వినియోగదారుల హక్కుల గురించి విస్తృత ప్రచారం కల్పించాలి


Sat,November 2, 2019 03:01 AM

నిజామాబాద్ లీగల్ : వినియోగదారుల హక్కులు, చట్టం గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంలో మీడియా ప్రధాన భూమిక పోషించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆవరణలో నిర్మించిన నూతన జిల్లా ఫోరం భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వినియోగదారుడేనని, దైనందిన జీవనంలో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తాడని, వస్తువుల్లో లోపాలు ఉన్నా, సేవలు లభించకున్నా చట్ట ప్రకారం నష్ట పరిహారం పొందవచ్చని తెలిపారు. వినియోగదారుల హక్కుల గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలని, సమాజంలోని అందరికీ వినియోగదారుల చట్టం విలువ తెలిసినప్పుడే, వాటి ద్వారా లభించే అన్నిరకాల సేవలు కోరడానికి మార్గం లభిస్తుందన్నా రు. నీళ్ల బాటిల్ మొదలుకొని కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యత కలిగి ఉండాలని, నాణ్యతలేని వస్తువులు అమ్మడం చట్టరీత్యా నేరం అన్నారు. వినియోగదారుల చట్టం గురించి మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రచురించాలని, టీవీ విజువల్స్ ద్వారా వినియోగదారులను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఫోరం భవన నిర్మాణానికి కలెక్టర్ రామ్మోహన్‌రావు, జడ్జి పి. శ్రీసుధ చాలా సహకరించారని, భవిష్యత్తులో ఫోరం కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందించాలని జస్టిస్ జైస్వాల్ ఆశించారు.

న్యాయ సదస్సులు నిర్వహిస్తాం : జిల్లా జడ్జి
వినియోగదారులను చైతన్యవంతం చేయడానికి, చట్టాల గురించి తెలియజేయడానికి జిల్లా న్యాయసేవా సంస్థ కృషి చేస్తున్నదని, భవిష్యత్తులో మండల, గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున న్యాయ సదస్సులు నిర్వహించి న్యాయ విజ్ఞానాన్ని ప్రజలకు అందిస్తామని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి పి.శ్రీసుధ అన్నారు. ప్రభుత్వ శాఖల తరపున వినియోగదారుల హక్కుల గురించి తెలియజేయడానికి కృషిచేస్తామని, ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి వినియోగదారులను చైతన్య పరుస్తామని కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు సువర్ణ జయశ్రీ, అదనపు జిల్లా జడ్జి గౌతంప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జిలు పుష్పలత, కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జిలు ఉమామహేశ్వరి, జిల్లా ఫోరం సభ్యురాలు శ్యామల, రాష్ట్ర ఫోరం డిజిగ్నెటెడ్ అధికారి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...