దోమల నియంత్రణకు కార్యాచరణ


Sat,February 16, 2019 12:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దోమలు, వాటితో వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గుడ్డు దశలోనే నాశనం చేసేందుకు పెద్ద ఎత్తున యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతోంది. అంతేకాదు, ప్రజలకు సైతం ముందస్తు జాగ్రత్తలపై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తోంది. వైద్యశాఖతో సమన్వయంతో బస్తీల్లో పెద్ద ఎత్తున వైద్యశిభిరాలను నిర్వహిస్తోంది. దోమల నియంత్రణ చర్యల కోసం వచ్చే 2019-20బల్దియా వార్షిక బడ్జెట్‌లో రూ. 7.46కోట్లు ప్రతిపాదించారు.చెరువులు, కాలువలు, కుంటలు, మూసీనది తదితర ప్రాంతాల్లో దోమల బెడద అధికంగా ఉంది. మురుగునీరు, గుర్రపుడెక్క, నీటిలో వ్యర్థాలు పేరుకుపోవడం తదితర అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రధానంగా చెరువులు, కుంటల్లో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిథిలో 23చెరువులు, కాలువల్లో గుర్రపుడెక్క తొలగించగా, మరో నాలుగు ప్రాంతాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నా యి.

లంగర్‌హౌస్ నుంచి హైకోర్టు పురానాపూల్ బ్రిడ్జివరకు దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గుర్రపు డెక్కను తొలగించడంతోపాటు మూసీ అంచుల్ని శుభ్రం చేయడం, దోమలు వెళ్లగలిగే ప్రాంతాలకు వెళ్లి దోమల పెరుగుదల నియంత్రణకు శుభ్రంచేసి స్ప్రే చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. చెరువులు, మూసీలో హెర్‌బిసైడ్లు, పైరిత్రం స్ప్రే చేస్తున్నారు. గృహాలు, గృహాల చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమల ఉత్పత్తికి కారణమయ్యే చోట్లకు వారానికోసారి 642 బృందాలు ఇంటింటికీ వెళ్లి దోమ గుడ్ల ఉత్పత్తి పెరుగుదల నివారణకై తగిన చర్యలు చేపడుతున్నారు. అన్ని సర్కిళ్లలో కలిపి 150పోర్టబుల్, 10వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లతో ప్రతిరోజూ క్రమబద్ధంగా ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే పారదర్శకతకోసం వీటికి లాగ్‌బుక్‌ళు నిర్వహిస్తున్నారు. దోమల ఉత్పత్తి, పెరుగుదల అధికంగా ఉన్న ప్రాంతాల్లో డెం గ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 513వైద్యశిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

దోమలు, వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు
-గట్టి నిఘా, దోమల నియంత్రణ, అంటువ్యాధుల వ్యాప్తి నియంత్రణ తదితర చర్యలకు జీహెచ్‌ఎంసీ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
- ఇళ్లలోనూ, ఇంటి చుట్టుపక్కలా, బహిరంగ ప్రదేశాలు తదితరచోట్ల పిన్‌పాయింట్ ప్రోగ్రాం ప్రకారం వారం-వారం క్రమ తప్పకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే, ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో దోమలవ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులను గమనించి వాటన్నింటినీ తొలగించడంతోపాటు దోమల నిర్మూలన మందులను పిచికారీ చేస్తున్నారు.
- చెరువుల్లో గంబూషియా చేపలను వదలుతున్నారు. ఇవి దోమలు, వాటి గుడ్లను తిని దోమల వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు దోహదపడుతున్నాయి
- పోస్టబుల్, వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లతో రోజువారీ ఫాగింగ్ చేస్తూ పెద్ద దోమల్ని నియంత్రిస్తున్నారు. పారదర్శకతకోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కార్పొరేటర్లు, స్థానిక నేతలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సంతకాలు తీసుకుంటున్నారు.

-వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడంకోసం అన్ని రిపోర్ట్ చేయబడిన కేసుల్లో ఇండోర్ పైరిత్రం స్పేస్ స్ప్రే, లార్వల్ సర్వే, ఫాగింగ్ చర్యలు తీసుకుంటున్నారు
-దోమల్ని నిరోధించడానికి పాఠశాలల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే చేస్తున్నారు. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలను దోమల నియంత్రణ కార్యక్రమాలపట్ల ప్రోత్సహిస్తున్నారు.

- అలాగే స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కల్పించడంతోపాటు డెంగ్యూ, మలేరియా, దోమల నియంత్రణ కార్యకలాపాలను గృహాలస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఐఈసీ (సూచన, విద్య, సమాచారం) కార్యకలాపాలు చేపడుతున్నారు
- అంటు వ్యాధులను నియంత్రించేందుకు వ్యాధులు వ్యాపించే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక దోమల నియంత్రణ చర్యలు పాటించడంతోపాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
- దోమల నియంత్రణకోసం టెమెఫోస్, డైఫ్లుబెన్ జోరోన్, పైరోయిన్ ఆయిల్, ఏసీఎం, పైరిత్రం, డీటీ తదితర మందులు ఉపయోగిస్తున్నారు
దోమల నియంత్రణ కోసం వచ్చే 2019-20బల్దియా వార్షిక బడ్జెట్‌లో రూ. 7.46కోట్లు ప్రతిపాదించారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...