పెప్పర్ స్ప్రే వీడియోలతో దొంగతనాలు


Sat,September 15, 2018 01:30 AM

మన్సూరాబాద్ : యూట్యూబ్‌లో పెప్పర్ స్ప్రేలు చిమ్మే వీడియోలను చూసి... వాటి ప్రేరణతో ఓ యువకుడు అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డాడు. పెప్పర్ స్ప్రేకు బదులు కారం పొడి కలిపిన నీటిని కండ్లలో చిమ్ముతూ వాహనాల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు సదరు నిందితుడిని అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 10.20 లక్షల విలువైన ఒక టాటా ఇండికా కారు, టాటా మ్యాజిక్ ఆటో, నాలుగు బైకులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ, తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలం, పెద్ద రాయవరం గ్రామానికి చెందిన మందపాక సాయి (25) డ్రైవర్. చెడు వ్యసనాలకు బానిసగా మారి... దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. రెండు నెలల పాటు అబ్ధుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాలీపై డ్రైవర్‌గా పని చేశాడు. అయితే... వ్యసనాలకు డబ్బులు సరిపోకపోవడంతో వాహనాల దొంగతనాలు చేసేందుకు పథకం వేసుకున్నాడు. దొంగతనాలు చేసేప్పుడు తనకు అడ్డు లేకుండా యూట్యూబ్‌లో చూసిన పెప్పెర్ స్ప్రే వీడియో తరహాలో ఆచరించాలనుకున్నాడు. అందులో భాగంగా కారం కలిపిన నీటి బాటిల్‌ను వెంట పెట్టుకుని దొంగతనాలకు బయలుదేరడం మొదలు పెట్టాడు. మొదటగా గత నెల 29న రాత్రి 9 గంటల సమయంలో హయత్‌నగర్ బస్టాప్ వద్ద టాటా మ్యాజిక్ ఆటో ట్రాలీని అద్దెకు మాట్లాడుకున్నాడు.

అబ్ధుల్లాపూర్‌మెట్ నుంచి ఆటోనగర్‌కు డ్రిల్లింగ్ మిషన్ తీసుకువచ్చేందుకు గాను ఆటోను రూ. 800లకు మాట్లాడుకుని బయలుదేరాడు. బాటసింగారం ప్రాంతంలోని మౌంట్ ఒపేరా సమీపంలోకి వెళ్లగానే డ్రిల్లింగ్ మిషన్ ఇక్కడే ఉందంటూ రోడ్డు నుంచి 200 మీటర్ల లోనికి తీసుకెళ్లా డు. ముందే వేసుకున్న పథకంలో భాగంగా కారం నీటిని డ్రైవర్ ముఖంపై చిమ్మి అతడి సెల్‌ఫోన్‌తో సహా ఆటోను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. ఓ వైపు కేసు దర్యాప్తు జరుగుతుండగానే... అదే తరహాలో ఈనెల 9న రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్‌లో రూ. 1200 లకు క్యాబ్‌ను బుక్ చేసుకుని గతంలో ఆటోను దొంగలించిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. కారు డ్రైవర్ కండ్లలో కారం నీటిని చల్లి కారు, సెల్‌ఫోన్‌ను అపహరించుకుని పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలు, నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం, కొర్లపాడు టోల్‌గేట్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు సాయి దొంగలించిన కారును విజయవాడ వైపునకు తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా... దొంగలించిన కారును తీసుకుని శుక్రవారం నగరానికి వస్తున్న సాయిని కొత్తగూడెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనాల విషయం బయటపడింది. దీంతో పాటు 20.06.2018న ఏపీ, రాజమండ్రిలో నాలుగు బైకులను అపహరించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడు మందపాక సాయిని శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, సీఐ ముని పాల్గొన్నారు.

226
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...