కాల్‌సెంటర్ పేరుతో ఖాతా ఖాళీ!


Mon,March 18, 2019 12:24 AM

- సైబర్‌చీటర్ల నయా దందా
-ఖాతా లింక్ ఫోన్ నంబర్‌కు మేసేజ్.. ఆ తరువాత లూటీ
-కార్డుపై ఉన్న బ్యాంకు ఫోన్ నంబర్లకే కాల్ చేయాలంటున్న సైబర్‌క్రైమ్ పోలీస్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఏదైనా అవసరమొస్తే కాల్ సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తారు.. బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం కాల్‌సెంటర్లకు ఫోన్ చేస్తుంటారు.. అయితే సైబర్‌క్రిమినల్స్ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఇంటర్‌నెట్‌లో ఆయా బ్యాంకుల కాల్‌సెంటర్ ఫోన్ నంబర్ అంటూ తమ నంబర్‌నే ఏర్పాటు చేసుకుంటూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. పది రోజుల క్రితం హిమాయత్‌నగర్‌లో ఒక బ్యాంకు ఏటీఎం కేంద్రంలో విశ్వనాథం అనే వ్యక్తి ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసే ప్రయత్నం చేశాడు. డబ్బులు డ్రా చేసే సమయంలో రిసిప్ట్ వచ్చింది కాని.. డబ్బులు రాలేదు.

ఆ రోజు అదివారం కావడంతో విశ్వనాథం బ్యాంకు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయాలని భావించి, ఇంటర్‌నెట్‌లో బ్యాంకు కాల్‌సెంటర్‌ను చూసి ఫోన్ చేశాడు. ఆ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తాను బ్యాంకు మేనేజర్‌నని.. మీ సమస్య చెప్పండంటూ విన్నాడు. మీరు ఒక పనిచేయండి.. మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉన్న నంబర్ చెబితే.. ఆ నంబర్‌కు ఒక మేసేజ్ పంపిస్తామంటూ నమ్మించారు. ఆ ఫోన్ నంబర్‌కు మేసేజ్ పంపించిన తరువాత.. విశ్వనాథంతో మాట్లాడి.. మీకు ఇప్పుడు మేసేజ్ వచ్చిన తరువాత మరో మేసేజ్ వస్తుందంటూ నమ్మించారు. ఆయన వారు చెప్పేది నిజమేనని వచ్చే మెసేజ్‌లలోని
వివరాలను వారికి చెప్పేస్తూ వెళ్లాడు. అయితే అది తాను సైబర్‌చీటర్లకు చెబుతున్నాననే విషయం ఆయనకు తెలియదు.

ఎలా జరుగుతుందంటే..!
ఆ విషయాలు చెప్పిన కొద్దిసేపట్లోనే విశ్వనాథం మొబైల్ నంబర్‌కు ఖాతాలో నుంచి రూ.లక్షల డ్రా అయ్యాయంటూ సమాచారం వచ్చింది. దీంతో బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరగాళ్లు నయామోసాలకు తెరలేపినట్లు గుర్తించారు. ఇంటర్‌నెట్‌లో బ్యాంకు పేరుతో ఒక పేజీ తయారు చేసి అందులో తమ వ్యక్తిగతమైన నంబర్లను ఇస్తారు. ఈ పేజీ గూగుల్ సెర్చ్‌లో మొదటగా కన్పించే విధంగా దానికి ఎస్‌ఈఓ(సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్) చేయడంతోపాటు తమకు తెలిసిన వారితోనే ఆ పేజీ బాగా వాడుకలో ఉన్నట్లు ప్రతి రోజు వేర్వేరు ఐపీ అడ్రస్‌లతో ఆ పేజీని తెరిపిస్తుంటారు. దీంతో ఎవరైనా ఫలానా బ్యాంకు కాల్‌సెంటర్ అని టైప్ చేయగానే సైబర్‌చీటర్ల నంబర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే సైబర్‌చీటర్లు మొత్తం బ్యాంకు పేరుతో ఉన్న ఎక్కడో ఒక దగ్గర చిన్నమార్పులు చేసి తమ పేజీని తయారు చేయడంతో ఇలా జరుగుతుంది.

యాప్‌లతో ఖాతా ఖాళీ చేసేస్తారు..
సైబర్‌నేరగాళ్లు బ్యాంకు అధికారులుగా మాట్లాడుతూ బ్యాంకు ఖాతాకు లింకు ఉన్న ఫోన్ నంబర్‌ను ముందుగా తెలుసుకుంటారు. అందులో భాగంగానే కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయగానే మేం మీకు ఒక మెసేజ్ పంపిస్తాం.. అది బ్యాంకు ఖాతాకు లింకై ఉండాలని కచ్చితంగా చెబుతూ ఆ నంబర్‌ను తీసుకుంటారు. ఆ సెల్‌ఫోన్‌కు పంపించే మెసేజ్‌ను తిరిగి తమకు పంపించాలని సూచిస్తారు. అప్పటికే యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)కి సంబంధించిన మొబైల్ యాప్‌ను తెరిచి ఉంచుతారు. ఖాతాదారుడి ఫోన్‌కు వచ్చే ఓటీపీని తెలుసుకొని దానికి కొత్తగా ఎంపిన్‌ను తెలుసుకొని ఆ ఖాతాలో నుంచి డబ్బులను తమ ఖాతాలకు మళ్లిస్తారు. యూపీఐ మొబైల్ అప్లికేషన్ల నుంచి లక్ష రూపాయల వరకు బదిలీ చేసుకునే అవకాశముంది. దీంతో సైబర్‌చీటర్లు ఒకేసారి లక్ష రూపాయల వరకు బదిలీ చేసేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత మరోసారి రూ.లక్ష ఖాళీ చేశారంటే.. తెల్లవారే వరకు రూ.2లక్షల వరకు ఆయా ఖాతాల నుంచి చోరీ చేసేందుకు అవకాశముంటుంది. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసే సమయంలో అది నిజంగా బ్యాంకు కాల్‌సెంటరేనా? అనే విషయం నిర్ధారించుకోవాల్సిన అవసరముంటుంది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...