ఆరోగ్యమస్తు..


Sat,February 16, 2019 12:35 AM

-ఔషధాలు..వనమూలికలు..
-దుష్ప్రభావం లేని మందులు
-సుమారు 80 స్టాళ్ల ఏర్పాటు
-ఆకట్టుకున్న ఆరోగ్య ఫెయిర్
-సిటీబ్యూరో : దీర్గాకాలిక రోగాలను తగ్గించే ఔషధాలు..వనమూలికలు.. వివిధ వ్యాధులకు చూర్ణాలు.. అన్నీ ఒకే చోట కొలువుదీరాయి. ఆరోగ్య ఫెయిర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో కూడిన ప్రాచీన వైద్య పద్ధతులన్నీ ఒకే వేదికపై దర్శనమిచ్చాయి. నెక్లెస్‌రోడ్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో శుక్రవారం మొదలైన ఆరోగ్య ఫెయిర్ ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఆయుర్వేద, యునాని, హోమియోకు సంబంధించి సుమారు 80 స్టాళ్లు కొలువుదీరాయి. వివిధ రకాల ఔషధాలు, వనమూలికలు, ఔషధ మొక్కలు, చూర్ణాలు, హల్వ, హరక్(సిరప్), వైద్యపరికరాలు తదితర వాటిని ఇక్కడ ప్రదర్శించారు.

జలగలతో రక్తవికారానికి చెక్
పలు కారణాల వల్ల కొంత మంది రక్తంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడుతాయి. దీంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తం అశుద్ధిగా మారడంతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా గర్భిణులు, , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగుల్లో ఎక్కువగా రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తుతాయని సనత్‌నగర్ ఆయుర్వేద వైద్యశాల శాల్యతంత్ర విభాగాధిపతి డా.ఎన్.శ్రీధర్ ఈ ప్రదర్శనలో తెలిపారు. చెడు రక్తం కలిగిన వారికి రెండు పద్ధతుల్లో చికిత్స చేస్తారని ఆయన వివరించారు. ఎక్కువ బాధలేకుండా ఉండేందుకు రక్తాన్ని పీల్చే జలగలతో జలత చికిత్స నిర్వహిస్తారని, రెండో పద్ధతిలో సిరవేదన విధానంలో చెడురక్తాన్ని తొలిగిస్తారన్నారు. జలగలు మనిషి శరీరంలోని చెడురక్తాన్ని మాత్రమే పీలుస్తాయని, శుద్ధమైన రక్తం ఉంటే అవి పీల్చవని డా.శ్రీధర్ వివరించారు.

పంచకర్మ
పంచకర్మ పద్ధతిలో రోగికి శరీరంపై వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా కొన్ని రకాల తైలాలతో మర్ధన చేయడం, కాపుపెట్టడం(కాపడం) వంటి పద్ధతులతో చికిత్స జరుపుతారని ఈ ప్రదర్శనలో ఆయుర్వేద వైద్యులు వివరించారు. అలాగే శ్వాస, ఆసనాలతో ఆయుషు పెంచుకోవచ్చన్నారు. గుండె, శ్వాస, ఊపరితిత్తులు, బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు యోగ, ధాన్యం (మెడిటేషన్) ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వివరించారు.

మొక్కలతో ఆరోగ్యానికి మోక్షం
మన పరిసరాల్లో ఉండే మొక్కలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు సనత్‌నగర్ ఆయుర్వేద దవాఖాన వైద్యులు. మొక్కల ఆకులతో తయారు చేసిన కషాయం లేదా టీ లేదా రసంతో విషజ్వరాలను నయం చేయవచ్చని ఆయుర్వేద ప్రసూతి విభాగం అధిపతి డా.రవీందర్ తెలిపారు. సాధారణంగా మహిళల్లో రక్తస్రావ సమస్య ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ప్రసవం సమయంలో కొందరు మహిళల్లో తీవ్ర రక్తస్రావం జరిగి బాలింత మరణాలు కూడా సంభవిస్తుంటాయని, ఇలాంటి సమస్యలు ఎదరవకుండా ఉండేందుకు రోగులకు అడ్డసారం అనే మొక్క ఆకుల రసాన్ని ఇస్తే రక్తస్రావం తగ్గుతుందని డా.రవీందర్ ఈ సందర్భంగా వివరించారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...