో రేపో మరికొందరు..
కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. పార్టీ ముఖ్యనేతలు ఒక్కొక్కరూ కారెక్కెందుకు సిద్ధమవుతున్నారు.నేడో రేపో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్యారసాని శ్యాం కుమార్‌తోపాటు ఏకైక కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు, పార్టీ మహిళా అధ్యక్షురాలు భాగ్యశ్రీ టీఆర్‌ఎస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ముఖ్యనేత ద్వారా టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కం టోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపనప్రతాప్, భానుక నర్మద మల్లికార్జున్‌లు సైతం టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే అంతంతా మాత్రం పట్టున్న కాం గ్రెస్ పార్టీలో నుంచి ముఖ్యనేతలంతా గూలాబీ గూటీకి చేరడంతో కాంగ్రెస్ పరిస్థితి హస్తవ్యస్తంగా తయారవుతోంది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...