సెల్‌టవర్‌ల బ్యాటరీలు.. చోరీ చేస్తరు.. అమ్మేస్తరు!!


Thu,January 17, 2019 01:31 AM

దోమలగూడ : సెల్‌టవర్ బ్యాటరీల చోరీకి పాల్పడుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి మంగళవారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. రాజేందర్‌నగర్‌కు చెందిన మహ్మ ద్‌హుస్సేన్(22), కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఫసుద్దీన్(24) ఇద్దరు పాత నేరస్తులు. ఇదిలా ఉండగా వీరు ముషీరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఇక్రముద్దీన్(22), మహ్మద్ అజాజ్ అహ్మద్(22), షేక్ రియాజ్ (22)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గత 14 నెలలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సెల్‌టవర్లకు ఉండే బ్యాటరీలను దొంగిలించి వాటిని భోలక్‌పూర్‌లోని స్క్రాప్ వ్యాపారులు మహ్మద్ అజీజ్ (22), మహ్మద్ షబ్బీర్ హుస్సేన్(33), హజి పాషాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 14 నెలలుగా ఈ ముఠా 600లకు పైగా బ్యాటరీల చోరీకి పాల్పడినట్లు సమాచారం. అయితే ఇటీవల ఓ నెట్‌వర్క్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ డీఐ వెంకన్న బృందం డీఎస్సై బాల్‌రాజ్, సిబ్బంది కృష్ణ, హరీశ్, అభిలాష్, విశ్వనాథ్, విక్రమ్‌తో కలిసి రంగంలోకి దిగి ముఠా కదలికలపై కన్నేశారు.

ఈ క్రమంలో దొంగిలించిన సొమ్మును ముఠా సభ్యులు విక్రయిస్తుండగా ప్రధాన నిందితుడు మహ్మద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగిలించిన బ్యాటరీని తమ ముఠాతో కలిసి రూ.1,700లకు భోలక్‌పూర్ స్క్రాప్ వ్యాపారులకు విక్రయించనున్నట్లు అంగీకరించాడు. ప్రధాన నిందితుడు ఇచ్చిన వివరాలతో మరో నలుగురితోపాటు, దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మహ్మద్ అజీజ్, షబ్బీర్ హు స్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యాపారి హాజి పాషా పరారీలో ఉన్నట్లు మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 166 బ్యాటరీలు, రెండున్నర లక్షల రూపాయలు, ఒక్క ఇన్నోవా, టాటా బోల్ట్ కారుతోపాటు ఓ ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితులు మహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఫసుద్దీన్‌పై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 30కిపైగా కేసులు నమోదయ్యాయని, వరుస నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదిస్తామని డీసీపీ వెల్లడించారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...