రుణాల మంజూరులో ఇంత నిర్లక్షమా?


Thu,November 28, 2019 12:37 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : రుణాల మంజూరులో ఇంత నిర్లక్షమేమిటని బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ రామ్మోహన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాల మంజూరులో తీవ్ర నిర్లక్షం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికారు. రుణాల మంజూరులో బ్యాంకర్లు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సంబంధిత బ్యాంకు యాజమాన్యాల సూచనలున్నప్పటికీ బ్యాంక్ బ్రాంచ్ స్థాయిలో కొందరు అధికారులు రుణాల మంజూరులో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్ జరిగేలా నిర్ణీత సమయం లో చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఈ పనులు సరిగా జరగడం లేదన్నారు. తద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం లభించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , జిల్లా పరిక్షిశమల శాఖ, డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు, మహిళా గ్రూపులకు రుణాలు సకాలంలో మంజూరు చేసి వారికి ఆర్థిక చేయూత అందించాలన్నారు.

తద్వారానే కుటుంబాలు, జిల్లా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పట్టణ మహిళా గ్రూపుల రుణాల మంజూరుకు సంబంధిత ఖాతాల్లో రెండు వాయిదాలు అడ్వాన్సు ఉంచాలని బోధన్‌లోని బ్యాంకు అధికారులు షరతు విధించడం పై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధన ఏ ఆదేశాల ప్రకారం చేశారని ప్రశ్నించారు. ఇలాంటి ఫిర్యాదు రాకుండా చూడాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. బ్రాంచ్ మేనేజర్లు తమకు స్వయం ప్రతిపత్తి ఉన్నదని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాల మంజూరులో కూడా 37.51 శాతం మాత్రమే మంజూరు చేశారని, ఇది సంతృప్తికరంగా లేదని, మొన్నటి వానాకాలం (ఖరీఫ్)లో 70 శాతం మాత్రమే మంజూరు చేశారని అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,604 కోట్ల లక్షానికి గాను సెప్టెంబర్ చివరి నాటికి రూ.2,909 కోట్లతో 51.91 శాతం రుణాలు మంజూరు చేశారని వివరించారు. నిర్దేశించిన లక్షానికి అనుగుణంగా బ్యాంకుల వారీగా ఆమోదించిన రుణ ప్రణాళిక ఆధారంగా పూర్తిస్థాయిలో రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన కింద రైతులందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్యక్షికమాలు, మొక్కలకు నీరు పోయడం, చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి ఆదేశించిందని, బ్యాంకులు వాణిజ్యపరంగా కాకుండా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎల్‌డీఎం జయసంతోషి, ఎస్‌బీఐ డీజీఎం సత్యనారాయణ, ఆర్‌బీఐ ఎల్‌డీవో ఎంఎం ఖాన్, డీఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా అధికారులు గోవింద్, శశికళ, సంధ్యారాణి, జయసుధ, నర్సింగ్‌దాస్, సమ్మయ్య, రాములు, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...