ప్రక్రియ మొదలైంది..


Mon,January 21, 2019 01:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఔటర్ రింగు రోడ్డులో ఏడాది మొత్తానికి టోల్ వసూలు (దారిసుంకం) బాధ్యతలను నూతన ఏజెన్సీకి అప్పగించేందుకు హెచ్‌ఎండీఏ రంగం సిద్ధం చేస్తున్నది. 158 కిలోమీటర్ల రహదారిలో దారిసుంకంను మ్యాన్‌వల్ పద్ధతిలోనే టోల్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం రోజుకు రూ. 87 లక్షల చొప్పున ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ హెచ్‌ఎండీఏకు చెల్లిస్తున్నది. అయితే ఈ ఏజెన్సీ నిర్వహణ గడువు వచ్చే నెల (ఫిబ్రవరి) 23తో గడువు ముగుస్తుండడంతో మరో ఏడాది పాటు కొత్త ఏజెన్సీ ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోటీ బిడ్డింగ్ ప్రాతిపదికన యూజర్ ఫీ కలెక్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజర్ ఫీజు సేకరణకు ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. ఆసక్తి ఉన్న ఏజెన్సీలు 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోగా టెండర్లు బిడ్లు దాఖలకు గడువు విధించారు. ఈ సారి టెండర్‌లో నెలవారీగా ఔటర్ నిర్వహణలో వచ్చే కరెంట్ బిల్లులను సదరు టెండర్ దక్కించుకున్న సంస్థ చెల్లించాలన్న నిబంధనను కొత్తగా చేర్చారు. ఇదే రోజున టెక్నికల్ బిడ్లు తెరిచి, వెనువెంటనే ఆర్థిక బిడ్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.వారం రోజుల వ్యవధిలో ఏజెన్సీని ఎంపిక చేయడం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రతి ఏటా తరహాలోనే ఎన్‌హెచ్‌ఏఐ ( నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం 10-12 శాతం మేర టోల్ రేట్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

158 రహదారిలో..
158 కిలోమీటర్ల ఔటర్ రహదారిలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం దాదాపు లక్ష వాహనాలు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ ( నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం దారి సుంకం వసూలు చేస్తున్నారు. కోకాపేట, ఈదుల నాగుర్లపల్లి, పటాన్‌చెరు, సుల్తాన్‌పూర్, దుండిగల్/సారాయిగూడెం, మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, తారామతి పేట, పెద్ద అంబర్‌పేట, బొంగుళూరు, రావిర్యాల, తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, కండ్లకోయ, శంషాబాద్, రాజేంద్రనగర్, టీఎస్‌పీఏ, నానక్‌రాంగూడ ఇంటర్‌ఛేంజ్‌ల టోల్‌ప్లాజాల నుంచి టోల్ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న ఐఆర్‌బీ సంస్థ ప్రతి నెలా రూ. 26 కోట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఏ)కు చెల్లిస్తున్నది. ఈ క్రమంలోనే 15 టోల్‌ప్లాజాలు పరిధిలో ఏ ప్లాజా వద్ద ఔటర్‌పైకి ప్రవేశించారు..? ఎక్కడ దిగారు..? ఎంత దూరం ఆ మార్గంలో ప్రయాణించారనే అంశంపై ప్రస్తుతం దారి సుంకం వసూలు చేస్తున్నారు. వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి దారి సుంకం వసూలు చేస్తున్నారు. ఏజెన్సీ టెండర్ గడువు వచ్చే నెల 23తో ముగుస్తుండడం, ఇటీవల వాహనాల సంఖ్య పెరుగడం, రాకపోకలు సాగించే రహదారి గతంలో కంటే మరింత పెరుగడం వంటి అంశాల నేపథ్యంలో మళ్లీ టెండర్ల వైపు అధికారులు మొగ్గు చూపారు. తాజా టెండర్‌పై గతంలో కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

350
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...