టీయూలో ర్యాగింగ్ రక్కసి!


Wed,November 27, 2019 01:22 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సీనియర్ల వేధింపులకు జూనియర్లు వణికి పోతున్నారు. యూనివర్సిటీకి కొత్తగా వచ్చిన విద్యార్థులను పరిచయ కార్యక్రమం పేరిట హింసిస్తున్నారు. దీంతో జూనియర్ విద్యార్థులు హడలిపోతున్నారు. యూనివర్సిటీలో చదువుకోలేమని ప్రొఫెసర్ల వద్ద మొరపెట్టుకుంటున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో రాత్రిపూట పరిచయం క్లాస్ అంటూ కొందరు సీనియర్లు.. జూనియర్ విద్యార్థులను రూముల్లోకి పిలిపించుకొని పాటలు పాడించడం, డ్యాన్సులు చేయించడం, కదలకుండా గంటల తరబడి నిలబెడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు, హాస్టల్ వార్డెన్, చీఫ్ వార్డెన్లకు తెలిసినప్పటికీ.. ఎలాంటి నిరోధక చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు గురిచేస్తున్నది. యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం పెరిగిపోవడంతో జూనియర్లు పలువురు టీసీలు తీసుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిజానికి వర్సిటీలో ర్యాగింగ్ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జరుగుతున్నప్పటికీ, ఎక్కడా బయటపడలేదు. వేధింపులకు గురైన కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కొక్కటిగా ఇష్యూ బయటకి వస్తున్నది. ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉన్నత లక్ష్యంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు.. ర్యాగింగ్ భూతం భయాందోళనకు గురిచేస్తున్నది. వారి బంగారు భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులా మారింది. జరుగుతున్న ఘటనలు వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇప్పటికే ఏదో ఒక ఇష్యూతో మీడియాలో, బయట వర్సిటీ పేరు నిత్యం వినిపిస్తున్నది. తాజాగా ర్యాగింగ్ ఘటనలు వెలుగుచూస్తుండడం ఈ విద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది.

అర్ధరాత్రి వేధింపులు...
హాస్టళ్లలో రాత్రి భోజనం తరువాత కొందరు సీనియర్లు రూముల్లోకి జూనియర్లను పిలిపించుకొని ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. సీనియర్లు అంటే గౌరవం ఇవ్వాలని, మేం కనిపిస్తే చేతులు కట్టుకోవాలని, తలదించుకోవాలని హుకుం జారీచేస్తున్నారు. అగ్గిపుల్లతో గది మొత్తం కొలవాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాదూ కూడదని ఎవరికైనా చెబితే, మీ అంతు చూస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు జూనియర్ విద్యార్థుల ద్వారా తెలిసింది. హాస్టళ్లలో జరుగుతున్న ర్యాగింగ్ విషయాన్ని పలువురు జూనియర్లు కేర్‌టేకర్లు, వార్డెన్ల దృష్టికి తీసుకెళ్లినా.. వారు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున వరకు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలామంది విద్యార్థులు వేధింపులకు గురవుతున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఇతర జిల్లాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ మంది విద్యార్థులు వర్సిటీలో సీట్లు సాధించి చదువుకుంటున్నారు. జరుగుతున్న సంఘటనలతో క్యాంపస్‌లో సీటు వచ్చిందనే ఆనందం వారిలో ఎక్కువ కాలం ఉండడం లేదు. ఉన్నత స్థాయికి చేరుకోవాలని వచ్చిన కొత్త విద్యార్థులు.. సీనియర్ల ఆగడాలు, వేధింపులను భరించలేకపోతున్నారు. తల్లిదండ్రులకు చెబితే వారు బాధపడతారని ఆవేదన చెందుతున్నారు. ఇటీవలే విశ్వవిద్యాలయంలో చదివే ఓ విద్యార్థి అర్ధరాత్రి సమయంలో ర్యాగింగ్ తట్టుకోలేక బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు రాత్రి సమయంలో ఆ విద్యార్థిని బస్సు ఎక్కించి వారి స్వగ్రామానికి పంపించినట్లు తెలిసింది.

కరువైన పర్యవేక్షణ..?
పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్(వీసీ) లేక వర్సిటీలో పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌చార్జి వీసీ అనిల్ కుమార్ వారం, పదిరోజులకు ఒకసారి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందో ఆయనకు అంతగా తెలియడం లేదని పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. పూర్తిస్థాయి వీసీ నియామకం జరిగితే వర్సిటీలో పర్యవేక్షణ పెరిగి ర్యాంగింగ్ లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండదు. టీయూకు పూర్తిస్థాయి వీసీ నియామకం కోసం ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తున్నది. త్వరలో వీసీ నియామకం జరిగే అవకాశం ఉంది.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ర్యాగింగ్ భూతంపై మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల వసతి గృహాల్లో వేరువేరుగా ఆయన అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులు చక్కగా చదువుకొని ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలన్నారు. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అడ్మిషన్ రద్దు చేస్తామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే సెల్‌నంబర్ సీఐ సెల్ నంబర్ 9440795409 , ఎస్సై సెల్‌నంబర్ 9440795421 సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. వర్సిటీకి కలంకం తెచ్చేలా ఎవరు వ్యవహరించినా చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ ఆరతి, చీఫ్ వార్డెన్ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇందూరులో విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి
ఇందూరు: హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పూర్ణకుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. సంజయ్ నివాసంలో స్వామీజీ మంగళవారం ప్రత్యేక పూజ లు నిర్వహించి బసచేశారు. అనంతరం నీలకంఠేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. సంజయ్ నివాసంలో పీఠపూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి పాదపూజ కోసం మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నివాసంలో ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలంగాణ సమన్వయకర్త సీహెచ్ కిరణ్‌రెడ్డి తెలిపారు. స్వామీజీ దర్శనానికి ఉభయ జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, ఎజాజ్, రమేశ్ కులకర్ణి, భారత్, సాయి, భక్తులు పాల్గొన్నారు.

రాజ్యాంగ హక్కులతోపాటు విధులు, బాధ్యతలు పాటించాలి
ఇందూరు: ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులతో పాటు విధులు, బాధ్యతలు తెలుసుకొని పాటించాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రియాంబుల్ చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతగా ఆయన సేవల్ని ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ఈ వేడుకలు 2020 అంబేద్కర్ జయంతి వరకు జరుగుతాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని ప్రాన్స్ అమెరికా యూకే ఆయా దేశాల నుంచి మంచి అంశాలను గుర్తించి అంబేద్కర్ చైర్మన్‌గా గొప్ప గొప్ప వ్యక్తులు రాజ్యాంగ రచనలో పాల్గొని ఎన్నో సంవత్సరాలు చర్చించి అందరికీ ఆమెదయోగ్యమైన రాజ్యాంగాన్ని రచించి 70 వసంతాలు పూర్తయినట్లు నవంబర్ 26న ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలన్నారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులతో పాటు విలువలు, బాధ్యతలు విధులు అందరూ గుర్తెరిగి నడుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, ఆయాశాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...