సీట్లు.. ప్రతిపక్షాల పాట్లు


Tue,November 13, 2018 12:26 AM

-పొత్తులపై తమ్ముళ్లు గరంగరం
-కత్తులు దూస్తున్న కాంగ్రెస్ ఆశావహులు
-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రతి పక్ష కాంగ్రెస్, టీడీపీలో సీట్ల పంపకం తలకు మించిన భారంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలు తమకే కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ భవన్ వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు. టీడీపీకి కేటాయిస్తున్న స్థానాలు తమకే కావాలంటూ కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్ ఎదుట రణరంగం సృష్టిస్తున్నారు.

అనైతిక పొత్తులపై తమ్ముళ్లు కత్తులు దూస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలపై పట్టుపడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా నిరసనల పర్వం సాగిస్తున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ తమ్ముళ్లు రోడ్డెక్కగా తాజాగా, ఈ జాబితాలో మరిన్ని నియోజకవర్గాలు నిరసన జాబితాలో చేరాయి. ఇబ్రహీంపట్నం, సికింద్రాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకే అవకాశం కల్పించాలంటూ సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోని మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీపీ ముఖ్యనేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి ఎదుట అనైతిక పొత్తులపై గరం గరం అయ్యారు. పట్టున్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదని, టీడీపీ స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయిస్తే సహరించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళన చేస్తున్న తమ్ముళ్లకు సర్దు చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా సాయంత్రం వరకు నిరసన పర్వాన్ని కొనసాగించారు. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు టీటీడీపీ సిద్ధ్దమవుతున్న తరుణంలో మరిన్ని అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడే అవకాశాలు కనబడుతున్నాయి.

పొత్తు కుదిరిన స్థానాల్లోనూ..
పొత్తులో భాగంగా టీటీడీపీ ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మలక్‌పేట, బహదూర్‌పురా/కార్వాన్, జూబ్లీహిల్స్/ఖైరతాబాద్, సికింద్రాబాద్/సనత్‌నగర్ స్థానాలపై పట్టుపడుతున్నది. అయితే ఇందులో ఇప్పటి వరకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, మలక్‌పేట స్థానాలను ఖరారు చేసినట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. ఉప్పల్‌లో వీరేందర్‌గౌడ్, శేరిలింగంపల్లిలో భవ్యా ఆనంద్‌ప్రసాద్, కూకట్‌పల్లిలో ఇనగాల పెద్దిరెడ్డి, మలక్‌పేటలో ముజరఫ్ అలీ అభ్యర్థులను బరిలోకి దింపి ఈ స్థానాలను నేడు ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్, సికింద్రాబాద్ స్థానాల్లో తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంలో భీంరెడ్డి ఎల్బీనగర్‌లో సామ రంగారెడ్డి, శేరిలింగంపల్లిలో మొవ్వా సత్యనారాయణ వర్గీయులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు.

ఇక కూకట్‌పల్లి స్థానాన్ని ఇనుగాల పెద్దిరెడ్డికి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని కార్పొరేటర్ శ్రీనివాస్ రావు వర్గీయులు స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి టికెట్ విషయంపై సైతం నిరసన వ్యక్తమైంది. ఇలా సొంత పార్టీలోనే తమ్ముళ్లు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటే అప్పటి వరకు టికెట్ తనదేనంటూ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశావహుల నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందోనన్న ఆందోళన టీటీడీపీలో మొదలైంది. ఖరారు చేసిన స్థానాల్లో అభ్యర్థులకు కాంగ్రెస్ సహకారం దొరకడం, కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లోనూ తమ్ముళ్లను బుజ్జగించడం టీటీడీపీ ముఖ్య నేతలకు కత్తి మీద సాములా మారింది. ఇదే క్రమంలోనే సనత్‌నగర్, ముషీరాబాద్ స్థానాల్లోనూ తమ్ముళ్లు తిరుగుబావుటా ఎగురవేసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...