నింగీనేల.. సప్తవర్ణ మేళా


Tue,January 15, 2019 05:57 AM

-పూలవనంలా పరేడ్ మైదానం
-ఉత్సాహంగా కైట్, స్వీట్ ఫెస్టివల్స్
-సందర్శకులతో కిక్కిరిసి పోయిన గ్రౌండ్
-నోరూరించిన మిఠాయిలు

సప్తవర్ణ కాంతులు.. ఆకట్టుకునే ఆకృతులు.. నింగీనేలను ఏకం చేశాయి..గాలి పటాలు లైటింగ్ పతంగులు జిగేల్ మన్నాయి.. జంతువుల రూపాలు నింగిలో నృత్యం చేశాయి.. మొత్తంగా పరేడ్ మైదానాన్ని పూలవనం చేశాయి.. వెయ్యి రకాలకు పైగా మిఠాయిలు సందర్శకుల నోరు తీపి చేశాయి.. కైట్, స్వీట్ ఫెస్టివల్ రెండోరోజు సోమవారం సందర్శకులను అలరించింది.
రంగురంగుల పతంగులతో పరేడ్ మైదానం.. పూల వనంలా మారింది.. అబ్బురపరిచే ఆకృతులు.. సప్తవర్ణ కాంతులతో గాలిపటాలు అలరించాయి. లైటింగ్ పతంగులు ఫెస్టివల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. వివిధ రాష్ర్టాలకు చెందిన 1200 రకాల మిఠాయిలు నోరూరించాయి.. అందమైన పతంగలు, ఆకట్టుకునే స్వీట్లతో రెండో రోజు వేడుకలు ఘనంగా సాగాయి.

రసూల్‌పురా : పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతున్నది. రంగురంగుల పతంగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గాలిలో నృత్యం చేస్తున్న టైగర్, డ్రాగన్, చింపాంజీ, గరుడ వంటి విభిన్న పతంగులు అలరిస్తున్నాయి. రిమోట్ తో రాత్రి వేళ ఎగురవేసిన లైటింగ్ పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ప్రాంతాలు బోసిపోగా పరేడ్ మైదానం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. గ్రౌండ్ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

తియ్యటి వేడుక

79 రకాల లడ్డూలు.. 68 రకాల హల్వాలు.. 65 రకాల పాయసాలు.. మిఠాయిల పండుగలో వెయ్యికి పైగా స్వీట్లను ప్రదర్శించారు. కాకినాడ ఖాజ, బందరు లడ్డూలు, 220 రకాల డ్రై ఐటమ్స్, 446 రకాల సెమీ లిక్విడ్ హల్వాలు, 60 రకాల జ్యూస్‌లు ఘుమఘుమలాడాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీలు, బెంగాలీలు, రాజస్థానీలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక అసోసియేషన్స్ వారు తమ సంప్రదాయ మిఠాయిలను ప్రదర్శనకు తీసుకువచ్చాయి. వీటి కోసం 500కు పైగా విక్రయశాలలు ఏర్పాటు చేశారు. అలాగే 14 అంతర్జాతీయ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే అర్జెంటినా, నేపాల్, కెన్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల స్టాల్స్ కనిపించాయి.

అపూర్వ స్పందన

కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు నగరవాసుల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ రానున్న రోజుల్లో స్వీట్ ఫెస్టివల్ నగరంగా ఖ్యాతి గడిస్తున్నది. స్వీట్ ఫెస్టివల్‌పై రాయల్టీ తీసుకొనే ఆలోచన ఉన్నది. ఇకమీద ప్రతి సంవత్సరం స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తాం. ఇంటి పిండి వంటలు, స్వీట్లను నగరవాసులకు అందిస్తున్నారు.
- మామిడి హరికృష్ణ,
సాంస్కృతిక శాఖ సంచాలకులు

తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర సర్కారు గొప్ప పనులకు పూనుకోవడం శుభసూచికం. దేశంలో ఏ రాష్ర్టానికి రాని కొత్త ఆలోచనలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నాడు. ఫెస్టివల్స్ నిర్వహించడం గొప్ప విషయం. గతంలోనే స్వీట్ ఫెస్టివల్‌కు రావాలి అనుకున్నా కుదరలేదు. ఎంతో అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను ఇక్కడే జరుపుకోవాలని వచ్చాం. దేశంలోని స్వీట్లతో పాటు విదేశాల స్వీట్లు అబ్బురపరుస్తున్నాయి. వాటి రుచులు ఎంతో మధురంగా ఉన్నాయి.
- సమీరా, కాకినాడ

సంతోషంగా ఉంది..

నగరానికి రావడం ఇది రెండో సారి. నగరంలో కైట్, స్వీట్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలుసుకొని వచ్చాము. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. కేవలం కొన్ని రకాల స్వీట్లు మాత్రమే తినేదాన్ని. కానీ ఉత్సవంలో పలు దేశాలకు చెందిన స్వీట్లు తినడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
- షర్మిలాబిష్వాల్, పశ్చిమ బెంగాల్

40 ఏండ్ల అనుబంధం..

గాలి పటాలు ఎగురవేయడం, తయారీలో నాకు 40 ఏండ్ల అనుబంధం ఉన్నది. నేనే సొంతంగా గాలి పటాలను తయారు చేసుకుంటాను. ఇండియాకు రావడం ఇది ఆరో సారి. తెలంగాణలోని హైదరాబాద్‌కు మొదటి సారి వచ్చాను. హెక్సాగోన్ కైట్స్, బట్టర్ ైఫ్లె కైట్స్ నా ప్రత్యేకత. ఇక్కడ కాస్త గాలి సరిగా లేకపోవడం వల్ల పతంగులు మొరాయిస్తున్నాయి. 25ఏండ్లుగా కైట్ ఫెస్టివల్స్‌లో పాల్గొంటున్నాను.
-పారియో మార్యాని, ఇటలీ

ఏడేండ్లుగా..

డ్రీమ్స్ క్లబ్ సూరత్ నుంచి వచ్చాము. ఏడేండ్లుగా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాము. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో భాగంగా సింగపూర్, ఇండోనేషియా, చైనా, జకర్తా, మలేషియా, దుబాయ్, హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాము. జకర్తాలో ప్రధాని మోదీ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నాము. కేరళలో జరిగిన వేడుకలకు హాజరయ్యాము. పతంగులు ఎగురవేయడం హాబీ. మేము బ్యాంబూ కైట్స్, లోకల్ కైట్స్‌ను తయారు చేస్తాం.
-భాస్కర్, నితీశ్,
(సూరత్,గుజరాత్ రాష్ట్రం)

మాంజాను నిషేధిద్దాం.. పక్షులను కాపాడుకుందాం

చైనా మాంజా వాడొద్దని పక్షి ప్రేమికుడు సత్తి రామచంద్రారెడ్డి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్ పలువురుని ఆకట్టుకుంటున్నది. పతంగులకు కాటన్ దారాలనే వాడాలని, పక్షుల సంరక్షణ కోసం తాగునీరు, ఆహారం, దాణాను బాల్కనీలు, టెర్రస్‌లపై ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాడు.
-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...