కాంగ్రెస్-టీడీపీ పొత్తులతో .. కీచులాట..!


Tue,September 11, 2018 12:21 AM

-పొత్తులే కుదరలేదు.. కత్తులు దూసుకుంటున్నారు
-అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో రగడ
-తమకే టికెట్ దక్కాలంటూ..ఒత్తిడి
-లేదంటే తిరుగుబావుటాకు సిద్ధం
-రగిలిపోతున్న ఆశావహులు
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ చరిత్రను సృష్టించారు. ఆయన ధైర్య సాహసాలతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ.. ఆ పార్టీకే స్నేహ హస్తాన్ని అందిస్తున్నది. ఒకటీ అర రాకపోతాయా అన్న ఉద్దేశ్యంతో సిద్ధాంతాలను, నైతిక విలువలను గాలికొదిలేసి అధికార పక్షాన్ని ఇబ్బందులకు గురి చేయాలని ఈ రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయి. అందుకే భావ సారూప్యత లేకపోయినా పొత్తులపై చర్చలు సాగిస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలాగూ రాలేమని గ్రహించిన తర్వాత ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తున్నది. దానికి తోడు తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబునాయుడుతో స్నేహానికి సిద్ధమవుతున్నది. పొత్తులు ఖరారైన తర్వాత ప్రచారంలో ఎలా ముందుకెళ్తారన్న ప్రశ్నల పరంపర కార్యకర్తల్లోనూ కొనసాగుతున్నది. అయితే హైదరాబాద్, శివార్లల్లో సెటిలర్ల ఓట్లు అత్యధికంగా ఉన్నాయన్న నెపంతో ఇక్కడి స్థానాలపైనే టీడీపీ గురి పెట్టింది. అందుకే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్ స్థానాలను కచ్చితంగా తమకే ఇవ్వాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే 2016 బల్దియా ఎన్నికల ఫలితాలను టీడీపీ, కాంగ్రెస్ గ్రహించడం లేదు. సెటిలర్లు, ఇతర ప్రాంతాల ఓటర్లంతా ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికాయి. శివార్లలోనూ టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతులు లభించిన దరిమిళా మద్దతు రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి, రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోకుండా నగర శివారు నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి పెట్టి కాంగ్రెస్‌నూ ఒకింత ఇబ్బందికి గురి చేస్తుందంటున్నారు.

ఇబ్రహీంపట్నం..
పొత్తుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్ నేనంటే నేనుగా పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అలాగే టీడీపీ నుంచి తుర్కయంజాల్ సింగిల్ విండో చైర్మన్ రొక్కం భీంరెడ్డి ఉన్నారు.

మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పోటీ చేస్తున్నారంటూ.. ప్రచారానికి తెర తీశారు. మరో నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి రెండేండ్లుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు టికెట్టు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చారు. ఆ మాట సబితా ఇంద్రారెడ్డి కూడా అంగీకరించినట్లు ప్రచారం. ఇప్పుడేమో మాట తప్పి తనే పోటీకి సిద్ధమవుతుండడంతో దేప భాస్కర్‌రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు.

ఎల్బీనగర్
పొత్తుల్లో టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తున్నది.అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా రోజులుగా కాలనీల్లో పర్యటిస్తూ తానే పోటీ చేస్తున్నానంటూ చెప్పుకున్నారు. ఇప్పుడేమో అపవిత్ర పొత్తులో భాగంగా ప్రత్యర్థ్ధి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాల్సి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది. టీడీపీ నుంచి సామ రంగారెడ్డి పేరు ఖరారైనట్లు చెబుతున్నారు.

చేవెళ్ల
చేవెళ్ల నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రాని మాజీ నాయకుడికే టికెట్ ఖరారు అయ్యిందంటూ ప్రచారం సాగుతున్నది. ఇప్పటి దాకా బరిలో ఉండాలని ఆశించిన వెంకటస్వామిని బుజ్జగించే పనిలో పెద్ద నాయకులు ఉన్నారు.

మల్కాజిగిరి
మల్కాజిగిరిపై కాంగ్రెస్ పార్టీలో నందికంటి శ్రీధర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ రంగ ప్రవేశం చేస్తారని, 12న పార్టీలో చేరుతారంటూ ప్రచారం సాగుతున్నది. టికెట్టు కూడా ఆయనకే కన్‌ఫార్మ్ అంటూ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో తమకే ఇవ్వాలంటూ పట్టు బడుతున్నారు. చాలా రోజులుగా పార్టీ కోసం పని చేసిన మండలి రాధాకృష్ణయాదవ్‌కు ఎలాంటి సానుకూల సంకేతాలు రావడం లేదు.

శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లు అధికంగా ఉన్నారన్న నెపంతో టీడీపీ అడుగుతోంది. రెండు రోజుల కిందటే పార్టీలో చేరిన మొవ్వా సత్యనారాయణకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఇప్పటి దాకా ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌కు నిరాశే మిగలనుంది. ఇరు పార్టీలూ తమదేనంటూ ప్రచారం సాగిస్తున్నాయి.

మేడ్చల్
మేడ్చల్‌ను కూడా ఇవ్వాలంటూ టీడీపీ పట్టుబడుతోందని సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లకా్ష్మరెడ్డి, తోటకూర జంగయ్యలు టికెట్ ఆశిస్తున్నారు.

కూకట్‌పల్లి
టీడీపీ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. కానీ కాంగ్రెస్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సతీశ్‌రెడ్డికి ఆ పార్టీ మొండి చేయి చూపుతున్నది. ఆయన నియోజకవర్గ అధ్యక్షుడిగా సేవలందించారు. అపవిత్ర పొత్తుతో పెద్ద నాయకులకే లాభం తప్ప తనకు జరిగేదేమీ లేదని సతీశ్‌రెడ్డి భావిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నది.

నగరంలోనూ అంతే
ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి, టీడీపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి, బీఎన్‌రెడ్డిలు ఉన్నారు. అయితే ఖైరతాబాద్‌ను కాంగ్రెస్‌కు కేటాయిస్తే జూబ్లీహిల్స్ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌కు కేటాయిస్తే ఖైరతాబాద్ టీడీపీకి వస్తుందని నాయకులు చెబుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది. ఆ పార్టీలోనే అంజన్‌కుమార్ యాదవ్, ఆదం సంతోష్, లక్ష్మణ్‌రావుగౌడ్, కార్తీకరెడ్డిలు పోటీకి రెడీ అంటున్నారు.ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా మరో ముగ్గురిని బుజ్జగించాల్సిన పరిస్థితి. టీడీపీలోనూ మేకల సారంగపాణి, బద్రీనాథ్ యాదవ్‌లు కూడా ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తాము నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించామన్న డిమాండ్‌ను ఉంచుతున్నారు.

224
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...