నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి


Tue,March 19, 2019 01:24 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మల్కాజిగిరి పార్లమెంట్‌కు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, ఏర్పాట్లకు సంబంధించి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణపై సమీక్షించారు. నామినేషన్ల చెక్‌లిస్టును తయారు చేయాలని, నామినేషన్లను అత్యంత శాంతియుతంగా, పటిష్టంగా స్వీకరించాలన్నారు. నామినేషన్లకు సంబంధించి అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని, అలాగే హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో మధుకర్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
తొలిరోజు నిల్..
నామినేషన్ల స్వీకరణకు తొలిరోజున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క నామినేషన్ కూడా రాలేదని జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని, ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3.గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నట్టు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కేవలం కేంద్ర ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు. మార్చి 21న హోలీ సందర్భంగా, మార్చి 23న నాలుగవ శనివారం , 24న ఆదివారం అయినందున నామినేషన్లు స్వీకరించబడవని, పోటీ చేయనున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఎన్నికల పరిశీలకుల సందర్శన
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంను సందర్ళించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచన మేరకు కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిశీలకులను ప్రకటించారు. ఇందులో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్ ఎ.శశికుమార్, ఎల్‌బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు ఐఆర్‌ఎస్ మాజీ ఐఆర్‌ఎస్ అధికారి టి.రాహుల్ కుమార్‌ను నియమించారు. సోమవారం ఇరువురు ఎన్నికల పరిశీలకులు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్ డా.ఎంవీ రెడ్డితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఎన్నికల పరిశీలకులను కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు.
రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలి
రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి కోరారు. సోమవారం జిల్లా పరిధిలోని వివిధ పార్టీల నాయకులతో కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల నాయకుల పాత్ర కీలకమని తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...