ఆ ఎనిమిది కి.మీ. రోడ్డు యమడేంజర్


Mon,March 18, 2019 12:25 AM

-ప్రమాదభరితంగా నానక్‌రాంగూడ రోటరీ -టీఎస్‌పీఏ జంక్షన్
-ఫుట్‌పాత్ ఆక్రమణలు, చెట్లు..రోడ్డు ధ్వంసమే ప్రధాన కారణాలు
-సంయుక్తంగా అధ్యయనం చేసిన హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
-సురక్షిత మార్గానికి పలు సూచనలు
-హెచ్‌ఎండీఏకు ట్రాఫిక్ డీసీపీ నివేదిక సమర్పణ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదాలతో రక్తంతో తడిసిపోతున్న నానక్‌రాంగూడ రోటరీ నుంచి టీఎస్‌పీఏ జంక్షన్ 8 కిలో మీటర్ల రహదారిని సురక్షితంగా మార్చేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అధ్యయనం చేశారు. రోడ్డు నిర్మాణ డిజైన్‌లోని లోపాలు, రోడ్డు ఆక్రమణలతోపాటు వాహనదారుల అవగాహనలేమి డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ టేకింగ్‌లు చేయడం వంటివి కారణాలుగా తేలింది. దీంతో చాలా మంది వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణిస్తూ మృత్యువాత పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇలా గత 8 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది వాహనదారులు మరణించారు. ఈ సంఘటనలను విశ్లేషించినప్పుడు మానవ తప్పిదాలు ప్రధాన కారణాల్లో మొదటి స్థానంలో నిలుస్తుండగా, రోడ్డు నిర్మాణ డిజైన్‌లోని తప్పులు, రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడం, మట్టి, రాళ్లు, దుమ్ము, ఇసుక రోడ్లపై పేరుకుపోవడం వంటివి మరికొన్ని కీలక కారణాలుగా తేలాయి. వాహనదారులు చేసే తప్పిదాలపై ట్రాఫిక్ పోలీసులు చట్టపరంగా నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నా, వాహనదారుడి ప్రయాణం కోసం రహదారులను సురక్షితంగా మార్చేందుకు ఇతర శాఖల సహకారం తప్పనిసరని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 4వ తేదీన సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్, హెచ్‌ఎండీఏ ఈఈ ప్రసాద్, డిప్యూటీ ఈఈ సంజయ్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు అందరూ సంయుక్తంగా 8 కిలోమీటర్ల నానక్‌రాంగూడ రోటరీ నుంచి టీఎస్‌పీఏ జంక్షన్‌ను సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ నివేదికను రూపొందించారు. నివేదికలో పొందుపర్చిన అంశాలను పరిష్కరించుకుంటూ పోతే ఈ రహదారి డెత్ జోన్ నుంచి సేఫ్ జోన్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఈ నివేదికలోని పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టి దశలో వారీగా వాటిని తొలగించి వాహనదారులకు రోడ్డు భద్రతను అందించాలని శనివారం ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ హెచ్‌ఎండీఏ కమిషనర్ లేఖను రాసి విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన కారణాలు ఇలా ఉన్నాయి..

నానక్‌రాంగూడ రోటరీ డౌన్ ర్యాంపు వద్ద.. ర్యాంపు నుంచి సర్వీసు రోడ్డులో మార్కింగ్స్ ఇవ్వాలి. ర్యాంపు నుంచి సర్వీసు రోడ్డులో నోఓవర్‌టేకింగ్, గో స్లో, కీప్ లెఫ్ట్ బోర్డులను ఏర్పాటు చేయాలి. రాత్రి సమయాల్లో వెలుతురు ఉండేలా చూడాలి. లేన్ మార్కింగ్స్ వేయాలి. తరచూగా రహదారిపై ఏర్పడే దుమ్ము దూళిని తొలగించాలి. రోడ్డుపై ఉన్న చెట్లు, స్తంభాలు, భారీ కేడ్స్‌లకు రేడియం స్టిక్కర్‌లను పెట్టాలి. ఓవర్ టేకింగ్‌ను నివారించేందుకు లేన్ మార్కింగ్ ఇవ్వాలి.
నానక్‌రాంగూడ నుంచి సర్వీసు రోడ్డులో.. వాహనాలు జారకుండా(స్కిడ్)ఉండేందుకు రోడ్లపై పేరుకుపోయిన మట్టి, చెత్తను తీసేయాలి. పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా సైన్ బోర్డులు, నోపార్కింగ్, నో స్టాపింగ్ బోర్డులను పెట్టాలి. దెబ్బతిన్న రోడ్డును మరమ్మతులు చేయాలి. నార్సింగి నుంచి రోటరీ మలుపు వైపు వచ్చే ప్రాంతంలో రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ మార్గం నుంచి ఓఆర్‌ఆర్‌కు చేరుకునేందుకు వాహనదారులకు రూటు అర్థమయ్యేలా సూచిక బోర్డులను పెట్టాలి. ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనపడేలా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి వాటిని మరోచోట నాటాలి. పాదచారుల రక్షణ కోసం జీబ్రా లైన్స్ వేయాలి. బ్లింకర్స్‌ను పెట్టాలి. అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను తొలగించి ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. వివిధ రకాల వాహనాల ప్రయాణం కోసం లేన్ మార్కింగ్స్‌ను వేయాలి. ఓవర్ స్పీడ్‌ను నియంత్రించేందుకు స్పీడ్ టేబుల్స్‌ను ఏర్పాటు చేయాలి. నానక్‌రాంగూడ రోటరీ నుంచి నార్సింగి దారిలో.. అక్రమంగా ఫుట్‌పాత్‌లను ధ్వంసం చేసి ఆక్రమణలను చేసిన వారిపై చర్యలు తీసుకుని వాటిని తిరిగి అందుబాటులోకి తేవాలి. సర్వీసు రోడ్డులో రాత్రి సమయంలో వెలుతురు ఉండేలా వీధి దీపాలను పెట్టాలి. రోడ్డు డివైడర్‌ల వద్ద బ్లింకర్స్‌ను అమర్చాలి.

