వివాహిత ఆత్మహత్య


Mon,February 18, 2019 12:51 AM

కూకట్‌పల్లి, నమస్తే తెలంగాణ : అదనపు కట్నం కోసం భర్త, అతడి కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఓ గృహిణి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలాపాలెంకు చెందిన మేడిశెట్టి శివశంకర్ కుమార్తె ధనలక్ష్మి(25)కు కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటీహిల్స్‌లో నివాసం ఉంటున్న సత్య వెంకటప్రసాద్ కుమారుడు విజయకృష్ణారావుతో గత ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.10లక్షల నగదు, ఎకరం పొలం, 40 తులాల బంగారం కట్నంగా ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా, వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచే విజయకృష్ణారావు, అతని తండ్రి సత్య వెంకటప్రసాద్, తమ్ముడు అనిల్ ధనలక్ష్మిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసేవారు. దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకుని పొలం అమ్మి మరో రూ.30లక్షలు ఇచ్చారు. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ధనలక్ష్మి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ధనలక్ష్మి ఉరివేసుకున్న సమాచారాన్ని విజయకృష్ణారావు తమకు ఎస్‌ఎంఎస్ ద్వారా అందించాడని ధనలక్ష్మి తండ్రి శివశంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా ధనలక్ష్మి మృత దేహాన్ని అలాగే వదిలేసి అక్కడి నుంచి పరారైనట్లు శివశంకర్ తెలిపారు. ఇదిలా ఉండగా, పంజాగుట్టలోని విద్యాశాఖ విభాగం కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న విజయకృష్ణారావు చెడు అలవాట్లకు బానిసై అదనపు కట్నం కోసం వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, తన కూతురు ఆత్మహత్యకు కారణమైన విజయకృష్ణారావుతోపాటు అతడి తండ్రి సత్యవెంకట ప్రసాద్, తమ్ముడు అనిల్‌లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ధనలక్ష్మి తండ్రి శివశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...