బోణీ అదిరింది


Sat,November 2, 2019 03:03 AM

-మొదటి రోజు రూ.8.65 కోట్ల మద్యం అమ్మకాలు
- గతంలో కంటే ఇది ఎక్కువ
-131 వైన్స్‌లకు మద్యం సరఫరా

మాక్లూర్ : కొత్త మద్యం పాలసీలో భాగంగా వైన్స్‌లకు ఇటీవల టెండర్లు నిర్వహించగా.. శుక్రవారం నుంచి దుకాణాలు తెరుచుకున్నాయి. వైన్స్‌లు ప్రారంభించిన తొలిరోజే శుక్రవారం రూ.8.67 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో మొత్తం 131 వైన్స్‌లు ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో 91 షాప్‌లు, కామారెడ్డి జిల్లాలో 40 మద్యం షాప్‌లు ఉన్నాయి. కొత్త వైన్స్‌లు శుక్రవారం ప్రారంభం కాగా.. ప్రొవిజనల్ లైసెన్స్‌లు పొందిన మద్యం వ్యాపారులకు మాక్లూర్ మండలంలోని మాదాపూర్‌లోని ఐఎంఎల్ డిపో నుంచి ఎక్సైజ్ అధికారులు మద్యం సరఫరా చేశారు. శుక్రవారం ఉదయం 7గంటల నుంచే మద్యం వ్యాపారులు తమ షాప్‌లకు మద్యాన్ని తీసువెళ్లడానికి క్యూ కట్టారు.భారీగా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయాయి. సేల్స్ రిప్రంజెంటీవ్‌లు, మద్యం వ్యాపారులు ఐఎంఎల్ డిపోకు తరలివచ్చారు. మద్యం అమ్మకాల గురించి వైన్స్ యజమానులతో, మద్యం సరఫరా చేసే వాహనదారులతో బిజీగా గడిపారు.

ఉభయ జిల్లాల నుంచి 131 మద్యం షాప్‌ల యజమానులు, వాటిని అమ్మే సేల్స్‌మెన్‌లు, ట్రాన్స్‌పోర్టు చేసే యజమానులు డిపో వద్దకు రావడంతో డిపో కళకళలాడింది. గతేడాది కంటే ఈసారి వైన్స్‌ల ప్రారంభం తొలిరోజు ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగినట్లు డిపో మేనేజర్ రమేశ్ తెలిపారు. 13,138 లిక్కర్(ఐఎంఎల్ కేసులు) రూ.6.47 కోట్ల వ్యాపారం సాగిందన్నారు. 19,396 బీరు కేసులకు సంబంధించి రూ. 2.18 కోట్ల వ్యాపారం.. మొత్తం 32,454 కేసులు అమ్మకాలు జరగగా.. వాటి ద్వారా రూ.8.65 కోట్ల వ్యాపారం మొదటి రోజు జరిగిందని మేనేజర్ తెలిపారు. ప్రతి వైన్స్‌కు 150 బీర్ కేసులు, 100 లిక్కర్(ఐఎంఎల్ కేసులు) మాత్రమే ఇచ్చినట్లు తెలిపారు. శనివారం నుంచి ఎప్పటిలాగే విక్రయాలు జరుగుతాయని తెలిపారు.

సజావుగా ముగిసిన ప్రక్రియ...
కొత్త మద్యం పాలసీని అనుసరించి రెండేండ్ల కాలపరిమితి కోసం నిర్వహించిన మద్యం టెండర్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా ముగిసింది. మొత్తం 91 దుకాణాలకు టెండర్లు నిర్వహించి డ్రా పద్ధ్దతిన దుకాణాలు కేటాయించారు. తక్కువగా దరఖాస్తులు వచ్చిన 8 దుకాణాలకు మళ్లీ తేదీని పొడిగించి కొత్త దరఖాస్తులను స్వీకరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరింది. మొత్తం దరఖాస్తుల ద్వారా, లైసెన్సు ఫీజులో పావువంతు భాగం చెల్లించడం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి జిల్లా నుంచి మొత్తం రూ. 36.22 కోట్ల ఆదాయం వచ్చింది. గురువారం ఎైక్సెజ్ అధికారులు మద్యం వ్యాపారులకు ప్రొవిజినల్ లైసెన్సులను జారీ చేశారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...