అరచేతిలో జ్యువెల్లరీ సెలెక్షన్


Tue,January 15, 2019 05:52 AM

-ఆభరణాల ప్రియుల కోసం ప్రత్యేక యాప్
-అందుబాటులోకి జ్యువెల్లరీ కార్ట్‌డాట్ ఇన్‌యాప్
-ఈ నెల 20 న ప్రారంభం
-900 షాపులు, వేలాది డిజైన్ల సమాచారం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కెంపులు, హారాలు, కమ్మలు, ఉంగరాలు ఇలా ఆందానికి వన్నె తెచ్చే ఆభరణాలంటే ఇష్టపడని మగువలుండరు. కొత్త డిజైన్లు ధరించాలని, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకోని మహిళలుండరు. కాని మంచి డిజైన్లు ఎక్కడ దొరుకుతాయి. డిస్కౌంట్లు ఆఫర్లు ఏ దుకాణంలో లభిస్తున్నాయన్న విషయాలు తెలుసుకోవాలంటే తలకు మంచిన భారం. వినియోగదారులు ఎదుర్కోనే ఇలాంటి తిప్పలు తప్పించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి రాబోతున్నది. ఆభరణాల ప్రియుల కోసమే జ్యువెల్లరీ కార్ట్ డాన్ ఇన్ పేరు రూపొందించిన ఈయాప్ త్వరలోనే నగరవాసులకు సేవలందించనుంది. ఇలాంటి యాప్ మరెక్కడా లేదని, కేవలం మన హైదరాబాదీల కోసమే రూపకల్పన చేశామని తయారీదారులు పేర్కోంటున్నారు.నగలు కొనడమంటే సెలెక్షన్ అనేది అతిపెద్ద సమస్య. నచ్చిన వాటి కోసం వందలాది షాపులు తిరగాలి.

వేలాది డిజైన్లను సరిచూసుకోవాలి. ఇలా తిరిగి తిరిగి విసుగెత్తాల్సిన అవసరం లేకుండా. గందరగోళానికి తావు లేకుం డా..తిరిగి తిరిగి బేజారుకాకుండా ఉండేందుకే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొనుక్కోక ముందే బంగారు ఆభరణాలు ధరించి, చూసుకుంటే ఎంత బాగుంటుండు. అదికూడా మన ఇంటి ముంగిట్లో.. మన అరచేతిలో అయితే బాగుండు అని అనుకునే వారికి ఈ యాప్ ఉపయోగపడనుంది. మన చేతిలోని మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నచ్చినవాటిని ఎంచుకోవడం.. కావాల్సిన వాటిని కొనుక్కోవడం ఈ యాప్ ప్రత్యేకతలు. ఒక దుకాణం, ఒక కొట్టులోనివే కాదండోయ్. వందలాది షాపుల్లో అందుబాటులో గల వేలాది డిజైన్లను చూసుకుని, అవి మనకు సరిపోతాయో లేదో పోల్చుకోవచ్చు.

అంతే కాదు..ఏ షాపులో ఎంత ధర పలుకుతుందో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి గ్రేటర్‌లోని 900 షాపుల వివరాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. రాబోవు మూడేండ్లల్లో 3 వేల షాపుల్లో గల ఆభరణాలను యాప్ ద్వారా నగరవాసులందిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆభరణాలు, నగల వ్యాపారంలో హైదరాబాద్ దేశంలో 6వ స్థానం లో ఉంది. మన దగ్గర ప్రతీ ఏటా 82 వేల టన్నుల ఆభరణాలు అమ్ముడుపోతున్నాయి. 15 వేల కోట్ల వ్యాపారం ఒక్క హైదరాబాద్‌లో జరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి,వినియోగదారులకు సులభంగా, మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా నేరుగా ఆభరణాలను కొనుక్కునేలా యాప్‌ను రూపొందించారు.నగరానికి చెందిన 135 ఏండ్ల చరిత్ర కలిగిన కిమ్టి జ్యూవెల్లర్ సంస్థ జ్యువెల్లరీ కార్ట్ డాట్ ఇన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్‌లోని హోటల్ హయత్ ప్లేస్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్, జ్యువెల్లరీ అసొసియేషన్ ప్రతినిధులు ఈ యాప్‌ను ప్రారంభిస్తారని నిర్వాహకులు దీపక్ కిమ్టి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌పై తాము ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, దశల వారిగా దేశమంతటా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని దీపక్ కిమ్టి వెల్లడించారు.

227
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...