డీజిల్ చోరీకి... చర్లపల్లిలో సొరంగం


Fri,January 18, 2019 12:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముంబైకి చెందిన ముఠా నగరంలో భారీ డీజిల్ చోరీకి పాల్పడింది. జైలు పరిచయంతో గ్యాంగ్‌గా ఏర్పడి.. రెండు నెలల రెక్కీ నిర్వహించి దొంగతనానికి స్కెచ్ వేసింది. స్క్రాప్ డంపింగ్ పేరుతో స్థలాన్ని లీజ్‌కు తీసుకుని.. పైపులైన్‌కు రంధ్రం చేసి 1.40లక్షల లీటర్లను కాజేసింది. ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థల ప్రతి నిధుల ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు ఆయిల్ చోరీ గుట్టును బయటపెట్టారు. డిసెంబర్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులు... తమ పైపులైన్ నుంచి సరఫరా అవుతున్న డీజిల్‌లో కొంత తక్కువ వస్తుందని, గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారని అనుమానంతో రాచ కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ మహేశ్ భగవత్ ఆదేశంతో రాచకొండ సీసీఎస్, కీసర పోలీసులు రంగంలోకి పైపులైన్ సరఫరా మార్గాన్ని పరిశీలించారు. చర్లపల్లి వద్ద పైపులైన్ వెళ్తున్న మార్గానికి ఆనుకుని ఉన్న స్థలంలో కొత్తగా ఏర్పడిన డంపింగ్ షెడ్‌ను తనిఖీ చేశారు. ఆ స్థలంలో 9 అడుగుల పొడవు, ఆరు అడుగుల లోతుతో ఓ సొరంగాన్ని గుర్తించారు. దానిలోకి వెళ్లి పరిశీలించగా పైపులైన్‌కు రంధ్రం చేసి.. అక్కడి నుంచి స్థలంలోకి వేరే పైపులైన్ వేసినట్లు గుర్తించారు. నిందితులు హఫీజ్ అజీజ్ చౌదరీ, బిన్ని శ్రీనివాసులు, మహ్మద్ అబ్దుల్ అబ్రార్, మారోజు జయకృష్ణలను అరెస్ట్ చేశారు. మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

జైలులో పరిచయం...
ముంబై ముమ్రా ప్రాంతానికి చెందిన హఫీజ్ అజీజ్ చౌద రీ, హైదరాబాద్ బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అబ్రార్, జియాహుల్ చాంద్ షేక్ అలియాస్ చెడ్డీ బెంగాలీలు ముంబైలో పలు కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు...అక్కడి జైలులో పరిచయమయ్యారు. గ్యాంగ్‌గా ఏర్పడి పైపులైన్ నుంచి డీజిల్ చోరీకి స్కెచ్ వేశారు. హఫీజ్ హైదరాబాద్ యువతిని పెండ్లి చేసుకోవడం, బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన అబ్దుల్ అబ్రార్‌తో స్నేహం ఉండడంతో వారు చర్లపల్లి ప్రాంతంపై కన్నేశారు. ఆ ప్రాంతంలో దాదాపు రెండు నెలల పాటు రెక్కీ చేసి... ఘట్‌కేసర్ నుంచి చర్లపల్లి వరకు భారత్ పెట్రోలియం ఆయిల్ కంపెనీ నుంచి ఇండియన్ ఆయిల్ కంపెనీకి డీజిల్ సరఫరా అవుతుందని గుర్తించారు. ఈ పైపులై న్ సమీపంలోని స్థలాల కోసం సెర్చ్ చేయగా.... చర్లపల్లి ప్రాంతంలో పైపులైన్‌ను ఆనుకున్న స్థలం వీరికి దొరికింది. యజమాని మహేందర్‌గౌడ్‌తో ఆ స్థలంలో స్క్రాప్ డంపిం గ్ యార్డు కోసం లీజుకు మాట్లాడుకున్నారు. ఎవరీకి అనుమానం రాకుండా చుట్టూ ఇనుప షీట్లను ఏర్పాటు చేసుకున్నారు. స్థలం ప్రహారీ నుంచి ఆరు అడుగుల లోతు, 9 అడుగుల వరకు పొడవు వరకు సొరంగం తవ్వారు. డీజిల్ సరఫరా అవుతున్న పైపులైన్‌కు కింద నుంచి రంధ్రం చేసి. .. వీరి స్థలంలోకి వేరుగా పైపులైన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పైపులైన్ నుంచి డీజిల్‌ను రాత్రి 11 నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు తీస్తున్నారు. నెలరోజుల్లో 1.40 లక్షల లీటర్ల డీజిల్‌ను చోరీ చేశారు. ఈ చోరీ చేసిన డీజిల్‌ను అమ్మేందుకు జయకృష్ణ, శ్రీకాంత్, వాసు, సునీల్‌లను మధ్యవర్తులుగా మాట్లాడుకుని మార్కెట్ ధరకు రూ.5లు తక్కువగా ధరకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మధ్యవర్తులు దొంగతనం చేసిన డీజిల్‌ను వరంగల్, బాచుపల్లి, బూరుగ్లు, కొయ్యకొండ, ధర్మాబాద్, మహారాష్ట్రలో విక్రయించారు. ట్యాంకర్లను అద్దెకు తీసుకురావడం, మధ్యవర్తులను ఏర్పాటు చేయ డం... ఎవరీకి పట్టుబడకుండా చోరీ డీజిల్‌ను విక్రయించేందుకు, ముఠాకు ఫైనాన్సర్‌గా మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన బిన్ని శ్రీనివాసులు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

