అందంగా.. స్వచ్ఛంగా


Thu,January 17, 2019 01:37 AM

- సుందర నగరం కోసం.. సాఫ్ హైదరాబాద్..షాన్‌దార్ హైదరాబాద్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నగరాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ నినాదంతో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వాహనాలకు కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కాలనీల్లోని వ్యర్థాలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపిస్తారు.

నగరాన్ని మరింత అందంగా మారనున్నది. ఈ మేరకు బల్దియా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. నగరాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ నినాదంతో కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. ఇందులోభాగంగా నానో మానిటరింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. వాహనాలకు కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కాలనీల్లోని గార్బేజ్,నిర్మాణ వ్యర్థాలను గుర్తించి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తామన్నారు. ఈ విధానం 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందన్నారు. వీటి ఆధారంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం బల్దియా కార్యాలయంలో దానకిశోర్ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రంగా ఉంచడానికి హెచ్‌ఎండీఏ, మెట్రోరైలు తదితర పెద్ద సంస్థలు చెత్త కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయన్నారు. పారిశుధ్య కార్మికులతో జోన్‌ల వారీగా సమావేశమై రెండు గంటల పాటు శిక్షణ ఇచ్చి వారితో కలిసి భోజనం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

నగరం పరిశుభ్రంగా ఉండడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ఒక్కటే సరిపోదని, ప్రజల్లో చైతన్యం పెంచి వారి సమన్వయంతో మంచి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటివరకు కాలనీల్లో పెయింటింగ్స్ వేసి స్వచ్ఛ కాలనీల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టామని, అదే విధంగా బస్తీలను పరిశుభ్రంగా ఉంచేందుకు బస్తీల్లో పెయింటింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మొదట ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని వర్గాలతో మమేకమవుతామన్నారు. ఆటో యూనియన్స్, రెసిడెంట్స్ అసోసియేషన్స్, డాక్టర్స్ ,హాకర్స్, స్ట్రీట్ వెండర్స్, వ్యాపారస్తులతో సమావేశమై చేస్తున్న తప్పిదాల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు పలు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే నాలాల పూడికతీత కార్యక్రమం, నగరంలోని కమర్షియల్ ప్రాంతాల్లో డస్ట్‌బిన్ల ఏర్పాటు, వంద కిలోలపైగాకు చెత్తను ఉత్పత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్లు కంపోస్టు యూనిట్లు తదితర చర్యలను చేపట్టామన్నారు.

ఆస్తి పన్ను పెంచే యోచన లేదు
హైదరాబాద్ నగరంలో ఆస్తిపన్ను పెంచే యోచన లేదని కమిషనర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను పెంచబోతున్నట్లు వచ్చిన వార్తాల్లో నిజం లేదన్నారు. నగరంలోని ఇండ్లు, భవనాలు జీఐఎస్ ద్వారా మానిటరింగ్ చేసే ప్రక్రియను చేపడుతున్నామన్నారు. ఈ విధానం వల్ల ఇప్పటివరకు ఆస్తి పన్ను పరిధిలోకి రాని ఇండ్లన్ని ఆస్తిపన్ను పరిధిలోకి వస్తాయని చెప్పారు. పన్నులను పెంచకుండా పన్నుల వసూళ్లను మరింత సమర్థ్ధవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లకు నిధుల కొరత లేదు
నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని కమిషనర్ తెలిపారు. ఇటీవలే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. చెంగిచెర్ల కబేలాకు శాశ్వత మంచి నీటి సరఫరాను అందజేసేందుకు 150 మీటర్ల పైప్‌లైన్ వేయనున్నట్లు దానకిశోర్ వెల్లడించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమాలను మూడో విడుత బాండ్ల ద్వారా నిధుల సేకరణకు త్వరలోనే తాను మేయర్ కలిసి ముంబై స్టాక్ ఎక్సేంజీకీ వెళ్లనున్నట్లు తెలిపారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...