ఇందూరు బీజేపీలో చెరోదారి!


Sat,November 2, 2019 03:01 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇందూరు బీజేపీ రెండు వర్గాలుగా వీడిపోయింది. పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయా? ఆయన ఎంపీ అర్వింద్‌తో కలిసి పనిచేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇటీవల వరుస సంఘటనలు ఇద్దరి మధ్య సఖ్యత లేదనే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయి, ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించుకోవడం.. ఇద్దరూ పాల్గొనాల్సి వచ్చే కార్యక్రమంలో ఎడమొఖం పెడమొఖంగా ఉండడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉప ఎన్నికల్లో ధర్మపురి శ్రీనివాస్‌పై పోటీ చేసి జేఏసీ అభ్యర్థిగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న యెండల లక్ష్మీనారాయణ.. ఇప్పుడు డీఎస్ తనయుడు ఎంపీ అర్వింద్‌తో అంత కలివిడిగా ఉండలేకపోతున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా యెండల అంటీముట్టనట్లుగానే ఉండిపోయారు. పలుసార్లు ఇదే విషయం చర్చకు వచ్చినా, దీన్ని యెండల సుతిమెత్తగా ఖండించారు. అలాంటిదేమీ లేదని పార్టీ అధిష్ఠానం మేరకు మేమంతా కార్యకర్తల్లా పనిచేస్తామని సమాధానమిస్తూ వచ్చారు.

తాజాగా మరోసారి ఇద్దరి మధ్య వర్గవిబేధాలు బహిర్గతం కావడంతో ఇదే విషయం ఇప్పుడు చర్చకు తెరలేపింది. గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తాదివస్‌లో వీరిద్దరూ వేర్వేరుగా పాల్గొన్నారు. రన్‌ఫర్ యూనిటీ, రన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌లో ఎంపీ అర్వింద్ ఆయన అనుచర బృందం పాల్గొనగా.. అనంతరం ఆఖరికి ప్రతిజ్ఞ చేసే సమయంలో మాత్రం యెండల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. తాజాగా శుక్రవారం గాంధీ సంకల్పయాత్రలో భాగంగా ఇరువురు బృందాలుగా విడిపోయి.. ఎవరికి వారే ర్యాలీలు నిర్వహించుకున్నారు. యెండల లక్ష్మీనారాయణతో రోషన్‌బోరా, పటేల్, న్యాలం రాజు, బట్టికిరి ఆనంద్ తదితరులు ఉండగా.. షరా మామూలుగా అర్వింద్ వెంబడి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, బస్వా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నాయి. ఫులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో మాత్రం ఇరువురు ఒకవేదిక పంచుకున్నారు. అదీ ముభావంగా.. ఎడమొఖం..పెడమొఖంగా. ఇదే రోజు సాయంత్రం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. దీనికి యెండల డుమ్మా కొట్టారు.

అసలు ఆయన పార్టీ కార్యాలయంలో జరిగే ఏ ప్రెస్‌మీట్‌కు కూడా హాజరుకావడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతూ వస్తున్నది.ఈ క్రమంలో అంతర్గతంగా విభేదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయని పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేదనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు ఒప్పుకుంటున్నారు. యెండల ఇంకా అర్వింద్‌ను డీఎస్ తనయుడిగానే భావిస్తున్నారా? ఎందుకు అర్వింద్‌తో సఖ్యతగా లేరు?అర్వింద్ కూడా యెండలను పెద్దగా పట్టించుకోవడం లేదెందుకు? ఇద్దరి మధ్య ఎక్కడ తేడా కొట్టింది? ఆ విభేదాలకు కారణాలేంటి? అనే విషయాలపై మాత్రం ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఈ ఇరువురి వ్యవహారం కొనసాగడంతో బీజేపీ శ్రేణులు మాత్రం గందరగోళానికి గురువుతున్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...