ఆహార కొరతను అధిగమించాలి


Mon,November 12, 2018 12:54 AM

-యువ శాస్త్రవేత్తలు, పౌష్టికాహార నిపుణులు, ప్రభుత్వాలు పునరాలోచించాలి
-రోమ్ దేశ బయోవర్సిటీ డైరెక్టర్ ఆన్ టుట్విల్లర్
తార్నాక : లోపపోషణ, వాతావరణంలో మార్పులు నిసారవంతమైన వ్యవసాయ భూములు 21వ శతాబ్దానికి సవాళ్లుగా మారే ప్రమాదం ఉందని రోమ్ దేశానికి చెందిన బయోవర్సిటీ డైరెక్టర్ ఆన్ టుట్విల్లర్ ఆందోళన వ్యక్తం చేశారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సులు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఆహార పద్ధతుల్లో సమతుల్యం ద్వారా పౌష్టికాహారం పెంపుదల అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్ కాలంలో ఆహారం కొరతగా మారే ప్రమాదముందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మారిన కాలానికి అనుగుణంగా, పెరిగిన జనసాంధ్రతో మనం తీసుకునే ఆహార పద్ధతులు మారుతున్నాయని, రోగాలు, ఇతర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితులు దాపురించాయని, వీటిని అధిగమించేందుకు యువ శాస్త్రవేత్తలు, పౌష్టికాహార నిపుణులు, ప్రభుత్వాలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కారణం ఒకే రకమైన ఆహారానికి అలవాటు పడి ఇతర భిన్నమైన ఆహార పదార్థాల ద్వారా లభించే పౌష్టికతత్వాలు శరీరానికి అందలేకపోతున్నాయని పేర్కొన్నారు. ప్రకృతి మనకు అందించే వివిధ రకాల పౌష్టికాహారాల్లో కేవలం మూడు శాతం మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. గరిష్ట స్థాయిలో పౌష్టికాహారం ప్రజలందరికీ చేరాలంటే వ్యవసాయం ద్వారా అధిక కృషి జరుగాలన్నారు. రైతులు పెద్ద స్థాయిలో పంటలు పండించడంతోపాటు విభిన్న రకాలైన పంటలు సేద్యం చేసేలా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంఘాల కృషి అవసరమన్నారు. మానవాళికి కావాల్సిన అన్ని రకాలైన పౌష్టికాహారాలు అందినప్పుడే బలంగా ఉంటాడని, వీటికి తావునిచ్చే పరిస్థితులు ప్రస్తుతం కన్పించడం లేదన్నారు.

ఆకట్టుకున్న దేశీయ పౌష్టికాహార ప్రదర్శన
జాతీయ పోషకాహారం సంస్థ(ఎన్‌ఐఎన్) తార్నాకలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు దేశ నలుమూలల నుంచి పండించే ఆహార పదార్థాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నది. వివిధ రకాలైన పౌష్టికాహారాలు, ఆయా ప్రాంతాల్లో పండించే కూరగాయలు, పండ్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనతో 12 దేశాల నుంచి వచ్చిన ఆహార నిపుణులు నేరుగా సందర్శించి పరిశీలించారు. మన దేశంలో పండిస్తున్న ఆహార పదార్థాలు, ఇతర దేశాల్లో లభ్యమయ్యే ఆహార పదార్థాల వంటి తారతమ్యాలు, వాటి రుచి, ఇతర పౌష్టిక విలువలతో కూడిన గుణగణాలను ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు నిర్వాహకులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ శిశు సంక్షేమశాఖా సంయుక్త కార్యదర్శి డా.రాజేశ్‌కుమార్, బిల్‌గెట్స్ ఫౌండేషన్‌కు చెందిన ప్రతినిధి పూర్వీ మెహత, ఐసీఎంఆర్ న్యూట్రిషన్ హెడ్ డా. జీఎస్ తోతేజా, సదస్సు కన్వీనర్లు డా.టి.లోంగ్వా, సీనియర్ సైంటిస్టు డా.ఎ. లక్ష్మయ్యతో పాటు ఆహార నిపుణులు, ఇతర దేశాల ప్రతినిధులు, పీహెచ్‌డీ విద్యార్థులు పాల్గొన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...