మహా శిల్పి..


Sun,September 9, 2018 12:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ రూపశిల్పిగా 40 ఏండ్లుగా చిన్న స్వామి రాజేంద్రన్ సేవలందిస్తున్నారు. ఆయన తమిళనాడు రాష్ట్రం, పెరంబదూరు జిల్లా పుదువేైట్టెక్కుడి గ్రామంలో చిన్న స్వామి, మరుదాయి దంపతులకు జన్మించాడు. రాజేంద్రన్‌కు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు. రాజేంద్రన్ ఐదోతరగతి వరకే చదువుకున్నారు. కాగా, కుటుంబపోషణ కోసం వేలు స్వామి అనే ఆర్టిస్ట్ వద్ద పనికి కుదిరిరాడు. 11 ఏండ్ల వయస్సు నుంచి పని నేర్చుకుంటూ ఎదిగారు. రాజేంద్రన్‌కుఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరు కంప్యూటర్ ఇంజినీర్లు. కొంతకాలం వేలుస్వామితో పని చేసిన మీదట అలనాటి సినీ నటుడు ఎన్టీ రామారావుతో ఏర్పడిన సాన్నిహిత్యంతో హైదరాబాద్‌తో పరిచయం పెరిగింది.
సినీ రంగానికీ సేవలు
దానవీరశూర కర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీం అనార్కలి, శ్రీనివాస కల్యాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, అనసూయమ్మ గారి అల్లుడు, సీతయ్య, నువ్వు నాకు నచ్చావ్ లాంటి పలు సినిమాలకు పనిచేశారు. ఆయా సినిమాల్లో ఎన్నో సెట్టింగులు వేసి దర్శక నిర్మాతలను మెప్పించారు.
అనేక ప్రాంతాల్లో..
1978 నుంచి హైదరాబాద్ మహా గణపతి సేవల్లో తరిస్తున్నారు రాజేంద్రన్. అలాగే దిల్‌సుఖ్‌నగర్, చప్పల్ బజార్, విజయవాడ ప్రాంతాల నుంచి ఆఫర్లు, ఆర్డర్లు రావడంతో పలు చోట్ల సేవలందించారు. చప్పల్ బజార్‌లోని వినాయక విగ్రహం కోసం 15 ఏండ్ల పాటు పని చేశారు.
విజయవాడలో 2015లో 63 అడుగుల విఘ్నేశ్వరుడి విగ్రహం, 2016లో 72 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లోనూ మూడు నాలుగేండ్ల పాటు సేవలందించారు. ప్రస్తుతం రాజేంద్రన్ ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ కాల సర్ప మహా గణపతికి సేవలందిస్తున్నాడు. ఈ గణనాథుని ఎత్తు 57 అడుగులు, 26 అడుగుల వెడల్పు. పస్తుతం ఈ విగ్రహానికి గాను రాజేంద్రన్ వద్ద 150 మంది శిష్య బృందం పని చేస్తోంది.
ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లోనూ..
నగరంలోనే కాకుండా ఇతర రాష్ర్టాలు, తెలుగు రాష్ర్టాల్లోని పలు జిల్లాలలో ఆయన సేవలందించారు. బీహార్‌లో రామాలయాన్ని 73 రోజుల్లో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు గ్రామంలో శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. యాదగిరిగుట్ట పరిధిలోని సురేంద్రపురి, కన్యకా పరమేశ్వరి, లోటస్ టెంపుల్‌ల నిర్మాణంలోనూ కృషి చేశారు.
ఖైరతాబాద్ గణనాథుని సేవల్లో...
1978 నుంచి ఖైరతాబాద్ గణనాథునికి రాజేంద్రన్ సేవలందిస్తున్నారు. కర్ర పూజతో మొదలుకొని గణనాథుని విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సారి మే 25వ తేదీన కర్రపూజ చేశారు. విగ్రహం తయారీకి 32 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నాన్ కెమికల్ (క్లే), 25 నుంచి 30 టన్నుల వరకు ఐరన్‌ను, లీడ్ ఫ్రీ రంగులను, ఇంకా నార/ పీచును ఇందుకు వినియోగిస్తున్నారు.
విశ్వరూప వినాయకుడు..
రామకృష్ణ స్టూడియోలో పని చేస్తుండగా ఏసుపాదం అనే వ్యక్తి పరిచయమై ఖైరతాబాద్ గణేశ్ సమితి చైర్మన్ శంకరయ్యను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఖైరతాబాద్ గణనాథుడి కోసం పని చేస్తున్నారు. 2006లో విశ్వరూప వినాయకుడి విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో 48 అడుగుల ఎత్తులో చేశారు. 1982లో మూషిక వినాయకుడి విగ్రహాన్ని చేశారు. ఇక్కడ సాగర సంగమం చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...