అనవసర వైద్య పరీక్షలొద్దు


Fri,January 18, 2019 12:09 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వైద్యులు రోగులపాలిట ప్రాణదాతలని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని మనోహర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన వీనస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. మధ్య తరగతి ప్రజలు మెడికల్ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని, ఒకప్పుడు చాలా వరకు హోమ్‌మేడ్ రెమెడీస్ ఉండేవని, ఇప్పుడు ప్రతిచిన్న సమస్యకు ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు అనవసరమైన వైద్యపరీక్షలు రాయడం మానుకొని, సరైన పద్ధతిలో సులభంగా వ్యాధులను గుర్తించేందుకు యత్నించాలని సూచించారు. ప్రతి చిన్నదానికి శస్త్ర చికిత్సలు చేయకుండా సాధ్యమైనంత వరకు మందులతోనే వ్యాధులు నయమయ్యేలా కృషిచేయాలన్నారు. వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులకు రోగి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారమివ్వాలని చెప్పారు. నిమ్స్ వంటి ప్రభుత్వ దవాఖానలు మధ్యతరగతి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు రోగికి ఇచ్చే మానసిక ధైర్యమే వారిలోని సగం వ్యాధిని తగ్గిస్తుందన్నారు. అనంతరం వాయ్ యాప్‌ను ఆవిష్కరించారు.

ఉత్తమ సేవలందించిన పలువురు వైద్యులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యనిపుణులు మాట్లాడుతూ సిరల చికిత్సలు సురక్షితమైనవిపై నిర్వహిస్తున్న సదస్సుకు స్వదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా 350మందికిపైగా వైద్యులు, నర్సులు, టెక్నీషియన్స్, ఫిజియోథెరపిస్టులు హాజరుకానున్నట్లు తెలిపారు. మూడురోజులపాటు జరిగే ఈ సదస్సులో అంతర్నాళాల వ్యాధులకు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన శాస్త్రీయ, క్లినికల్, టెక్నికల్ ఆవిష్కరణలతోపాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి, అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పీ రఘురామ్, వీఏఐ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ జిందాల్, ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రొఫెసర్ పింజల రామకృష్ణ, వాయికాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ నీహర్‌రంజన్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...