ఆశావహులు.. ఆగని నిరసనలు


Tue,November 13, 2018 12:23 AM

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: నగర కాంగ్రెస్‌లో టికెట్ కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారింది. అటు ఆశావహుల ఎదురుచూపులు.. ఇటు నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందే అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారని అంతా ఎదురు చూసినప్పటికీ నేతలకు నిరాశే ఎదురైంది. తాజాగా టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఫిర్యాదులపై అధిష్టానం దృష్టి కేంద్రీకరించడంతో ఇప్పటివరకూ ఖరారైనవని అనుకున్న స్థానాలపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అన్యాయం చేస్తున్నారని..
గడచిన వారం-పది రోజులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముషీరాబాద్ స్థానం నుంచి అనిల్ కుమార్, గోషామహల్ నుంచి ముఖేశ్‌గౌడ్, కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ, నాంపల్లి నుంచి ఫిరోజ్‌ఖాన్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్థన్‌రెడ్డి, సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలంగౌడ్, ఎల్బీనగర్ నుంచి సుధీర్‌రెడ్డి, మహేశ్వరం నుంచి సబితారెడ్డి తదితరుల పేర్లు ఖరారైనట్లు లీకులు వచ్చినప్పటికీ తాజాగా బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించలేదనే కారణంతో అధిష్టానం మళ్లీ ఖరారైన సీట్లను కూడా సోమవారం సమీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఖరారైన స్థానాల్లో కూడా మార్పులు జరిగే ఆస్కారం లేకపోలేదనే వాదనలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నది. ఇదిలాఉంటే, పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించినట్లు పేర్కొంటున్న ఉప్పల్, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట్ తదితర స్థానాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం తాము పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే తీరా ఎన్నికల నాటికి పొత్తుల పేరుతో తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీభవన్ వేదికగా ధర్నాలు కూడా నిర్వహించిన పార్టీ శ్రేణులు ఇక అధిష్టానంపై తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. టికెట్ రాని ఆశావహులు ఒకవైపు, పొత్తుల కారణంగా స్థానాలు కోల్పోయిన అభ్యర్థులు మరోవైపు కాంగ్రెస్‌కు తీవ్ర తలనొప్పిగా మారారు.

ఢిల్లీలోనే మకాం..
తీవ్ర ఆందోళనలు, సందిగ్ధ పరిస్థితుల మధ్య టికెట్ ఖరారైందని భావిస్తున్న నేతలు సైతం ప్రశాంతంగా ఉండకుండా తమ టికెట్‌ను కాపాడుకునేందుకు పైరవీల్లో మునికి తేలుతున్నారు. చాలామంది ఆశావహులు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. టికెట్ మనకే ఖరారైందని భావించి ప్రచారం చేపడితే తీరా బీఫామ్ మరొకరు తన్నుకుపోతారనే భయం వారిని వెంటాడుతున్నది. ఢిల్లీలో గంటగంటకూ మారుతున్న పరిణామాల మధ్య తీరా టికెట్ ఎవరు దక్కించుకుంటారనేది అర్థంకాకుండా ఉంది. సోమవారం నామినేషన్ల పర్వం మొదలుకావడంతో ఇతర పార్టీలు నామినేషన్లు వేసే బిజీలో ఉంటే తమకేమో చివరి నిమిషం వరకూ టికెట్ల తిప్పలు తప్పడంలేదని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా, తీవ్ర ఉత్కంఠ నడుమ కొనసాగుతున్న ఈ వ్యవహారానికి సోమవారం రాత్రి తొలి జాబితా విడుదలతో తెరపడింది.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...