దళారులను నమ్మి మోసపోవద్దు


Sat,January 19, 2019 12:58 AM

-కుటుంబ సభ్యులకు భారం కావొద్దు
-నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాం
-తెలంగాణ విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ చైర్మన్ బోయపల్లి రంగారెడ్డి
-విదేశీయాన నియమ నిబంధనలపై ‘ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ శిక్షణ’ ప్రారంభం
-హాజరైన హోం కార్యదర్శి రాజీవ్ ఉపాధి శిక్షణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్
బేగంబజార్ : ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు దళారులను నమ్మి మోసపోయి కుటుంబానికి భారం కాకుండా న్యాయపరంగా వెళ్లి ఉపాధిని పొందేలా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ సంయుక్తాధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటి సారి విదేశాలకు వలస వెళ్లే వారికి ఆయా దేశాల నియమ నిబంధనలపై ‘ప్రి-డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్’ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడుతగా విదేశాలకు వెళ్లే 50 మందికి నిష్ణాతులైన వారితో శిక్షణ కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ చైర్మన్ బోయపల్లి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర హోం కార్యదర్శి రాజీవ్ ఉపాధి శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ రీజినల్ పాస్ అధికారి విష్ణువర్దన్ తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ సంచాలకులు కెవై నాయక్, ప్రొటెక్టర్ ఆఫ్ మైగ్రేన్ మధుసూదన్, జనరల్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోయపల్లి రంగారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించి విదేశీ ఉద్యోగ భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా టాంకాం నిరంతరం కృషి చేస్తుందన్నారు. విదేశీ మార్కెట్ డిమాండ్ అనుగుణంగా, ఉద్యోగ సాధనానికి తగినట్లుగా యువతకు శిక్షణ కల్పించేందుకు దేశంలోని ఢిల్లీ, ముంబై, కేరళ రాష్ర్టాల తరహా లో తెలంగాణలో మొట్టమొదటి సారిగా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉపాధికి వలస వెళ్లేవారు అక్కడి నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తెలుసుకొని నడుచుకోవాలన్నారు. ఉపాధి శిక్షణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ మాట్లాడుతూ విదేశాలకు వెళ్లేవారికి గతంలో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు.

ఢిల్లీ, ముంబై, కేరళ రాష్ర్టాల్లో విదేశాలకు వలస వెళ్లే వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కల్పించిన తర్వాతనే విదేశాలకు పంపిస్తారన్నారు. అదే తరహాలో విదేశాలకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో వలస వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉందని, దీంతో రాష్ట్రంలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలనే యోచనతో మొదటగా టాంకాం హైదరాబాద్ ప్రారంభించినట్లు తెలిపారు. తదనంతరం కరీంనగర్, నిజామాబాద్ కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రీజినల్ పాస్ అధికారి విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత విదేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్న వారికి ఎన్నో ఇబ్బందులు తొలిగాయన్నారు. తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ సంచాలకులు కెవై నాయక్ మాట్లాడుతూ తెలంగాణ యువతకు ప్రి డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. మోసపూరిత, అనైతిక దళారీ వ్యవస్థను నిర్మూలించుటకు తెలంగాణ ప్రభుత్వం టాంకాంను స్థాపించడం జరిగిందన్నారు. దళారులను కట్టడి చేసి యువతకు విదేశాల్లో ఉపాధిని కల్పించేందుకు సేఫ్ అండ్ మైగ్రేషన్ కార్యక్రమంతో ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. విదేశాల్లో మేసన్, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, నర్సులు, పారామెడికల్, హాస్పిటాలిటీ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నందున నైపుణ్యమైన తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేలా విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొటెక్టర్ ఆఫ్ మైగ్రేషన్ అధికారి మధుసూదన్, టాంకాం జనరల్ మేనేజర్ నాగభారతి, తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ ఎంప్లాయిమెంట్ జేడీ ఉషారాణి, టాంకాం ప్రతినిధులు సుభాన్, రవి తదితరులు పాల్గొన్నారు.

218
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...