సేవే వేడుక..


Mon,February 18, 2019 01:03 AM

-సీఎం కేసీఆర్ పుట్టిన రోజున పలు కార్యక్రమాలు
-రక్తదాన శిబిరాలకు స్పందన
-పేదలకు దుస్తులు, పండ్ల పంపిణీ
ఖైరతాబాద్ : మనిషి జీవితానికి ఓ మంచి కార్యక్రమం సార్థకతనిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ చారిత్రాత్మక కార్యక్రమానికి తెలంగాణ జాగృతి శ్రీకారం చుట్టింది. భారతమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఆత్మశాంతి కలుగాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ తన జన్మదినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం జన్మదినం చరిత్రలో నిలిచిపోయే విధంగా అవయవదాన సంకల్ప కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి చేపట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో, నమస్తే తెలంగాణ, టీన్యూస్ సహకారంతో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతీయువకులు, ప్రముఖలు పెద్ద సంఖ్యలో అవయవదానానికి ముందుకు వచ్చి అందరిలో స్ఫూర్తి నింపారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ వరకూ 50వేల అవయవదానాల సంతకాలు సేకరిస్తామని ప్రతిన బూనారు. ఈ బృహత్తర కార్యక్రమం పట్ల వైద్యాధికారులు, ప్రజలు తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తం చేశారు.

దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం
సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి చేపట్టిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకం. అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నిమ్స్ అనుబంధం జీవన్‌దాన్ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా అవయదానాలకు ముందుకు వస్తున్నారు. 2017 సంవత్సరంలో 150 అవయదానాల ద్వారా ఎందరో రోగులకు జీవనదానం చేశాం. 2018లో తమిళనాడులో 140 ఉంటే తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో 160 అవయవదానాలతో అగ్రభాగాన నిలిచింది. వచ్చే ఏడాది ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్న నమ్మకం ఉంది.
- డాక్టర్ కె. మనోహర్, డైరెక్టర్ నిమ్స్
మా నాన్న కండ్లు ఇవ్వలేకపోయాం
మా నాన్న చనిపోయిన తర్వాత కండ్లు దానం చేద్దామనుకుంటే ఎవరిని సంప్రదించాలో తెలియలేదు. ఎంతో బాధపడ్డాం. తెలంగాణ జాగృతి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ అవగాహన కలిగింది. అందుకే స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు సంతకం పెట్టాను. నా భార్య, పిల్లలు కూడా అవయవదానం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవితకు కృతజ్ఞతలు.
- తుముల శ్రీనివాస్ రావు, ఎల్బీనగర్.

దేశంలో అవయవదానాల సంఖ్య పెరుగాలి
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే దేశంలో అవయవదానం సంఖ్య చాలా తక్కువ. దీనిపై సరైన అవగాహన ప్రజల్లో కల్పించాలి. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచంలో స్పేయిన్ దేశంలో ప్రతి 20లక్షల మందికి 76 మంది అవయవాలు దానం చేసేందుకు ముందుకు వస్తుంటే అమెరికాలో 40 మంది ఉన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం 20లక్షల మందిలో కేవలం ఒకరు మాత్రమే ముందుకు వస్తున్నారు. సీఎం జన్మదినం సందర్భంగా ఏడాదిలోగా 50వేల మంది అవయవదానానికి ముందుకు వచ్చేలా కృషి చేసేందుకు జాగృతి ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది.
-డాక్టర్ గురువా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సన్‌షైన్ హాస్పిటల్స్
హ్యాట్సాఫ్ తెలంగాణ జాగృతి
మనిషి పుట్టుక పుట్టినందుకు జీవితానికి అర్థం ఉండాలి. ఎన్ని దానాలు చేసినా ఫలితం ఉండదు. కాని అవయవదానం చేస్తే జీవితానికి సార్థకత లభిస్తుంది. మరణించిన వ్యక్తిని దహనం, ఖననం చేస్తే వారి అవయవాలు ఎవరికి ఉపయోగపడవు. కాని దానం చేస్తే ఎందరినో బతికిస్తాయి. అవయవాల కోసం ఎదురుచూస్తూ సకాలంలో లభించక మృత్యువాత పడుతున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ అవయవాలు దానం చేయాలి. తెలంగాణ జాగృతి చేపట్టిన ఈ కార్యక్రమానికి హ్యాట్సాఫ్.
- సయ్యద్ నూరుద్దిన్, ఖైరతాబాద్

మా కుటుంబమంతా.. ఇచ్చేశాం
మనిషి చనిపోయిన క్రమంలో తిరిగి జీవించే అవకాశం కేవలం అవయవదానంతోనే సాధ్యమవుతుంది. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం చేసే అవయవదానం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. మా కుటుంబం యావత్తు అవయవదానం చేశాం. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం అందరిలో స్ఫూర్తి నింపుతుంది.
- తాండ్ర శ్రీనివాస రావు, కవిత దంపతులు, అల్వాల్
అవయవదానం చేసిన వారిని ఆదుకోవాలి
2000 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో అవయవదానాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఈ సంఖ్య మరింత పెరుగాలి. అయితే స్వచ్ఛందంగా మరణించిన తమ కుటుంబ సభ్యుల అవయవాలు దానం చేసేందుకు వచ్చిన పేద వర్గాలకు ప్రభుత్వం తగిన సహకారం అందించాలి. వారిలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలి. సుమారు 3లక్షల మంది కాలేయ వ్యాధితో బాధపడుతూ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. జీవన్‌దాన్, ఇతర స్వచ్ఛంద సంస్థలు అవయవదానం చేసేందుకు ప్రజలను జాగృతం చేస్తే ఎందరో ప్రాణాలు నిలుస్తాయి.
- డాక్టర్ రవీంద్రనాథ్, చైర్మన్ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...