డేంజర్ బోర్డులే వారికి ఆచూకీ....
డీజిల్ చోరీకి స్కెచ్ వేసుకున్న హఫీజ్ అజీజ్ చౌదరీ, అబ్రార్, జియాహుల్ షేక్‌లు సంవత్సరం కిందనే చోరీ చేయాలనుకున్నారు. అయితే పలు ప్రాంతాల్లో ప్రయత్నించినప్పటికీ అక్కడ పరిస్థితులు, పైపులైన్ వెళ్లిన దారి అనుకూలించకపోవడంతో దృష్టిని చర్లపల్లి వైపు మళ్లించారు. అక్కడ.. ఈ ముఠా డీజిల్ సరఫరా పైపులైన్ ఎక్కడి నుంచి వెళ్తుందని తెలుసుకున్నారు. పైపులైన్ వెళ్తున్న 17 కిలో మీటర్ల దూరంలోని ప్రతి 100 మీటర్ల(300 అడుగుల) దూరంలో ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం కంపెనీ వారు వాల్వులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు అక్కడ హెచ్చరిక(డేంజర్ నోటీస్ బోర్డు) బోర్డులను ఏర్పాటు చేశారు. దీన్ని ఆధారంగా తీసుకుని దుం డగులు 17 కిలోమీటర్ల పాటు రెక్కీ చే సి... అనువైన స్థలంగా చర్లపల్లిలో గుర్తించి అక్కడ పైపులైన్‌కు స్పాట్ పెట్టారు. పైపు లైన్‌కు రంధ్రం చేసే సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోకుండా దుండగులు ముం దుగా నీళ్లతో తడిపిన గోనెసంచిని పైపులైన్‌కు చుట్టి.... మిరుగులు చిమ్మకుండా పైపులైన్‌కు రంధ్రం చేసి మరో పైపును అమర్చారు. దీని కోసం చాలా ఖరీదైన సామగ్రిని కొనుగోలు చేశారని పోలీసు దర్యాప్తులో తేలిం ది. పైపులైన్ నుంచి వీరు భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన 84,365, ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన 46,236 లీటర్ల డీజిల్‌ను కాజేశారు.

ముమ్రా... అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం
ముంబైలోని ముమ్రా ప్రాంతం చాలా ప్రమాదకరమని తెలిసింది. ఇక్కడ నివసించే నేరస్తులకు మాఫియాతో సంబంధాలు ఉంటాయని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన సంఘటనలు స్పష్ట ం చేశాయి. ముంబై పేలుళ్లలో ఉపయోగించిన బాంబులకు ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థం నిల్వలను ఈ ప్రాంతంలోనే దాచిపెట్టిన వైనం తెలిసిందే. అంతేకాకుండా హైదరాబాద్ జూపార్క్ సాఖీ పులిని చం పి, దాని చర్మాన్ని కూడా ముమ్రాకు తరలించారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆ కేసు దర్యాప్తులో తాను ముమ్రా ప్రాంతానికి వెళ్లామని ఆయన గుర్తు చేశా రు. ఇప్పుడు పట్టుబడ్డ ప్రధాన సూత్రధారి కూడా ముమ్రా కు చెందిన వారేనని, వీరు నకిలీ కరెన్సీ సరఫరా కేసులతో పాటు పైపులైన్‌ల నుంచి డీజిల్ చోరీ చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించి మిస్టరీని ఛేదించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్న సిబ్బందిని సీపీ అభినందించి, రివార్డులను అందించారు. ఆలాగే అతి స్వల్ప కాలంలో మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్‌పెట్రోలియం సంస్థ ప్రతినిధులు ప్రశంసించి, ధన్యవాదాలు తెలిపారు. డీజిల్, పెట్రోల్ సరఫరాకు సంబంధించిన పైపులైన్‌ల సంరక్షణపై ప్రతినిధులతో కలిసి చర్యలు చేపడతామని సీపీ వివరించారు. పైపులైన్‌ల నుంచి చోరీ చేస్తే వారికి పెట్రోలియం, మినరల్ అమెండ్‌మెంట్ యాక్ట్ కింద 10 సంవత్సరాల జైలు ఉంటుందని సీపీ హెచ్చరించారు. పట్టుబడ్డ నిందితులపై పీడీయాక్ట్ విధిస్తామన్నారు. చోరీల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని .. అలాంటిది చోటుచేసుకోకముందే నిందితులను పట్టుకున్నామని రాచకొండ సీపీ అన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...