మై జీహెచ్‌ఎంసీ యాప్ డౌన్‌లోడ్ ఏడు లక్షలు


Tue,January 15, 2019 05:52 AM

-విజయవంతంగా ఫిర్యాదుల పరిష్కారం
-సమీకృత విధానంతో ప్రజల్లో పెరిగిన నమ్మకం
-ఎనిమిది నెలల్లో రెండు లక్షల ఫీడ్‌బ్యాక్ రేటింగ్స్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫిర్యాదుల పరిష్కారానికి సమీకృత విధానం(ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ సిస్టం) ప్రవేశపెట్టడం ద్వారా పౌరసేవలను మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు జీహెచ్‌ఎంసీ కృషిచేస్తోంది. గడచిన ఎనిమిది నెలల్లో రెం డు లక్షల ఫీడ్ బ్యాక్ రేటింగ్స్ రావడమే కాకుండా ప్రజలు సంతృప్తి చెందకపోవడంవల్ల 1.36లక్షల ఫిర్యాదులను మళ్లీ తెరిచి వాటి పరిష్కారానికి కృషిచేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఏడు లక్షలకు చేరడం ప్రజలకు బల్దియా ఫిర్యాదుల వ్యవస్థపై ఏర్పడుతున్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుండగా, దేశంలోని మరే మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏ యాప్‌నూ ఇంత భారీస్థాయిలో డౌన్‌లోడ్ చేసుకోకపోవడం విశేషం.
మున్సిపల్ కార్పొరేషన్ అనేది పౌరసేవలకు ప్రధానకేంద్రమైన విషయం తెలిసిందే. జనన ధృవీకరణ పత్రం నుంచి మరణ ధృవీకరణ పత్రం వరకు అనేక సేవలు దీని ద్వారా లభ్యమవుతున్నాయి. అత్యంత కీలకమైన ప్రజారోగ్యం, పారిశుధ్యం, పచ్చదనం, చెరువుల సంరక్షణ, రోడ్లు, డ్రైనేజీ, అంటి అనుమతులు తదితర అనేక అంశాలు ఈ కార్పొరేషన్ ఆధీనంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రజలనుంచి అనేక ఫిర్యాదులు వస్తుంటాయి.

గతంలో కేవలం లిఖిత పూర్వకంగానే ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉండగా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున ఇప్పుడు ఫిర్యాదుచేసే మార్గాలు కూడా ఎక్కువయ్యాయి. జీహెచ్‌ఎంసీకి దాదాపు పది మార్గాలద్వారా ఫిర్యాదులు అందుతున్నాయి. బల్దియాకు వచ్చే ఫిర్యాదుల్లో మై జీహెచ్‌ఎంసీ యాప్, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, కాల్ సెంటర్, సోషల్ మీడియా(ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర), నేరుగా లిఖితపూర్వకంగా వచ్చే ఫిర్యాదులు, అధికారులకు ఫోన్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా తదితర పది మార్గాలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి ఓ సమీకృత విధానాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అంతేకాదు, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకుగాను అవి పరిష్కారమవుతున్నాయా, లేదా అనేది ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలుసుకోవడంతోపాటు ఫిర్యాదుదారుల అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం కలిగింది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ వివిధ మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా సమీకృతంచేసి వాటి పరిష్కారానికి కృషిచేస్తోంది.

ఫిర్యాదుల పర్యవేక్షణ...
ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలుచేసే క్రమంలో భాగంగా సమస్యల పరిష్కానికిగాను ఆఫీసర్స్ యాప్ అప్‌డేటెడ్ వర్షన్‌ను రూపొందిస్తున్నారు. అంతేకాదు, కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుదారు ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటూ ఒకవేళ వారు సంతృప్తిచెందనిపక్షంలో ఫిర్యాదులను మళ్లీ తెరిచి(రీఓపెన్) వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. గత ఎనిమిది మాసాల్లో 200717 ఫీడ్‌బ్యాక్ రేటింగ్స్ రాగా, ఫిర్యాదుదారి స్పందన ఆధారంగా 103600ఫిర్యాదులను మళ్లీ తెరిచారు. అలాగే, ట్విట్టర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సైతం నమోదుచేయడంతోపాటు పరిష్కారమయ్యేవరకు వాటిని పర్యవేక్షిస్తున్నారు.

-మై జీహెచ్‌ఎంసీ యాప్...
బల్దియా ద్వారా లభ్యమయ్యే వివిధ సేవలను అందుకునేందుకే కాకుండా ఫిర్యాదులు చేసేందుకు సైతం ఉపయోగపడే మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను కాలానుగుణంగా అప్‌డేట్ చేయడంతో దీని వినియోగం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్‌కు సంబంధించి జనవరి 2018నాటికి 3.07లక్షల డౌన్‌లోడ్‌లు ఉండగా, డిసెంబర్ 2018నాటికి వాటి సంఖ్య 699199కి పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దేశంలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఏ యాప్‌నైనా ఇంత భారీస్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

-పెరిగిన జవాబుదారీ...
ఫిర్యాదులపై అధికారులు చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఈ సమీకృత ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సాధ్యమవుతోంది. ఫిర్యాదుపై చర్యల పురోగతి వివరాలు సంబంధిత అధికారితోపాటు ఫిర్యాదుదారుడికి కూడా ఎస్‌ఎంఎస్ రూపంలో ఎప్పటికప్పుడు సమాచారం అం దుతుంది. అంతేకాదు, సమస్య పరిష్కారం అయ్యాక కాల్ సెంటర్‌నుంచి ఫిర్యాదుదారుకు ఫోన్‌చేసి అతని ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. సమస్యకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకునే వీలుంది. అధికారుల చర్యలపై ఫిర్యాదుదారు సంతృప్తి చెందనిపక్షంలో ఫిర్యాదును మళ్లీ తెరిచి పరిష్కారానికి తిరిగి చర్యలు చేపడతారు. అధికారులకు స్పష్టతకోసం ఫిర్యాదులను 125 శ్రేణులుగా విభజించి సులభంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...