ప్రతి వంద అడుగుల దూరంలో స్పీడ్ లిమిట్స్ బోర్డులను పెట్టాలి. వాహనదారులకు అడ్డుగా ఉన్న దుమ్ము, రాళ్లు, చెత్త చెదారాన్ని రోజువారీగా తీసేయాలి. ఓవర్ టేకింగ్‌లను అరికట్టేందుకు చెరిగిపోయిన మార్కింగ్‌లను రోడ్డు చివరి వరకు సాగేలా వాటిని వేయాలి. మలుపుల వద్ద ఉన్న చెట్ల పొదలను తొలగించాలి. నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు ఉన్న చోట పాదచారుల కోసం జీబ్రా క్రాసింగ్స్‌ను పెట్టాలి. అపర్ణ ఎలిక్సర్ వద్ద ఫుట్‌పాత్‌ను ఆధునీకరించారు కానీ అక్కడ ఎలాంటి సూచిక బోర్డులను పెట్టలేదు. వారిపై చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించి ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కూడా వేగపరిమితి తెలిపే బోర్డులను పెట్టాలి.

నార్సింగి రోటరీ..రోడ్డులో... రాత్రి సమయాల్లో వాహనదారుల ప్రయాణం కోసం వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. రోడ్డుపై ఉన్న దుకాణాలు, అక్రమంగా వెలసిన ఇతర నిర్మాణాలను తొలగించాలి. ఫుట్‌పాత్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. రహదారిపై పేర్కొన్న మట్టిని తొలగించేందుకు రోడ్లను శుభ్రం చేయాలి. రోటరీకి నాలుగు వైపుల పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లైన్స్‌ను వేయాలి. ఈ దారిలో బ్లింకర్స్, స్టడ్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇతర వాహనాలకు దారి ఇవ్వండంటూ సూచిక బోర్డులను పెట్టాలి. ఫ్లెక్సీలు, సైన్‌బోర్డులను తీసేయాలి. ఓవర్ టేకింగ్‌ను కట్టడి చేసేందుకు డివైడర్‌లను ఏర్పాటు చేయాలి. మలుపులు, రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన చెట్లను తొలగించి మరో చోట ఏర్పాటు చేయాలి.

నార్సింగి రోట్లరీ నుంచి టీఎస్‌పీఏ రోటరీ దారిలో..ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక డబ్బాలు, నిర్మాణాలు, ఇతర ఆక్రమణలను తీసేయాలి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు పేరుకుపోయిన వాటిని తీసేయడం తప్పనిసరి. ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డుకు దారి తీసే దారిలో స్పీడ్ బేకర్లు వేయాలి. అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను తొలగించాలి. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ టేబుల్స్‌ను పెట్టాలి. వాహనాల లేన్ మార్కింగ్స్‌ను కనిపించేలా పెట్టాలి. చెట్ల కొమ్మలను తొలగించాలి. ఈ రోడ్డులోని నివాస, వాణిజ్య కేంద్రాల ప్రాంతాల వద్ద జీబ్రీ లైన్స్ కచ్చితంగా ఉండాలి.

అండర్ పాస్ టీ జంక్షన్ దారిలో... టీ జంక్షన్ వద్ద జరుగుతున్న నిర్మాణాలతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. టీఎస్‌పీఏ నుంచి కోకాపేట్ వెళ్లేందుకు టీ జంక్షన్ వద్ద భారీ వాహనాలు తీసుకుంటున్న మలుపులు మొత్తం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇక్కడ ఉన్న కల్వర్టు ఎత్తును తగ్గించి రోడ్డుకు సమానంగా ఉండేలా చేయాలి. జీబ్రా లైన్స్, రంబుల్ స్ట్రిప్స్‌ను పెట్టాలి. జంక్షన్ రీడిజైన్ అవసరం. నోపార్కింగ్, వాహనాలు మెల్లిగా వెళ్లాలనే సూచిక బోర్డులు తప్పనిసరి.
టీఎస్‌పీఏ రోటరీ దారిలో.. ఓఆర్‌ఆర్‌కు వెళ్లే వాహనదారులకు గందరగోళం లేకుండా స్పష్టమైన సైన్ బోర్డులను పెట్టాలి. ఇక్కడ రోడ్లపై ఉండే అపరిశుభ్రతను తొలగించాలి. ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను తొలగించాలి.

ఓఆర్‌ఆర్‌కు దారి తీసే మార్గంలో స్పీడు టేబుల్స్‌ను పెట్టి వాహనాల వేగాన్ని అదుపు చేయాలి. రాత్రి సమయాల్లో స్పష్టమైన వెలుతురు ఉండేలా చూడాలి. వాహనదారులకు చెట్ల కొమ్మలు అడ్డురాకుండా వాటిని కత్తిరించాలి. మలుపుల నుంచి వచ్చే వాహనాలు పూర్తిగా కనపడేలా చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుపై మీడియన్స్ మార్కింగ్‌లు స్పష్టంగా కనిపించేలా రంగును వేయాలి. అప్రమత్తం చేసే విధంగా సైన్ బోర్డులను పెట్టాలి. ఈ అంశాలను అందుబాటులోకి తెస్తే ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయి వాహనదారులకు రోడ్డు భద్రత పెరుగుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆశిస్తున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...